Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'నిను వీడని నీడను నేనే'

By:  Tupaki Desk   |   12 July 2019 10:55 AM GMT
మూవీ రివ్యూ: నిను వీడని నీడను నేనే
X
చిత్రం: నిను వీడని నీడను నేనే

నటీనటులు : సందీప్ కిషన్ - అన్య సింగ్ - వెన్నెల కిషోర్ - మురళి శర్మ - పోసాని కృష్ణమురళి - పూర్ణిమ భాగ్యరాజ్ - ప్రగతి తదితరులు
సంగీతం : తమన్
ఛాయాగ్రహణం : పికె వర్మ
ఎడిటింగ్ : కెఎల్ ప్రవీణ్
సంభాషణలు : కెఎల్ విజయ్ కుమార్
నిర్మాతలు : సందీప్ కిషన్ - సుప్రియ కంచెర్ల
రచన - దర్శకత్వం : కార్తీక్ రాజు

టాలీవుడ్ లో హారర్ చిత్రాల ప్రవాహం ఈమధ్య బాగా తగ్గిపోయింది. ఒకేతరహా ట్రీట్మెంట్ తో కొందరు దర్శకులు ఈ జానర్ ని కూడా మూసలా మార్చేయడంతో ప్రేక్షకులు మొహం మొత్తేసి ఆదరించడం మానుకున్నారు. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ లాంటి స్ట్రగులింగ్ హీరో స్వయంగా నిర్మాతగా మారి మరీ ఇలాంటి సినిమా చేశాడంటే ఆసక్తి కలగడం సహజం. ట్రైలర్ నుంచే ఒకరకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగించిన నిను వీడని నీడను నేనే ఇవాళ విడుదలైంది. ఖచ్చితంగా హిట్ కొడతాను అని సందీప్ నొక్కి చెప్పిన ఈ హారర్ థ్రిల్లర్ అతని ఆశలకు ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు ఉందా లేదా రివ్యూలో చూద్దాం

కథ:

ఋషి(సందీప్ కిషన్) దియా(అన్య సింగ్)ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న అందమైన జంట. ఒకరంటే మరొకరికి ప్రాణం. ఓ రాత్రి రోడ్ డైవెర్షన్ తీసుకుని కారులో వెళ్తుండగా ఇద్దరూ యాక్సిడెంట్ కు గురవుతారు. గాయాలతో బయటపడి ఇంటికి వెళ్ళాక అద్దంలో చూసుకుంటే ఋషికి అర్జున్(వెన్నెల కిషోర్)దియాకు మాధవి కనిపిస్తారు. దీంతో షాక్ తిన్న ఈ ఇద్దరూ సూపర్ న్యాచురల్ పవర్స్ ని డీల్ చేసే డాక్టర్(మురళి శర్మ)దగ్గరికి వెళ్తారు. ఇది చూసి షాక్ తిన్న అతను అద్దంలో కనిపించే అర్జున్ ఎవరో కనుక్కోవడానికి ఎసిపి(పోసాని)సహాయం తీసుకుంటాడు. ఆ తర్వాత చాలా అనూహ్యమైన సంఘటనల తర్వాత ఊహించని నిజాలు తెలుస్తాయి. అసలు ఈ నీడలు ఎవరివి ఒకరిబదులు మరొకరు ఎందుకు కనిపిస్తున్నారు అనేది తెలుసుకోవాలంటే స్క్రీన్ మీదే చూడాలి

కథనం - విశ్లేషణ:

దెయ్యం కథలకు ఎప్పుడూ కొన్ని పరిమితులు ఉంటాయి. అవి దాటుకుని ఎంత పెద్ద దర్శకుడైనా రిస్క్ చేసిన దాఖలాలు లేవు. అంత పెద్ద హాలీవుడ్ లోనూ అన్నాబెల్లె కావొచ్చు కాంజూరింగ్ కావొచ్చు ఒకే వింగ్ లో ఉంటూ ఒకే ఫార్ములా చుట్టూ తిరుగుతూ కేవలం చిన్న చిన్న మార్పులతో వాటిని చూసే ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అక్కడ సీరియస్ హారర్ ని విపరీతంగా ఇష్టపడతారు కాబట్టి ఎన్ని తీసినా ఆధారణ దక్కుతుంది. కానీ మన ఇండియన్ నేటివిటీకి అన్నేసి దెయ్యాల సినిమాలు వర్క్ అవుట్ కావు. అందుకే మన దర్శకులు చాలా తెలివిగా ఒక వైపు భయపెడుతూనే ఈ జానర్ లో కామెడీని తీసుకురావడం మొదలుపెట్టారు. ఇది చాలా ఏళ్ళుకాసులు కురిపించింది. ఎప్పుడైతే ఇదీ మొనాటనీగా మారడం మొదలైందో ప్రేక్షకులకు కొత్తదనం కనిపించక తిరస్కరించడం మొదలుపెట్టారు. అందుకె నిను వీడని నీడను నేనే ఈ హద్దులు చెరుపుకుని ఎంత కొత్తగా ఉంటుందా అనే ఆసక్తి పబ్లిక్ లో ఉంది.

