Begin typing your search above and press return to search.

చూసేందుకు అలా కనిపించటం వల్లే అలాంటి పాత్రలు వస్తున్నాయట

By:  Tupaki Desk   |   10 Aug 2021 5:30 AM GMT
చూసేందుకు అలా కనిపించటం వల్లే అలాంటి పాత్రలు వస్తున్నాయట
X
కవ్విస్తున్నట్లు ఉండటం.. ముఖం సీరియస్ గా ఉన్నట్లు ఉండే నటీమణుల పేర్లు చెప్పమంటే.. నివేదా పేతురాజ్ పేరును చెప్పేస్తారు. ఆమె నటించిన సినిమాల్లో అటు గ్లామర్.. ఇటు సీరియస్ గా ఉన్నట్లుగా కనిపించటం ఆమె ప్రత్యేకత. అల వైకుంఠపురంలో కావొచ్చు.. మెంటల్ మదిలో.. బ్రోచేవారెవరురా.. లాంటి సినిమాల్లో సీరియస్ క్యారెక్టర్లు చేసినప్పటికి యువ ప్రేక్షకులకు ఇట్టే కనెక్టు కావటం నివేదా ప్రత్యేకత. తాజాగా ఆమె నటించిన పాగల్ చిత్రం ఈ వారం విడుదల కానుంది. ఈ సినిమా కథను ఐదుసార్లు విన్నట్లు చెప్పింది. విన్న ప్రతిసారీ ఎమోషనల్ గా కనెక్టు అయినట్లు చెప్పింది.

పాగల్ కథను విన్న ప్రతిసారీ తాను కన్నీళ్లు పెట్టుకున్నట్లు వెల్లడించింది. రెండేళ్ల క్రితం తానీ కథను విన్నట్లు వెల్లడించిన ఈ మూవీకి నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. తానీ సినిమా చేస్తున్నప్పుడు మంచి సినిమా.. మంచి పాత్రను పోషించిన ఫీలింగ్ తనకు కలిగిందని చెప్పింది. తాను చేసే సినిమా ఏదైనా సరే.. ఒక మంచి సినిమా చేస్తున్న భావన కలగాలని.. అంతకు మించిన వేరే ఫీలింగ్స్ తనకు ఉండవని చెప్పింది.

ఓపక్క సినిమాలు చేస్తూ.. బిజీగా ఉంటున్న నివేదా తనలోని మరో యాంగిల్ ను తాజాగా రివీల్ చేశారు. వేరే ఫీల్డ్ లో అవగాహన పెంచుకోవటం కోసం రేసింగ్ రంగంలోకి వెళ్లానని.. తాజాగా రేసింగ్ లో ఫస్ట్ లెవల్ పూర్తి చేసినట్లు చెప్పారు. ఓపక్క రేసింగ్ ట్రైనింగ్ తీసుకుంటూనే.. మరోవైపు కొత్త సినిమాలను ఓకే చేసినట్లు చెప్పారు. తెలుగులో ఒకటి.. తమిళంలో రెండు సినిమాలు చేస్తుందీ భామ.

ఆమె నటించిన చిత్రాల్లో క్యారెక్టర్లను చూస్తే.. చాలా సీరియస్ పాత్రల్ని చేసినట్లుగా కనిపిస్తారు. ఇదే విషయాన్ని ఆమెను అడిగితే.. తన లుక్స్ ను చూసి అలాంటి క్యారెక్టర్లు ఇస్తున్నారేమో కానీ తాను అలా ఉండదని చెప్పింది. చూసేందుకు సీరియస్ అమ్మాయిలా కనిపిస్తాను కానీ.. నిజానికి నేను అలా ఉండనని చెప్పింది.