Begin typing your search above and press return to search.

ఈపాస్ లేకుండా బయటకొచ్చిన నిఖిల్.. ట్వీట్ తో స్పందించిన పోలీసులు

By:  Tupaki Desk   |   23 May 2021 9:30 AM GMT
ఈపాస్ లేకుండా బయటకొచ్చిన నిఖిల్..  ట్వీట్ తో స్పందించిన పోలీసులు
X
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీసులు రాష్ట్రంలో కఠిన లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేస్తున్నారు. నిన్నటి నుండి హైదరాబాద్ పోలీసులు లాక్డౌన్ సమయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. సరైన కారణం లేకుండా ఎవరైనా రోడ్లపై ప్రయాణిస్తుంటే వారు వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఈపాస్ తీసుకొని బయటకు రావాలంటున్నారు. కరోనా కట్టడి కోసం పోలీసులు ఈ స్టిక్ట్ రూల్స్ ను తెలంగాణలో అమలు చేస్తున్నారు. ఎవరిని బయటకు రాకుండా నియంత్రిస్తున్నారు.

తాజాగా ఈరోజు తమ వారికి అత్యవసర మందులు, వైద్య సామాగ్రి అవసరం కావడంతో వాటిని తీసుకొని కారులో ప్రయాణిస్తున్న హీరో నిఖిల్ వాహనాన్ని పోలీసులు ఆపారు. తన అనుభవాన్ని హీరో నిఖిల్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. "ఉప్పల్ నుంచి కిమ్స్ మంత్రి రహదారికి అత్యవసరంగా ప్రాణాలను రక్షించే మందులను అందించేందుకు కారులో బయలు దేరాను. ప్రిస్క్రిప్షన్ మరియు రోగి వివరాలను పోలీసులకు తాను అందించినప్పటికీ, నన్ను ఆపి ఈపాస్ పొందమని అడిగారు" అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో "ఆన్ లైన్ లో 9 సార్లు ప్రయత్నించాను. కానీ సర్వర్ డౌన్ అయింది. వైద్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితులు అనుమతించబడతాయని నేను అనుకున్నాను" అని హీరో నిఖిల్ సోషల్ మీడియాలో తెలిపారు. లాక్ డౌన్ లో కరోనా కట్టడికి పోలీసులు ఈపాస్ తీసుకొని బయటకు రావాలంటున్నారు.

నిఖిల్ ట్వీట్ చేసిన వెంటనే హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విట్టర్ లో స్పందించారు. “ప్రియమైన సర్, దయచేసి మీరున్న ప్రదేశాన్ని పంచుకోండి. మేము సమస్య పరిష్కరించడానికి సంబంధిత / స్థానిక పోలీసులకు తెలియజేస్తాము. ధన్యవాదాలు." అని నిఖిల్ కు ట్వీట్ చేశారు. అవసరమైన వివరాలను తాను మెయిల్ చేశానని నిఖిల్ తెలిపారు. నిఖిల్ సమస్యను పోలీసులు తీర్చి ఆయనను పంపించడంతో సమస్య పరిష్కారం అయ్యింది. అవసరమైన వారికి హీరో నిఖిల్ మందులను అందజేశాడు.

కరోనావైరస్ రెండవ వేవ్ లో వైద్య సామాగ్రి అవసరమైన వారికి, బంధువులు, అసహాయలకు హీరో నిఖిల్ సాయం చేస్తున్నాడు. కోవిడ్ రోగులకు మరియు వారి బంధువులకు నిఖిల్ మందులు, ఇతర అవసరాలను తీరుస్తున్నాడు.