నిజానికి నిను వీడని నీడను నేనులో మంచి పాయింట్ ఉంది. మనది కాని మొహం అద్దంలో కనిపించడం అనే థీమ్ లో చాలా డెప్త్ ఉంది. కార్తీక్ రాజు ఏదైతే వినూత్నంగా ఆలోచించాడో దాన్ని సాధ్యమైనంత మేరకు అంతే ప్రతిభావంతంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. అయితే లైన్ ని ఎగ్జైటింగ్ గా రాసుకున్నంత ఎఫెక్టివ్ గా స్క్రీన్ ప్లే లేకపోవడంతో నిను వీడని నేను నేనే మిశ్రమ స్పందన కలిగిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కాసేపటికే ట్విస్ట్ ని ఓపెన్ చేసిన తీరు బాగుంది. కానీ ఎంతసేపూ దాని చుట్టే తిప్పుతూ పాత్రల పరిచయాలకు ఎక్కువ టైం తీసుకోవడంతో ప్రీ ఇంటర్వెల్ ముందు దాకా ఏదో సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. దాంతో పాటు కామెడీని ఇరికించే ప్రయత్నం చేయడం పూర్తి స్థాయిలో నవ్వించలేకపోయింది. సందీప్ కిషన్-వెన్నెల కిషోర్ ల మధ్య సస్పెన్స్ ఎలిమెంట్ ని బాగా డీల్ చేసిన దర్శకుడు కథ ముందుకు వెళ్లే కొద్దీ ఎలాంటి మలుపులు పెట్టాలో అర్థం కాక ఫ్లాష్ బ్యాక్ తో సహా కొన్ని రొటీన్ ప్లాట్స్ ఇరికించడంతో కొంత థ్రిల్ తో కొంత భారంగా నిను వీడని నీడను నేనే నడుస్తుంది

ఎంత హారరైనా లాజిక్స్ ని ప్రేక్షకుడు నమ్మించేలా చేయాలి. కార్తీక్ రాజు ఈ విషయంలో బాగానే సక్సెస్ అయ్యాడు. అయితే ఋషి కోణంలో అర్జున్ కథను చెబుతూ క్యారెక్టర్ పరంగా సందీప్ కిషన్ కు ఎక్కువ వెయిట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన దర్శకుడు సామాన్య ప్రేక్షకుడికి పజిల్ మిగులుస్తాడు. నిజానికి పెర్ఫార్మన్స్ పరంగా వెన్నెల కిషోర్ మీద ఎలాంటి కంప్లైంట్ లేనప్పటికీ అతనికి బదులు సందీప్ కిషన్ తరహాలో ఇంకో యూత్ హీరోతో ఆ పాత్రను రీ ప్లేస్ చేసి సీరియస్ డ్రామాను నడిపించి ఉంటే నిను వీడని నీడను నేనే గొప్ప థ్రిల్లర్ గా నిలిచిపోయేది.

కానీ తెలుగు ప్రేక్షకులు హారర్ లో కామెడీ ఉంటేనే చూస్తారని లెక్కలో పోసాని పాత్రను మరీ సిల్లీగా డీల్ చేయడంతో అతను సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేసి హీరోకు క్లాస్ పీకినా కామెడీగానే అనిపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే పోసాని పాత్రను తీర్చిదిద్దిన తీరు మిస్ ఫైర్ అయ్యింది. అక్కడక్కడా నవ్వుకోవడానికి పనికి వచ్చింది కానీ నిజానికి మెయిన్ ట్రాక్ ని అనవసరంగా ఇది పక్కదారి పట్టించింది

