Begin typing your search above and press return to search.

ఆంధ్రా అల్లుడిగా లాక్ డౌన్ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న నిఖిల్

By:  Tupaki Desk   |   19 Aug 2020 5:36 PM GMT
ఆంధ్రా అల్లుడిగా లాక్ డౌన్ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న నిఖిల్
X
కరోనా మహమ్మారి వల్ల సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి జీవితాల్లో కొద్దో గొప్పో మార్పులు వచ్చాయి. ఎవరి రేంజ్ ని బట్టి వారి దైనందిన కార్యక్రమాలు, షెడ్యూల్స్ మారిపోయాయి. సాధారణంగా అయితే, సినీ తారలు, సెలబ్రిటీలు, క్రీడాకారులకు కుటుంబ సభ్యులు, భార్యాపిల్లలతో గడిపేందుకు సమయం పెద్దగా దొరకదు. అయితే, లాక్ డౌన్ పుణ్యమా అంటూ చాలామంది సినీతారలు, క్రీడాకారులు ఇంటిపట్టునే ఉంటున్నారు. ఇక, లాక్ డౌన్ సమయంలో పెళ్లిళ్లు చేసుకున్న సినీతారలు ఈ అనుకోని సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఓ ఇంటివాడైన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కూడా లాక్ డౌన్ హనీమూన్ కమ్ హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఏడాది మేలో తన గర్ల్ ఫ్రెండ్ పల్లవి శర్మను పెళ్లి చేసుకున్న నిఖిల్ ....ఆంధ్రాలో అల్లుడి హోదాలో గోదారి అందాలను ఆస్వాదిస్తూ సేద తీరుతున్నాడట.

మామూలుగా అయితే, నిఖిల్ కు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల కొత్తగా పెళ్లి అయినప్పటికీ తన భార్య పల్లవితో గడిపేందుకు తగినంత సమయం ఉండేది కాదు. అయితే, లాక్ డౌన్ వల్ల షూటింగ్ లు లేకపోవడంతో ఆంధ్రాలోని తన అత్తగారింట్లో కొత్త అల్లుడి మర్యాదలు అందుకుంటున్నాడట. పల్లవి స్వస్థలం అయిన పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు వంటి ప్రాంతాలలో భార్యతో కలిసి చక్కర్లు కొడుతున్నాడు నిఖిల్. ఏది ఏమైనా లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్నందుకు ఓ రకంగా బాధపడినా....నిఖిల్ తో కలిసి ఇంత టైం స్పెండ్ చేస్తున్నందుకు పల్లవి కూడా ఫుల్ ఖుషీగా ఉందట. అంతేకాదు, అసలే గోదారోళ్లు...అందులోనూ కొత్త అల్లుడు కావడంతో గోదావరి రుచులను కూడా నిఖిల్ నోరారా ఆస్వాదిస్తున్నాడట. ఈ లాక్ డౌన్ హనీమూన్ ముగిసిన తర్వాత త్వరలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ `18 పేజెస్` షూటింగ్ లో నిఖిల్ పాల్గొనబోతున్నాడు.