Begin typing your search above and press return to search.

అవును.. బైడెన్ ను ‘చెప్పు తెగుద్ది వెధవ’ అనేశాడీ యూత్ హీరో

By:  Tupaki Desk   |   26 Aug 2021 3:30 AM GMT
అవును.. బైడెన్ ను ‘చెప్పు తెగుద్ది వెధవ’ అనేశాడీ యూత్ హీరో
X
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నా ఎప్పుడు హద్దులు దాటని యూత్ హీరో నిఖిల్.. అనూహ్యంగా చేసిన ట్వీట్ వ్యాఖ్య ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. హాట్ టాపిక్ గా మారింది. ఆఫ్గాన్ ఇష్యూ అతడ్ని ఎంతటి ఆవేదనకు గురి చేస్తుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. అంతా నువ్వే చేశామన్నట్లుగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పై విరుచుకుపడ్డారు. తాలిబన్లు చెలరేగిపోతూ.. ఆఫ్గాన్లు దారుణ పరిస్థితిని అనుభవిస్తున్న వేళ.. తనలోని కోపాన్ని.. ఆగ్రహాన్ని ట్వీట్ రూపంలో మలిచాడు.

మరే సినీ హీరో చేయని సాహసంతో తన మనసులోని మాటను సూటిగా చెప్పేశారని చెప్పాలి. స్వేచ్ఛా ప్రపంచం అని చెప్పే అమెరికా మాటల్ని ప్రస్తావిస్తూ.. మళ్లీ మాట్లాడావంటే చెప్పు తెగుద్ది వెధవ అంటూ ఘాటు వ్యాఖ్యను చేసేయటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అతగాడి ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇరవై ఏళ్ల క్రితం ఆఫ్గాన్లను తాలిబన్ల నుంచి విముక్తి కల్పిస్తామని చెబుతూ.. అడగకుండానే ఆ దేశంలో అడుగు పెట్టి.. సైన్యంతో తమ ప్రతాపాన్ని చూపించి.. ఇప్పుడు సమయం చూసుకొని ఆఫ్గాన్ నుంచి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పటం.. ఆ వెంటనే తాలిబన్లు చెలరేగిపోతూ.. దేశాన్ని తమ ఏలుబడిలోకి తీసుకోవటం తెలిసిందే.

తొలుత తాము ఎవరికి ఎలాంటి అపకారం చేయమని చెప్పిన వారు.. అందుకు భిన్నంగా హింసాత్మక చర్యలకు పాల్పడటమేకాదు.. తమ ప్రత్యర్థులని భావించిన వారిని.. తమ మాటల్ని వినని వారిని ఊచకోత కోసేస్తున్నారు. దీంతో.. ఆఫ్గాన్లు తీవ్ర భయాందోళనకు గురై.. వేర్వేరు దేశాలకు వెళ్లిపోతున్నారు. దీనికి సంబంధించిన వార్తలు.. అక్కడి పరిస్థితులు కళ్లకు కట్టేలా వస్తున్న వేళ.. అమెరికా తీరుపై పలువురికి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఆఫ్గాన్లు ఎదుర్కొంటున్న నరకాన్ని చూసి విపరీతమైన వేదనకు గురయ్యాడో ఏమో కానీ.. ఘాటు ట్వీట్ ఒకటి చేశారు నిఖిల్. సూటిగా.. ఎలాంటి సుత్తి లేకుండా ఏమన్నారంటే.. ‘‘స్వేచ్ఛా ప్రపంచం అనే దానికి ఉదాహరణ అమెరికా. కానీ.. అదిప్పుడు పోయింది. 21 ఏళ్లుగా ఎన్నో కష్టాలు పెట్టారు. ఇప్పుడు ఇలా పారిపోయారు. నువ్వు ఇంకెప్పుడైనా స్వాతంత్య్రం గురించి మాట్లాడితే.. జో బైడెన్ చెప్పు తెగుద్ది (ఈ మాటల్ని మాత్రం ఇంగ్లిషు అక్షరాల్లో రాశారు) అంటూ అగ్గి ఫైర్ అయ్యారు. ఆగ్రహంతో కూడిన ఆవేదన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.