Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: నిర్మలా కాన్వెంట్

By:  Tupaki Desk   |   16 Sep 2016 9:31 AM GMT
మూవీ రివ్యూ: నిర్మలా కాన్వెంట్
X
చిత్రం : ‘నిర్మలా కాన్వెంట్’

నటీనటులు: రోషన్ - శ్రియ శర్మ - అక్కినేని నాగార్జున - ఆదిత్యమీనన్ - ఎల్బీ శ్రీరామ్ - సూర్య - అనితా చౌదరి - రవిప్రకాష్ - సమీర్ - తాగుబోతు రమేష్ తదితరులు
సంగీతం: రోషన్ సాలూరి
ఛాయాగ్రహణం: విశ్వేశ్వర్
నిర్మాతలు: అక్కినేని నాగార్జున - నిమ్మగడ్డ ప్రసాద్
రచన - దర్శకత్వం: నాగ కోటేశ్వరరావు

కొత్త టాలెంటుని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే అక్కినేని నాగార్జున.. తన మిత్రుడు నిమ్మగడ్డ ప్రసాద్ తో కలిసి తన సొంత బేనర్లో శ్రీకాంత్ తనయుడు రోషన్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన సినిమా ‘నిర్మలా కాన్వెంట్’. నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చాన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. నాగ్ స్వయంగా ఓ కీలక పాత్ర కూడా పోషించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. మరి నాగ్ అంత శ్రద్ధ పెట్టిన ఈ సినిమాలో ఏముందో చూద్దాం పదండి.

కథ:

భూపతి నగరం అనే పల్లెటూరిలో భూపతి రాజు (ఆదిత్య మీనన్) పెద్ద జమీందారు. అతడు 99 ఎకరాల ఆసామి అయినప్పటికీ.. అతడి పొలంలోకి నీళ్లు ఓ చిన్న రైతు పొలం నుంచే రావాల్సి ఉంటుంది. ఆ పొలంపై భూపతి రాజు కన్నుంటుంది. రాజు కుటుంబంతో గొడవ వల్ల తన తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో ఆయనిచ్చిన మాట కోసం తన ఎకరా పొలాన్ని అమ్మకుండా అందులోనే వ్యవసాయం చేసి బతుకుతుంటాడు డేవిడ్ (సూర్య). ఐతే భూపతి రాజు కూతురు శాంతి (శ్రియ శర్మ).. డేవిడ్ కొడుకు శ్యామ్ (రోషన్) ఒకే స్కూల్లో చదువుతూ ప్రేమలో పడతారు. వారి ప్రేమ గురించి తెలియగానే భూపతి రాజు ఉగ్రరూపం దాలుస్తాడు. తర్వాత తన కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి డేవిడ్ దగ్గర పొలం రాయించుకుంటాడు రాజు. తనలాగా కోటీశ్వరుడియ్యాకే పెళ్లి చేస్తానంటూ మాట మారుస్తాడు. ఈ పరిస్థితుల్లో శ్యామ్ ఏం చేశాడు.. తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు.. అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఒక పెద్దింటి అమ్మాయి.. ఒక పేదింటి కుర్రాడు.. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఆటోమేటిగ్గా అమ్మాయి వైపు వాళ్లు అడ్డం పడతారు. కుర్రాడి పేదరికాన్ని ఎగతాళి చేస్తారు. దమ్ముంటే డబ్బు సంపాదించుకుని రమ్మంటారు. దీంతో కుర్రాడు ఛాలెంజ్ చేస్తాడు. కోటీశ్వరుడై అమ్మాయి చేయి అందుకుంటాడు. ఎన్ని వందల సార్లు చూసి ఉంటాం ఇలాంటి కథల్ని. ‘నిర్మలా కాన్వెంట్’ కూడా కూడా డిట్టో అదే ఫార్మాట్లో సాగిపోతుంది. కాకపోతే ఇక్కడ హీరోయిన్లు టీనేజర్లు. కాన్వెంట్లో చదువుతుంటారు. హీరో చిన్నవాడు కాబట్టి ఆ పనీ ఈ పనీ చేయకుండా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తరహా క్విజ్ పోటీలో పాల్గొని కోటీశ్వరుడైపోతాడు. అంతే తేడా.

