Begin typing your search above and press return to search.

బాహుబలి.. డీజే.. అయినా భయం లేదు

By:  Tupaki Desk   |   1 March 2017 6:44 AM GMT
బాహుబలి.. డీజే.. అయినా భయం లేదు
X
‘బాహుబలి: ది కంక్లూజన్’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే వేసవికి రాబోయే మరో పెద్ద సినిమా ‘దువ్వాడ జగన్నాథం’కు కూడా మాంచి హైప్ ఉంది. ఈ సినిమాలతో బాక్సాఫీస్ రేసులో పోటీ పడటం అంటే చిన్న విషయం కాదు. ఐతే ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నిఖిల్ మాత్రం ఈ పెద్ద సినిమాలు భయపడట్లేదు. ఈ రెండు సినిమాల మధ్యే తన కొత్త చిత్రం ‘కేశవ’ను రిలీజ్ చేయడానికి నిఖిల్ ఫిక్సయిపోయాడు. ‘బాహుబలి’ వచ్చిన రెండు వారాలకే తమ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ‘కేశవ’ టీం కన్ఫమ్ చేసింది.

‘కేశవ’ షూటింగ్ పూర్తి చేసి డబ్బింగ్ మొదలుపెడుతున్న సందర్భంగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించాడు నిర్మాత అభిషేక్. మే 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మరోవైపు ‘దువ్వాడ జగన్నాథం’ను మే 19న రిలీజ్ చేయనున్నారు. ముందు వెనుక అంత భారీ సినిమాలున్నా ‘కేశవ’కు ఆ డేట్ ఫిక్స్ చేశారంటే సినిమా మీద అంత నమ్మకం ఉందన్నమాట. ‘స్వామిరారా’ తర్వాత నిఖిల్-సుధీర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఇది. ‘దోచేయ్’తో చేదు అనుభవం ఎదుర్కొన్న సుధీర్.. ఎంతో కసిగా ‘కేశవ’ను తీసినట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రి లుక్.. ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై ఆసక్తి రేకెత్తించాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/