Begin typing your search above and press return to search.

ఉత్కంఠ భరితంగా నిఖిల్ 'కార్తికేయ 2' ట్రైలర్..!

By:  Tupaki Desk   |   24 Jun 2022 12:21 PM GMT
ఉత్కంఠ భరితంగా నిఖిల్ కార్తికేయ 2 ట్రైలర్..!
X
యువ హీరో నిఖిల్ సిద్ధార్థ మరియు డైరెక్టర్ చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన' కార్తికేయ' సినిమా బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ''కార్తికేయ 2'' తెరకెక్కుతోంది. జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది.

విడుదల తేదీ దగ్గర పడుతుండగా, మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ''కార్తికేయ 2'' ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఆసక్తికర ట్రైలర్‌ ని రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్ మరియు గ్లిమ్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.

లేటెస్టుగా విడుదలైన 'కార్తికేయ 2' ట్రైలర్ ప్రేక్షకులకు ఒక మిస్టీరియస్ థ్రిల్లింగ్ ప్రపంచాన్ని చూపించబోతున్నట్లు హామీ ఇచ్చింది. 'ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం అక్కడ మళ్లీ మొదలయింది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దానిని పొందగలవు' అనే వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంటోంది.

నీటి అడుగున రహస్యమైన ద్వారకానగరం ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఇందులో శ్రీ కృష్ణుడి గురించిన నిజాన్ని కనుగొనడానికి నిఖిల్ తన మిస్టీరియస్ జర్నీని ప్రారంభించాడు. నిఖిల్ సిద్ధార్థ్ కు జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించగా.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించారు.

చందూ మొండేటి మరోసారి ఉత్కంఠభరితమైన ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నాడని 'కార్తికేయ 2' ట్రైలర్ సూచిస్తోంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ట్రైలర్ కట్‌ ని మరో స్థాయికి తీసుకెళ్లింది. కాల భైరవ నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సాహి సురేష్ ఆర్ట్ వర్క్ అభినందనీయం. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

మొత్తానికి 'కార్తికేయ 2' ట్రైలర్ స్టన్నింగ్ విజువల్స్ తో పవర్ ప్యాక్డ్ థ్రిల్లింగ్ పంచ్‌ గా ఉందని చెప్పాలి. మొదటి భాగాన్ని మించి ఈ సినిమా ఉంటుందని.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచబోతోందని అర్థం అవుతోంది. ఈ సినిమాలో ఆదిత్య మీనన్ - హర్ష చెముడు - శ్రీనివాస రెడ్డి - అర్జున్ కోలిశెట్టి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభోట్ల‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జులై 22న ప్రపంచంలో భారీ స్థాయిలో విడుదల కానున్న 'కార్తికేయ 2' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.