Begin typing your search above and press return to search.

'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం` రిలీజ్ డేట్ ఫిక్స్

By:  Tupaki Desk   |   8 May 2022 12:14 PM GMT
మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం` రిలీజ్ డేట్ ఫిక్స్
X
యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం ఎం.ఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో `మాచర్ల నియోజక వర్గం` చిత్రంలో నటిస్తున్నాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి- నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నితిన్ నటిస్తున్నాడు. రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

మాచర్ల నియోజకవర్గం ముందుగా జూలై 8న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే పెండింగ్ పనుల కారణంగా సినిమా వాయిదా పడింది. ఇప్పుడు ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి స్వాతంత్య్ర‌ దినోత్సవం సెల‌వు (సోమవారం) క‌లిసి రానుంది. తెలుపు చొక్కా డెనిమ్ జీన్స్ ధరించి నితిన్ తన చొక్కా చేతులు ముడుచుకుంటూ క‌నిపించిన ఫోటో వైర‌ల్ గా మారింది. ఫోటోలో నితిన్ ముఖంలో తీక్ష‌ణ‌త అభిమానుల‌ను ఆక‌ర్షిస్తోంది.

ప్రస్తుతం యూరప్ దేశాల్లోని ఇటలీ- ఆస్ట్రియాలోని కొన్ని సుందరమైన లొకేషన్లలో ఈ సినిమా పాటల చిత్రీకరణ జరుగుతోంది. నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేయగా దానికి అనూహ్యంగా రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్ స‌హా వీడియోలో నితిన్ సీరియ‌స్ అవతార్ లో కనిపించాడు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తుండ‌గా మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్ అందించారు.

పక్కా మాస్- కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రాజకీయ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి- కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా ప‌ని చేస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌. ముగ్గురు మాస్టర్స్ వెంకట్- రవివర్మ - అనల్ అరసు సినిమా యాక్షన్ పార్ట్ కు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండేలా కొరియోగ్రఫీ చేసారు. నితిన్ కొంత‌కాలంగా స‌రైన బ్లాక్ బస్ట‌ర్ హిట్ కోసం వేచి చూస్తున్నాడు. భీష్మ త‌ర్వాత మ‌ళ్లీ అదే జోష్ తో నిరూపించాల‌ని త‌పిస్తున్నాడు. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంతో ఆశించిన‌ది ద‌క్కుతుందనే అభిమానులు భావిస్తున్నారు.