Begin typing your search above and press return to search.

చిరు-పూరి.. ఓ లాజిక్ మిస్సవుతోంది

By:  Tupaki Desk   |   22 Aug 2015 7:43 PM IST
చిరు-పూరి.. ఓ లాజిక్ మిస్సవుతోంది
X
హీరోగా చిరంజీవి రీఎంట్రీ మూవీ ఓ బ్రహ్మపదార్థంలా తయారైంది. ఏడాదిగా కొనసాగుతున్న సందిగ్ధతకు ఆ మధ్య తెరపడ్డట్లే కనిపించింది. చిరు పునరాగమనం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉంటుందని ప్రకటించాడు రామ్ చరణ్. అది జరిగి మూడు నెలలవడంతో చిరు పుట్టిన రోజు నాటికి ఈ సినిమా మొదలైపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఇంతలోనే మళ్లీ సస్పెన్స్. పూరితో సినిమా సందిగ్ధంలో పడిపోయింది. దీని గురించి చిరు స్వయంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పూరి చెప్పిన ‘ఆటోజానీ’ కథ సగం వరకు నచ్చిందని.. ద్వితీయార్ధం తనతోపాటు పూరికి కూడా సంతృప్తినివ్వలేదని అన్నారాయన. ఈలోగా పూరి వేరే సినిమా మొదలుపెట్టేశాడని చెప్పారు.

ఐతే పూరి ఈలోగా వేరే సినిమాలో బిజీ అయిపోయాడు అని చిరు చెప్పడంలో లాజిక్ మిస్సవుతోంది. పూరి మొదలుపెట్టింది వేరే ఎవరి సినిమానో కాదు. మెగా కుర్రాడు వరుణ్ తేజ్ హీరోగా ‘లోఫర్’ మూవీనే. చిరంజీవి సినిమాను పక్కనపెట్టేసి దీన్ని పూర్తి చేయాల్సినంత అత్యవసర పరిస్థితి ఏమొచ్చింది? అవసరమైతే దాన్ని హోల్డ్ లో పెట్టొచ్చు కదా. నాగబాబేమైనా పూరి మెడ మీద కత్తి పెడతాడా? అయినా పూరి స్పీడు గురించి ఎవరికి తెలియదు. వారం పది రోజుల్లో ఒక సినిమా మొత్తం రాసేయగల సమర్థుడతను. ఓ నెల రోజులు కూర్చునైనా చిరు సినిమా సెకండాఫ్ పక్కాగా రెడీ చేయలేడా? అంత వరకు వరుణ్ సినిమాను ఆపలేడా? అవసరమైతే ‘లోఫర్’ సినిమాను ఎన్నాళ్లు కావాలంటే అన్నాళ్లు పక్కన పెట్టొచ్చు కదా. ఎలాగూ వరుణ్ సినిమా ‘కంచె’ ఈ అక్టోబరులో విడుదల కాబోతోంది. కుర్రాడికి కొంచెం గ్యాప్ వచ్చినా పోయేదేముంది?

ఇప్పటికే చిరు సినిమా బాగా లేటవుతోందని అభిమానులు ఫ్రస్టేట్ అవుతున్నారు.. పూరికి అది ప్రతిష్టాత్మకమైన సినిమా కూడా. లైఫ్ టైం ఛాన్స్ అని అతనే చెప్పుకున్నాడు. దీన్ని బట్టి పూరి విషయంలో చిరు పునరాలోచనలో పడ్డాడేమో అనిపిస్తోంది. ఇంటర్వ్యూల్లో పూరి గురించి ప్రస్తావిస్తూనే ‘‘150 సినిమా గ్యారెంటీ. కానీ ఇంకా ఎవరితో అనేది తేల్చుకోలేదు’’ అని కూడా చెప్పాడు చిరు. కాబట్టి చిరు మనసులో పూరి మాత్రమే కాక వేరే వాళ్లు కూడా ఉన్నట్లే మరి.