ఋషి అర్జున్ పాత్రల మధ్య ట్విస్ట్ రివీల్ అయ్యాక ఇక కథను ఎలా నడిపించాలో అర్థం కాసేపు కామెడీగా మలుపు తిప్పడం బాగానే ఉంది కానీ తన చావుకు కారణం వెతుకుతున్న అర్జున్ కు దాని వెనుక నిజం తెలిసాక చేసే రివెంజ్ ఎపిసోడ్ కూడా అంతగా క్లిక్ అవ్వలేదు. పైగా పెద్ద ట్విస్ట్ లాగా చూపించిన గూండా బ్యాచ్ తాలూకు ట్రాక్ కూడా వీక్ గా ఉంది. ఇవన్నీ మైనస్సులగానే కనిపిస్తున్నాయి కానీ కార్తీక్ రాజు ఇన్ని లోపాల మధ్యలో కూడా తనలోని మంచి టెక్నీషియన్ ని చాలా సార్లు పరిచయం చేస్తూనే పోయాడు.

పరిమిత బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుంటూనే వీలైనంత క్వాలిటీని ఆవిష్కరించడంలో ఇతని పనితనం కనిపిస్తుంది. బహుశా సందీప్ నిర్మాతగా మారడానికి ఇదే కారణం కాబోలు. అయితే క్లైమాక్స్ ముందు వచ్చే ఎమోషనల్ ఫామిలీ ఎపిసోడ్ పాట పిక్చరైజేషన్ బాగున్నప్పటికీ అప్పటికే అంతా ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇదంతా అవసరం లేని ప్రహసనమే అనిపిస్తుంది. ఫైనల్ గా కార్తీక్ రాజ్ లో దర్శకుడి కంటే మంచి స్టోరీ టెల్లర్ ఉన్నాడన్న మాట వాస్తవం

నటీనటులు:

సందీప్ కిషన్ లో చక్కని వేరియేషన్స్ ఇవ్వగలిగే నటుడు ఉన్నాడు. ప్రస్థానంలో తీవ్రమైన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను అంత ఈజ్ తో చేసినప్పుడే దీన్ని అందరూ గుర్తించారు. కానీ అతనికి తగ్గ పాత్రలు దొరక్క రొటీన్ చక్రంలో ఇరుక్కుపోయి ఇంతకాలం సక్సెస్ కు దూరం అయ్యాడు. ఆ కోణంలో చూసుకుంటే నిను వీడని నీడను నేనే చాలా బెటర్ అని చెప్పొచ్చు. సవాల్ అనిపించే పాత్ర కాకపోయినా వేరే మనిషిని ఊహించుకుని నటించడం దెయ్యం తనలో ఉందని తెలిశాక భయాన్ని ప్రదర్శిస్తూ వెనుక ఏం జరిగిందో తెలుసుకునే పాత్రలో ఒదిగిపోయాడు. అతని అంచనా తప్పుకాలేదు. గతకొన్నేళ్లలో అంతో ఇంతో బెస్ట్ అనిపించే కథ ఇదే తనకు

అన్య సింగ్ లుక్స్ పరంగా యావరేజ్ గా అనిపించినా పాత్రకు తగ్గ పెర్ఫార్మన్స్ తో పాస్ అయిపోయింది. ఇంకెవరు ఇంతకన్నా బెటర్ గా చేయలేరా అంటే ఖచ్చితంగా ఎస్ అనే చెప్పాలి. లిప్ లాక్ కు మొహమాటపడలేదు అన్య. ఇక వెన్నెల కిషోర్ సెకండ్ హీరో అనిపించే పాత్రలో స్క్రీన్ స్పేస్ తక్కువే దొరికినప్పటికీ సినిమా మొత్తం ఉన్న ఫీలింగ్ కలిగించాడు. సెకండ్ హాఫ్ లో టైమింగ్ తో బాగానే నిలబెట్టాడు.

మురళీశర్మకు అలవాటైన పాత్రే. ప్రత్యేకత ఏమి లేదు. పోసాని రాను రాను రొటీన్ గా మారిపోతున్నారు.అమ్మా అమ్మా అంటూ అతను చేస్తున్న ఒకే తరహా హాస్యం కొంతవరకు నవ్వు తెప్పించినా ఆ పాత్రలో ఉన్న సీరియస్ నెస్ దృష్ట్యా ఇంతా అవసరం లేదేమో అనిపిస్తుంది. కానీ దానికి బాద్యుడు ఆయన కాదు కాబట్టి ఇంతకన్నా చెప్పలేం. వెన్నెల కిషోర్ భార్యగా చేసిన అమ్మాయి రెండు మూడు చిన్న ఎక్స్ ప్రెషన్లు ఇవ్వడం తప్ప నటించే ఛాన్స్ దొరకలేదు. వీళ్ళు మినహాయించి అందరూ తక్కువ స్పేస్ దక్కింగ్ వాళ్లే. సందీప్ కిషన్ తల్లిగా నటించిన పూర్ణిమ భాగ్యరాజ్ కొంత రిజిస్టర్ అవుతారు

సాంకేతిక వర్గం:

కార్తీక్ రాజ్ డెబ్యూ మూవీతో మంచి టెక్నీషియన్ గా రుజువు చేసుకున్నాడు. గ్రిప్పింగ్ గా కథను చెప్పే టాలెంట్ తనలో ఉందని ఋజువు చేసుకున్నాడు. అయితే ఇలాంటి వినూత్నమైన పాయింట్ ఉన్న కథను అనవసరమైన డీవియేషన్లకు తావివ్వకుండా నడిపి ఉంటే వన్ అఫ్ ది బెస్ట్ మూవీస్ గా నిను వీడని నీడను నేనే నిలిచేది. అయినా కూడా పూర్తిగా నిరాశపరచలేదు కానీ కాబట్టి ఇతను పాస్ మార్కులతో గట్టెక్కినట్టే. ఆత్మలు ఆవహించడం అనే అవుట్ డేటెడ్ కాన్సెప్ట్ ని ఈ మాత్రం కొత్తగా చెప్పేందుకు ప్రయత్నించడం అభినందనీమే కానీ కామెడీ - సెంటిమెంట్ - థ్రిల్ - హారర్ అన్ని ఒకే సినిమాలో చూపించాలన్న తాపత్రయమే నిను వీడని నీడకు కొంత మైనస్ గా నిలిచింది. అది మినహాయిస్తే జస్ట్ ఓకే అనిపించే మూవీతో కార్తీక్ రాజ్ మొదటి అడుగు వేశాడు

తమన్ సంగీతం దీనికి వెన్నెముకగా నిలిచింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చాలా సీన్స్ ని ఎలివేట్ చేసిన తీరుని మెచ్చుకోవచ్చు. అయితే కొన్ని సీన్లలో లౌడ్ నెస్ ఎక్కువ కావడం ఇబ్బంది పెట్టినా ఓవరాల్ గా బీజీఎమ్ విషయంలో తాను బెస్ట్ అని మరోసారి రుజువు చేశాడు తమన్. ఉన్న మూడు పాటల్లో రెండు బాగున్నాయి కానీ ప్లేస్ మెంట్ వల్ల ఒకటి అవసరం లేదన్న ఫీలింగ్ కలిగిస్తుంది. పికె వర్మ ఛాయాగ్రహణం సబ్జెక్టులో ఉన్న వివిధ్డా రకాల మూడ్స్ ని చక్కగా చూపిస్తూ మంచి పనితనాన్ని కనబరిచింది. లైటింగ్ విషయంలో అతను తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ చాలా ఫ్రేమ్స్ లో కనిపిస్తుంది.

కెఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ కొంచెం లెన్త్ ని తగ్గించి ఉంటే బాగుండేది. ఇవి అవసరమా అనిపించే సీన్లు చెప్పుకోదగ్గ నెంబర్ లోనే ఉన్నాయి. విజయ్ కుమార్ సంభాషణలు మాములుగా అనిపిస్తాయి. సందీప్ కిషన్ సుప్రియల నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. మంచి టెక్నీషీయన్స్ తో చాలా తెలివిగా లిమిటెడ్ బడ్జెట్ లోనే క్వాలిటీ అవుట్ ఫుట్ రాబట్టుకున్నారు

చివరిగా చెప్పాలంటే నిను వీడని నీడను నేనే అంతర్లీనంగా ఒక సందేశాన్ని ఇస్తూ భయం కంటే ఎక్కువగా థ్రిల్ ని కలిగించే ఓ యావరేజ్ హారర్ మూవీ. తీవ్రంగా నిరాశపరిచే అవకాశం లేదు కానీ ఏదో కొంత తెలియని వెలితి వెంటాడుతూనే ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటికి వస్తాడు. ఈ జానర్ మూవీస్ ని విపరీతంగా ఇష్టపడే వాళ్లకు నిను వీడని నీడను నేనే నచ్చకుండా పోదు. కానీ సామాన్య ప్రేక్షకుడు మాత్రం కొంత సంతృప్తితో ఎన్నో సందేహాలతో బయటికి రావడం దీన్ని ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.

చివరిగా - నిను వీడని నీడను నేనే - కొంత థ్రిల్ కొంత డల్!

రేటింగ్ : 2.5 / 5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre