Begin typing your search above and press return to search.

నిఖిల్ చెప్పిన కార్తికేయ-2 సంగతులు

By:  Tupaki Desk   |   7 March 2018 6:59 AM GMT
నిఖిల్ చెప్పిన కార్తికేయ-2 సంగతులు
X
యువ కథానాయకుడు నిఖిల్ ఇటీవలే ‘కిరాక్ పార్టీ’ సినిమా పూర్తి చేసి.. వెంటనే ‘కనిదన్’ రీమేక్ పనుల్లో పడిపోయాడు. తమిళంలో ఈ చిత్రాన్ని రూపొందించిన సంతోషే తెలుగు వెర్షన్ కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. నాలుగు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేయడానికి ప్రణాళికలు రచించుకున్నాడు నిఖిల్. దీని తర్వాత తాను చేయబోయే సినిమా ఏదో కూడా నిఖిల్ చెప్పేశాడు. చాన్నాళ్లుగా చర్చల్లో ఉన్న ‘కార్తికేయ-2’ సినిమాను ఈ ఏడాది ద్వితీయార్ధంలో మొదలుపెట్టబోతున్నట్లు నిఖిల్ వెల్లడించాడు. ప్రస్తుతం ‘సవ్యసాచి’ని పూర్తి చేసే పనుల్లో ఉన్నాడు దర్శకుడు చందూ మొండేటి. ఆ చిత్రం జూన్ 15న ప్రేక్షకుల ముందుకొస్తుంది. అది రిలీజయ్యాక ‘కార్తికేయ-2’ మొదలు పెడతాడు. ఈలోపు నిఖిల్ ఖాళీ అయిపోతాడు.

‘కార్తికేయ-2’ ప్రాపర్ సీక్వెల్ అని చెబుతున్నాడు నిఖిల్. చాలామంది సీక్వెల్ అని చెప్పి కథ మార్చేస్తుంటారని.. నటీనటులు కూడా మారుతుంటారని.. తమ సినిమా అలా కాదని నిఖిల్ చెప్పాడు. తొలి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడే ‘కార్తికేయ-2’ కథ మొదలవుతుందని.. అదే తరహాలో నడుస్తుందని.. అందులోని చాలా పాత్రలు ఇందులోనూ కొనసాగుతాయని.. ఆ చిత్ర కథానాయిక స్వాతి కూడా ఇందులో ఉంటుందని నిఖిల్ చెప్పాడు. ఈ చిత్రానికి తాను స్క్రిప్టు రాస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని అతను ఖండించాడు. తనకు అంత సీన్ లేదని.. ఏదో ప్రమోషన్లతో హడావుడి చేస్తుంటా తప్ప స్క్రిప్టు రాసేంత విషయం తనకు లేదని.. చందూ మొండేటినే స్క్రిప్టు రెడీ చేశాడని నిఖిల్ స్పష్టం చేశాడు.