Begin typing your search above and press return to search.

'గ‌మ‌నం' లో నిత్యా మీనన్ ఫస్ట్ లుక్...!

By:  Tupaki Desk   |   18 Sept 2020 12:00 PM IST
గ‌మ‌నం లో నిత్యా మీనన్ ఫస్ట్ లుక్...!
X
సీనియర్ హీరోయిన్ శ్రియా శ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ''గ‌మ‌నం''. సుజ‌నా రావు దర్శకత్వం వహిస్తున్న ఈ రియ‌ల్ లైఫ్ డ్రామాలో నిత్యా మీనన్ కూడా స్పెషల్ రోల్ లో కనిపించనుంది. ఈ చిత్రంలో శాస్త్రీయ సంగీత గాయని శైలాపుత్రి దేవిగా నిత్య కనిపించనుంది. తాజాగా నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని యువ హీరో శర్వానంద్ విడుదల చేసారు. ఈ పోస్టర్ లో నిత్య ప్రత్యేకంగా సాంప్రదాయమైన వస్త్రధారణలో సంగీత కచేరి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన శ్రీయా ఫస్ట్ లుక్ పోస్టర్‌ కు మంచి స్పందన లభించింది. డీ గ్లామరస్ రోల్ లో శ్రియా ని చూసి అందరూ షాక్ అయ్యారు. అప్పటి నుంచి ఈ సినిమా మీద ఆసక్తి పెరిగిందని చెప్పవచ్చు. ఇప్పుడు నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ ద్వారా మేకర్స్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నారు.

కాగా ''గ‌మ‌నం'' చిత్రం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా ఈ చిత్రానికి సంభాష‌ణ‌లు రాస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌ గా ప‌నిచేస్తున్న జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. నిర్మాత అవ‌తారం ఎత్తి, ర‌మేష్ క‌రుటూరి - వెంకీ పుష‌డ‌పు ల‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్త‌యిన 'గ‌మ‌నం' చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో ఈ చిత్రంలో ప‌నిచేస్తున్న తారాగ‌ణం వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు.