Begin typing your search above and press return to search.

కోవిడ్-19 కాల్ సెంటర్‌ లో పని చేస్తోన్న హీరోయిన్..!

By:  Tupaki Desk   |   15 April 2020 1:20 PM IST
కోవిడ్-19 కాల్ సెంటర్‌ లో పని చేస్తోన్న హీరోయిన్..!
X
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రళయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. ఈ నేప‌థ్యంలో కేంద్రం ప్ర‌భుత్వం ఇప్పటికే విధించిన లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించింది. ఈ కారణంగా కరోనా బాధితులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్ప‌టికే పలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేపడుతున్నాయి. వారితో పాటు సినీ ప్ర‌ముఖులు - సెలబ్రిటీలు కూడా ప్రజలకు వివిధ రూపాల్లో సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తమకు తోచిన విధంగా విరాళాలు అందిస్తున్నారు.. కొంతమంది వీడియోల ద్వారా కరోనా వ్యాప్తి నివారణకి కృషి చేస్తున్నారు. తాజాగా మలయాళ హీరోయిన్ నిఖిలా విమల్ ఓ అడుగు ముందుకేసి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది.

లాక్‌ డౌన్ కారణంగా ఇబ్బందులు ప‌డుతోన్న ప్ర‌జ‌ల కోసం నిత్యావసరాలు - మెడిసిన్ అందించ‌డం కోసం కేరళ ప్రభుత్వం కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ కోవిడ్-19 కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఆ కాల్ సెంటర్‌ లో పనిచేస్తూ హీరోయిన్ నిఖిల్ విమల్.. ఆపదలో ఉన్న వారికి ఈ వేదిక‌గా హెల్ప్ చేస్తోంది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరిస్తూ.. వారికి కావాల్సిన అత్యవసరాలు వాలంటీర్ల ద్వారా అందజేయడానికి కృషి చేస్తోంది. కరోనా నివారణకు ప్రభుత్వం చేస్తున్న అవగాహన కార్యక్రమానికి అట్రాక్ట్ అయి స్వచ్ఛందంగా ఈ ప్రయత్నంలో భాగమయ్యారట నిఖిలా విమల్. కష్ట సమయాల్లో ప్రజలకు సహాయం చేయడానికి ఆమె రోజు 20 కిలోమీటర్లు ప్రయాణిస్తోందట. ఈ కష్ట సమయాల్లో నిరుపేదలకు సహాయం చేయడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న మాలీవుడ్ ప్రముఖులలో నిఖిలా విమల్ ఒకరుగా నిలిచారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలతో ఇంటారాక్ట్ అవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నట్లు.. ప్రజా సేవలో ప‌లువురు ప్ర‌ముఖులు కూడా భాగ‌స్వామ్యం అవ్వాల‌నే ఉద్దేశ్యంతో ఈ కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నట్టు నిఖిల పేర్కొంది. ఇదిలా ఉండగా నిఖిలా విమల్ తెలుగులో అల్లరి నరేష్ హీరోగా నటించిన 'మేడ మీద అబ్బాయి' సినిమాలో కథానాయికగా నటించింది. అలాగే 'గాయత్రీ' అనే సినిమాతో పాటు పలు తమిళం - మలయాళం చిత్రాల్లో కూడా నటించింది.