Begin typing your search above and press return to search.

అప్పటి సరదా ఏది? ఆనాటి సందడి ఎక్కడ?

By:  Tupaki Desk   |   18 Sep 2021 8:36 AM GMT
అప్పటి సరదా ఏది? ఆనాటి సందడి ఎక్కడ?
X
కరోనా అనేది మనిషికి .. మనిషి మధ్య దూరాన్ని పెంచేసింది. ఎదుటివారు చనువు తీసుకున్నా భయంతో వెనకడుగు వేసే పరిస్థితి తీసుకొచ్చింది. ఒకరి వైపు ఒకరు భయం భయంగా చూడటం .. బిక్కుబిక్కుమని బ్రతకడం అలవాటు చేసింది. ప్రశాంతంగా గుడికి వెళ్లలేని పరిస్థితి .. సరదాగా సినిమాకి వెళ్లలేని పరిస్థితి. చివరికి దగ్గర బంధువుల ఇళ్లలో ఫంక్షన్లకు వెళ్లలేని పరిస్థితి. అంతరిక్షంలోకి అవలీలగా దూసుకుపోయిన మానవుడు, నేడు అడుగు బయటపెట్టడానికి భయపడుతున్నాడు.

ఎవరి జీవనోపాధి ఏదైనా ... ఎవరు ఎంత కష్టపడినా అందరికి అందుబాటులో ఉన్న ఏకైన వినోద సాధనం సినిమానే. అలాంటి వినోద సాధనంపై కరోనా మామూలుగా పంజా విసరలేదు. వినోదాన్ని అందించడానికి అహర్నిశలు కష్టపడేవాళ్లందరి జీవితాలను విషాదమయమే చేసింది. థియేటర్ ముందు పోస్టర్ లేదు .. థియేటర్లో సినిమా లేదు. ఒకప్పుడు జాతరలను తలపించిన థియేటర్లు మనిషన్నవాడు లేక వెలవెలబోయాయి. పరిస్థితులు కాస్త కుదుటపడినప్పటికీ, జనాలలో జంకు పోలేదు. ఇక సినిమా వేడుకలు కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేవు.

కరోనా రావడానికి ముందు ఓపెన్ ఏరియాల్లో .. సువిశాలమైన గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంగరంగ వైభవంగా జరిగాయి. జనాలు పోటెత్తి రావడంతో ఆ సందడి .. సంబరం చూడటానికి రెండు కళ్లూ సరిపోయేవి కాదు. అలాంటిది ఇప్పుడు ముఖ్యమైనవారిని మాత్రమే పిలిచి, మీడియా కవరేజ్ పూర్తయిందనిపిస్తున్నారు. వేదికపై మైక్ తీసుకుని మాట్లాడటానికి భయపడే పరిస్థితుల్లోనే ఇంకా చాలామంది ఉన్నారు. అలా మైక్ తీసుకుని మాట్లాడి కరోనా బారిన సెలబ్రిటీలు కూడా చాలామందే ఉన్నారు పాపం.

ఇక ఇప్పుడు అవార్డు ఫంక్షన్లు కూడా ఇందుకు మినహాయింపు కాదనే విహాయం స్పష్టమవుతోంది. అవార్డుల ఫంక్షన్లో తారలంతా ఒక చోట మెరవడం చూసి చాలాకాలమే అయింది. కొంతకాలం క్రితం వరకూ విదేశాల్లో నిర్వహించే 'సైమా' .. 'ఐఫా' వంటి ప్రైవేటు అవార్డు వేడుకలలో సైతం సందడి చేసిన సినీతారలు, ఇప్పుడు ఆ వేడుకలు హైదరాబాద్ లో జరగనున్నప్పటికీ పెద్దగా ఉత్సాహం చూపించలేని పరిస్థితి. ఈ సారి 'సైమా' అవార్డుల ఫంక్షన్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. అది కూడా కూడా శని .. ఆదివారాల్లో.

ఇందుకు సంబంధించి సెలబ్రిటీల వైపు నుంచి సోషల్ మీడియాలో ఎలాంటి హడావుడి .. సందడి లేకపోవడం విశేషం. అసలు 'సైమా' వేడుకలు జరగనున్నది హైదరాబాద్ లోనేనా? అనే అనుమానం కూడా కలగక మానదు. ఇప్పుడు సరదా .. సందడి అనేది సాహసంతో ముడిపడి ఉంది కనుక, ఈ విషయంలో ఎవరినీ తప్పుపట్టలేం. ఇది కరోనా చేస్తున్న విచిత్రమైన విన్యాసంలో ఒక భాగమని సరిపెట్టుకోవడమే!