శ్రీకాంత్ తనయుడు రోషన్ ఎలా చేశాడో చూడాలనిపిస్తే.. నాగార్జునను నాగార్జునగా తెరమీద చూడాలనుకుంటే.. మీలో ఎవరు కోటీశ్వరుడు పోటీని వెండితెరపై వీక్షించాలంటే.. ‘నిర్మలా కాన్వెంట్’ మంచి ఛాయిసే. మామూలుగా ఓ కొత్త హీరో పరిచయమవుతున్నాడంటే సినిమా కంటే కూడా ఆ కుర్రాడు ఏమేరకు మెప్పించాడు అన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మొహమాటానికి చెప్పుకోవడం కాదు కానీ.. రోషన్ మెప్పించాడు. తెరమీద కనిపించిన ప్రతిసారీ ఆకట్టుకున్నాడు. నాగ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. ఎంఈకే షో అంటే ఆసక్తి ఉన్న వాళ్లకు.. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమా చూడని వాళ్లకు ఆ క్విజ్ పోటీ ఎపిసోడ్ కూడా బాగానే అనిపించొచ్చు. అక్కడక్కడా కొన్ని ఫీల్ గుడ్ సన్నివేశాలు.. కొన్ని ఎమోషనల్ సీన్స్.. పాటలు కొంత వరకు ఎంగేజ్ చేస్తాయి. ఐతే విడివిడిగా కొన్ని ఆకర్షణలున్నప్పటికీ.. ఓవరాల్ గా ‘నిర్మలా కాన్వెంట్’ నిరాశ పరుస్తుంది.

టీనేజ్ లవ్ స్టోరీ.. ఓ కొత్త దర్శకుడు తీశాడు.. నాగార్జున నిర్మించాడు కదా అని కథాకథనాల్లో కొత్తదనం ఆశిస్తే నిరాశ తప్పదు. కథ మొదలుపెట్టిన తీరు చూస్తేనే ఇది స్టీరియో టైపు స్టోరీ అనే విషయం అర్థమైపోతుంది. ఇక హీరో హీరోయిన్ల ట్రాక్ అయినా ఏమైనా భిన్నంగా ఉంటుందేమో అని ఆశిస్తే అదీ లేదు. వీళ్లిద్దరి పరిచయ సన్నివేశాలు ఏమాత్రం ఆసక్తి రేకెత్తించవు. లవ్ స్టోరీ ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ దగ్గర హీరో ‘ఆ అమ్మాయి నా ప్రాణం’ అంటాడు. కానీ ఆమె అంత ప్రాణంగా మారిపోవడానికి సరైన కారణం కనిపించదు. హీరోయిన్ అయినా.. హీరో ప్రేమలో పడిపోవడానికి దారితేసే సన్నివేశం ఉంది. కానీ బుద్ధిగా చదువుకుంటున్న హీరో.. హీరోయిన్ వైపు ఆకర్షితుడు కావడానికి కారణం కనిపించదు. టీనేజ్ లవ్ స్టోరీ కాబట్టి అంత మెచ్యూర్డ్ గా ఉండాల్సిన అవసరం లేదనుకున్నాడో ఏమో దర్శకుడు.. ప్రేమకథను పైపైన నడపించేశాడు. కొత్త కొత్త భాష పాటను.. హీరో హీరోయిన్ల మధ్య డ్యూయెట్ ను తెరకెక్కించిన తీరు మెప్పిస్తుంది. హీరోను తెలివైన వాడిగా చూపించడానికి పెట్టిన హాస్పిటల్ సీన్ బాగుంది. తాగుబోతు రమేష్.. జోగి బ్రదర్స్ పాత్రలతో చేయించిన కామెడీ బోరింగ్. ఇంటర్వెల్ దగ్గర కథ మలుపు తిరిగే పాయింట్ కూడా సాదాసీదాగానే ఉంటుంది.

