Begin typing your search above and press return to search.

నితిన్ లవ్ స్టోరీలు పక్కన పట్టేసినట్టేనా?

By:  Tupaki Desk   |   20 Sep 2021 2:30 AM GMT
నితిన్ లవ్ స్టోరీలు పక్కన పట్టేసినట్టేనా?
X
టాలీవుడ్లోని హ్యాండ్సమ్ హీరోల్లో నితిన్ ఒకరిగా కనిపిస్తాడు. నితిన్ టీనేజ్ లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. ప్రేమకథలతోనే ఆయన ప్రయాణం మొదలైంది. 'జయం' సినిమా చూసిన వాళ్లంతా, తెలుగు తెరకి మంచి లవర్ బాయ్ దొరికాడని అనుకున్నారు. చక్కని కనుముక్కుతీరుతో కుర్రాడు కుదురుగా కనిపించడంతో, వరుసగా ప్రేమకథలే వచ్చిపడ్డాయి. అవే యూత్ లో ఆయనకి ఎక్కువ క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. అందగాడు కావడంతో అమ్మాయిల్లో ఫాలోయింగ్ కూడా బాగా ఉండేది.

నితిన్ కి కూడా వరుస పరాజయాలు తప్పలేదు. ఆ సమయంలో ఆయనను ఆదుకున్నవి కూడా ప్రేమకథలే. 'గుండెజారి గల్లంతయ్యిందే' .. 'ఇష్క్' వంటి ప్రేమకథలు మళ్లీ కొత్త ఉత్సాహంతో ఆయన కెరియర్ ను ముందుకు పరుగులు తీయించాయి. నితిన్ తరువాత ఇండస్ట్రీకి చాలామంది కుర్రహీరోలు వచ్చారు. వాళ్ల పోటీని తట్టుకుని నితిన్ నిలబడటానికి కారణం కూడా ఆయన చేస్తూ వచ్చిన ప్రేమకథలే. నితిన్ ను చూస్తే ఇంకా ప్రేమకథలే చేస్తున్నాడని అనిపించదు. అందుకు కారణం ఆయన ఇంకా లేతగా .. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన కుర్రాడిలా అనిపించడమే.

అయితే నితిన్ మాత్రం ఇకపై లవ్ స్టోరీస్ చేయనని చెప్పి ఈ మధ్య ఒక స్టేజ్ పై చెప్పాడు. ''సీనియర్ హీరోలే రొమాంటిక్ పాత్రలు చేయడానికి ఉత్సాహపడుతుంటే ఈ అబ్బాయేంటి ఇంతమాట అనేశాడు'' అని అంతా అనుకున్నారు. ఏదో ఫ్లోలో అనేసి ఉంటాడని చెప్పుకున్నారు. కానీ చూస్తుంటే నితిన్ నిజంగానే పేమకథలను పక్కన పెట్టేసినట్టుగా అనిపిస్తోంది .. కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన సెట్ చేసుకుంటూ వెళుతున్న ప్రాజెక్టులను చూస్తుంటే, ఈ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం బలంగానే కనిపిస్తోంది.

నితిన్ తాజా చిత్రంగా 'మాచర్ల నియోజక వర్గం' సినిమా రూపొందుతోంది. ఇది పూర్తిగా యాక్షన్ సినిమా. రాజకీయాల నేపథ్యంలో నడిచే మాస యాక్షన్ మూవీ. ఫస్టు పోస్టర్ తోనే ఈ విషయం అర్థమైపోయింది. ఇక తరువాత నితిన్ .. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. అది కూడా యాక్షన్ పాళ్లు ఎక్కువున్న సినిమానే. ఆయన హోల్డ్ లో పెట్టిన 'పవర్ పేట' కూడా మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న యాక్షన్ సినిమానే. నితిన్ ఇప్పటికీ చాక్లెట్ బాయ్ లనే కనిపిస్తూ ఉంటాడు గనుక, అడపా దడపా యాక్షన్ సినిమాల వైపు వెళ్లినా .. కొంతకాలం పాటు లవ్ స్టోరీస్ చేస్తేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.