Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: నిజం కోసం పోరాటం

By:  Tupaki Desk   |   4 March 2019 12:20 PM GMT
టీజర్ టాక్: నిజం కోసం పోరాటం
X
యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నిఖిల్ పాత్ర కోసమే కొంత గ్యాప్ తీసుకుని చేసిన మూవీ అర్జున్ సురవరం. తమిళ్ కనితన్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమాకు ఒరిజినల్ వెర్షన్ హ్యాండిల్ చేసిన టి సంతోష్ దర్శకత్వం వహించారు. శివరాత్రి పండగ సందర్భంగా టీజర్ ను విడుదల చేసింది టీమ్.

బిబిసి న్యూస్ ఛానల్ లో రిపోర్టర్ గా పని చేస్తుంటాడు అర్జున్ లెనిన్ సురవరం(నిఖిల్). అబద్దాన్ని నిజం చేయడం సులభం కానీ ఒక నిజాన్ని రుజువు చేయడం చాలా కష్టమని భావించే అర్జున్ సమాజాన్ని పట్టి పీడిస్తున్న క్లిష్టమైన సమస్యపై పోరాటాన్ని ప్రారంభిస్తాడు.అర్జున్ తో పాటు అతని ప్రేమలో ఉన్న కొలీగ్(లావణ్య త్రిపాఠి)కుడా అండగా నిలుస్తుంది.

టిఆర్పి రేటింగ్స్ కోసం ఛానల్స్ మధ్య యుద్ధాలు జరుగుతున్న తరుణంలో అర్జున్ సురవరం ఓ పెద్ద పద్మవ్యూహంలో చిక్కుకుంటాడు. ప్రతినాయకుడు(తరుణ్ అరోరా)పోలీస్ ఆఫీసర్(కిషోర్)ల మధ్య దొరక్కుండా అంతు చిక్కని ఓ నేరస్తుడి కోసం వేట మొదలుపెడతాడు. ఇది ఎలా సాధించాడు అనేదే అర్జున్ సురవరం

ఇప్పటిదాకా కుర్రకారుకు మాత్రమే ఎక్కువగా నచ్చే యూత్ ఫుల్ రోల్స్ చేసిన నిఖిల్ మొదటిసారి చాలా ఇంటెన్సిటీ ఉన్న సీరియస్ జర్నలిస్ట్ రోల్ ని ఎంచుకున్నాడు. టీజర్ ఆద్యంతం యాక్షన్ థ్రిల్లర్ ని తలపించిందే తప్ప రొటీన్ గా అనిపించే కమర్షియల్ అంశాలకు సంతోష్ ఎక్కువ చోటు ఇవ్వలేదు. లావణ్య త్రిపాఠి మధ్య రొమాన్స్ ని జస్ట్ సింగల్ షాట్ లో కట్ చేసి టీజర్ మొత్తం కంటెంట్ తోనే నింపేశారు.

సామ్ సిఎస్ సంగీతం బాగా ఎలివేట్ కాగా సూర్యా ఛాయాగ్రహణం టాప్ స్టాండర్డ్ లో ఉంది. మూసకు భిన్నంగా నిఖిల్ చేసిన విభిన్న ప్రయత్నం ఈ టీజర్ రూపంలో అంచనాలు పెంచేలా ఉంది. ఈ నెలాఖరుకు విడుదల కానున్న అర్జున్ సురవరం నిఖిల్ కు కార్తికేయ తర్వాత ఆ స్థాయి బ్రేక్ గా నిలిస్తుందన్న అంచనాలు అభిమానుల్లో బలంగా ఉన్నాయి