Begin typing your search above and press return to search.

నిత్యా మీనన్ ఎందుకు వద్దనుకుందో?

By:  Tupaki Desk   |   3 Feb 2018 12:17 PM IST
నిత్యా మీనన్ ఎందుకు వద్దనుకుందో?
X
తేజ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ బయోపిక్ రెగ్యులర్ షూటింగ్ కోసం సిద్ధమవుతోంది. కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతూ తొలుత టీజర్ షూట్ చేసిన ఈ మూవీ మీద ఇప్పటికే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇప్పటి దాకా ఏ దర్శకుడు - రచయిత ఆయన జీవిత గాధను తెరకెక్కించే ప్రయత్నం చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఎన్టీఆర్ బాల్యం మొదలు కొని సినిమా రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించడం - స్టార్ హీరోగా ఎదిగే క్రమంలో ఆయన ఎదుర్కున్న ఆటుపోట్లు - సంచలన రాజకీయ ప్రవేశం - తెలుగుదేశం అధికారంలోకి రావడం తదితర ఘట్టాలన్నీ ఇందులో ఉంటాయట. ఆయన చివరి దశను మాత్రం ఎక్కువ స్పృశించకుండా వివాద రహితంగా సినిమా రూపొందించే పనిలో ఉన్నాడు తేజ. ఇక ఇందులో కీలక పాత్రల కోసం నటీనటుల వేట మాత్రం పెను సవాల్ గా మారుతోంది.ఇందులో కనిపించేవి నిజ జీవిత పాత్రలే కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర కోసం పెద్ద కసరత్తే జరిగిందట. నిత్యా మీనన్ ను సంప్రదిస్తే తొలుత ఒప్పుకుని తర్వాత మాత్రం చేయలేను అని నిస్సహాయత వ్యక్తం చేసినట్టు టాక్. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ సినిమాల మీద కొంత వివాదం రేగిన నేపధ్యంలో అనవసరంగా ఇష్యూ లో ఉండటం ఎందుకు అనుకుందో ఏమో నిత్యా ఫైనల్ గా నో అని చెప్పిందని తెలిసింది. ఇవన్ని అంతర్గతంగా జరిగిన చర్చలే తప్ప యూనిట్ ఏనాడూ బాలకృష్ణ తప్ప ఇంకా ఇందులో ఎవరెవరు ఉండబోతున్నారు అనేది మాట మాత్రం కూడా చెప్పలేదు. ఒకరకంగా చూస్తే అలా బయటికి వచ్చిన పేరు నిత్యా మీనన్ దే.

ఆ ప్లేస్ లో ఎవరిని తీసుకుంటారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇందులో ఎన్టీఆర్ సంతానాన్ని మొత్తం చూపించే అవకాశాలు ఉన్నాయి. ఏ రకంగా చూసుకున్నా భారీ స్టార్ కాస్ట్ అవసరం ఈ బయోపిక్ కు ఉంది. అక్కినేని నాగేశ్వర్ రావు గారితో ఎన్టీఆర్ కు మంచి సాన్నిహిత్యం ఉండేది కనక ఆ పాత్ర కూడా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇవన్ని ఒక కొలిక్కి రావడానికి కొంత టైం పట్టేలా ఉంది. అందుకే గ్యాప్ తీసుకుని అన్ని పక్కాగా కుదిరాకే ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్తుంది అని టాక్.