Begin typing your search above and press return to search.

'మాస్ట్రో' మ్యూజిక్ ఫెస్ట్ మొదలవుతోంది..!!

By:  Tupaki Desk   |   10 July 2021 4:52 AM GMT
మాస్ట్రో మ్యూజిక్ ఫెస్ట్ మొదలవుతోంది..!!
X
యూత్ స్టార్ నితిన్ హీరోగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ''మాస్ట్రో''. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇటీవలే ఫైనల్ షెడ్యూల్ ప్రారంభించి చిత్రీకరణ మొత్తం పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెడుతున్న మేకర్స్.. వచ్చే వారం నుండి మాస్ట్రో మ్యూజిక్ ఫెస్ట్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్సమెంట్ పోస్టర్‌ లో నితిన్ ఒక బీచ్‌ లో పియానో ​​వాయిస్తూ కనిపిస్తున్నాడు. ఇంతకుముందు నితిన్ హీరోగా నటించిన 'భీష్మ' చిత్రానికి చార్ట్‌ బస్టర్ ఆల్బమ్‌ అందించిన మహతి స్వర సాగర్ ''మాస్ట్రో'' చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. దీంతో యువ హీరోకు మహతి మరొక చార్ట్‌ బస్టర్ ఆల్బమ్‌ ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

'మాస్ట్రో' నితిన్ కెరీర్ లో వస్తున్న 30వ సినిమా. హిందీ బ్లాక్ బస్టర్ హిట్ 'అంధాదున్' తెలుగు రీమేక్ గా రూపొందుతోంది. ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. మిల్కీబ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు - నితిన్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్‌ విశేష స్పందన తెచ్చుకున్నాయి.

రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్న 'మాస్ట్రో' చిత్రాన్ని శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డిలు నిర్మిస్తున్నారు. జె యువ‌రాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఎస్ఆర్ శేఖర్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ న‌రేష్‌ - జిషుసేన్ గుప్తా - శ్రీ‌ముఖి - అన‌న్య‌ - హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ - ర‌చ్చ ర‌వి - మంగ్లీ - శ్రీ‌నివాస్ రెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

'మాస్ట్రో' మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నితిన్ కెరీర్లోనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న 'మాస్ట్రో' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.