ఇక ద్వితీయార్ధంలో నాగార్జున రంగ ప్రవేశంలో ప్రేక్షకుల్లో ఉత్సాహం వస్తుంది. ఐతే కథను ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాం వైపు తిప్పగానే ఆసక్తి పోతుంది. తర్వాత ఏం జరగొచ్చన్నది క్లైమాక్స్ వరకు ఈజీగా అర్థమైపోతుంది. ఎంఈకేలో ప్రతిభ చాటుకున్న వాళ్లతో హీరోకు టెస్టు పెట్టడం.. తర్వాత నాగ్ హీరో ఊరికి రావడం.. అక్కడ షో నిర్వహించడం.. ఇదంతా చూస్తుంటే ఓ సినిమా చూస్తున్న భావనే కలగదు. ఈ ఎపిసోడ్ సినిమాలో సింక్ కాలేదు. ఇదంతా ఏదో ప్రత్యేకమైన వ్యవహారంలాగా కనిపిస్తుంది. నాగార్జున అభిమానులు.. ఎంఈకే షో అభిమానులు ఈ ఎపిసోడ్ ను బాగానే ఎంజాయ్ చేయొచ్చు కానీ.. సగటు ప్రేక్షకుడు మాత్రం ద్వితీయార్ధం మొదలైన కాసేపటికే డిస్కనెక్ట్ అయిపోతాడు. హీరో తన అనుభవాల నుంచే జవాబులు చెప్పడం అన్నది ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ నుంచి కాపీ కొట్టిన ఐడియా. ఐతే అందులో ఉన్న ఎమోషన్.. ఇంటెన్సిటీ ఇందులో కనిపించదు. ఇదంతా కృత్రిమంగా ఉంటుంది. సినిమాను ముగించిన తీరు కూడా మామూలుగా అనిపిస్తుంది.

నటీనటులు:

శ్రీకాంత్ తనయుడు రోషన్ నటుడిగా బాగానే నిలదొక్కుకోలడనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. శ్యామ్ పాత్రలో అతను తడబాటు లేకుండా నటించి మెప్పించాడు. రోషన్ కాన్ఫిడెన్స్.. మెచ్యూరిటీ ఆ పాత్రలో ప్రతిఫలించాయి. కొన్ని చోట్ల బాడీ లాంగ్వేజ్ కొంచెం అటు ఇటుగా కనిపించింది కానీ.. మొత్తంగా రోషన్ కు మంచి మార్కులు పడతాయి. మామూలుగా టీనేజ్ కుర్రాళ్లు తొలి సినిమా చేసినపుడు ఒకరకమైన అత్యుత్సాహం కనిపిస్తుంది. అతిగా నటించేస్తుంటారు. రోషన్ లో అది లేకపోవడం.. ఒద్దికగా నటించడం మెచ్చుకోవాల్సిన విషయం. నాగార్జునతో కలిసి చేసిన సన్నివేశాల్లోనూ అతను ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. హీరోయిన్ శ్రియ శర్మ కూడా బాగా చేసింది. ఆమె హావభావాలు ఆకట్టుకుంటాయి. ఐతే ఆమెలో ఇంకా పసితనపు ఛాయలు పోలేదు. ఇంకా చిన్న పిల్ల లాగే అనిపిస్తుంది. అందుకే ఆమెలోని గ్లామర్ కోణాన్ని చూపించినపుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. నాగార్జున తన నిజ జీవిత పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఆయనకు సవాలు విసిరే పాత్రేమీ కాదిది. సింపుల్ గా పని ముగించేశారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. విలన్ పాత్రలో ఆదిత్య మీనన్ మామూలుగా అనిపిస్తాడు. రోషన్ తల్లిదండ్రులుగా సూర్య.. అనితా చౌదరి చక్కగా నటించారు. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం:

‘నిర్మలా కాన్వెంట్’కు సాంకేతిక హంగులు బాగానే కుదిరాయి. రోషన్ సాలూరి సంగీతం.. విశ్వేశ్వర్ ఛాయాగ్రహణం సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. పాటలన్నీ బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు. విశ్వేశ్వర్ ప్రథమార్ధంలో పల్లెటూరి అందాల్ని చక్కగా ఒడిసిపట్టాడు. హీరోయిన్ ఇంటిని చూపించిన తీరు కూడా బాగుంది. పాటల చిత్రీకరణలోనూ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ సినిమాకు మైనస్ అయింది. షార్ప్ నెస్ లేదు. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. డైలాగ్స్ పెద్దగా ఆకట్టుకోవు. రైటర్ కమ్ డైరెక్టర్ నాగ కోటేశ్వరరావు.. స్క్రిప్టులో కొత్తదనం ఏమీ చూపించలేకపోయాడు. ఇది చాలా పాత కథ. దానికి స్లమ్ డాగ్ మిలియనీర్ స్ఫూర్తితో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కాన్సెప్టుకి ముడిపెట్టడం మినహాయిస్తే కొత్తగా చేసిందేమీ లేదు. దర్శకుడిగా ఏవరేజ్ మార్కులు పడతాయి.

చివరగా: నిర్మలా కాన్వెంట్.. పాత కథలో కొత్త కుర్రాడి ‘షో’

రేటింగ్ - 2.25/5


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre