Begin typing your search above and press return to search.

దొంగిలించిన కార్ లో జోర్డాన్ పోలీసుల‌కు చిక్కిన 'స్పై'

By:  Tupaki Desk   |   26 Jun 2023 10:00 AM GMT
దొంగిలించిన కార్ లో జోర్డాన్ పోలీసుల‌కు చిక్కిన స్పై
X
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ స్పై ఈ గురువారం (జూన్ 29) విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. స్పై విడుద‌ల‌కు ముందు ర‌క‌ర‌కాల వివాదాల‌తో హెడ్ లైన్స్ లోకొచ్చింది. 'స్పై' వివాదాస్ప‌ద కంటెంట్ తో రూపొందిన సినిమా కావ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు సుభాష్ చంద్ర‌బోస్ అన్ నోన్ ఎండింగ్ స్టోరీతో ఈ సినిమా తెర‌కెక్క‌డంతో దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది.

పాన్ ఇండియా రిలీజ్ కి మ‌రో మూడు రోజులే స‌మ‌యం మిగిలి ఉంది. ప్ర‌స్తుతం చిత్ర‌బృందం ప‌లు టీవీ చానెళ్లలో ప్ర‌చారంతో బిజీ బిజీగా ఉంది. తాజాగా యాంక‌ర్ సుమ‌తో చిట్ చాట్ లో నిఖిల్ బృందం త‌మ‌కు జోర్డాన్ లో ఎదురైన చేదు అనుభ‌వాన్ని వివ‌రించింది. నిజానికి త‌మ బృందం స్పై మూవీ చిత్రీక‌ర‌ణ కోసం అద్దె కార్ లో వెళుతున్న స‌మ‌యంలో జోర్డాన్ పోలీసుల‌కు చిక్కామ‌ని నిఖిల్ తెలిపారు.

అయితే వారు ప్ర‌యాణిస్తున్న ఆ అద్దె కార్ అప్ప‌టికే దొంగిలించిన కార్ల‌ రికార్డుల్లో ఉంది. కార్ డ్రైవ‌ర్ తాను ఒక‌సారి పోలీస్ స్టేష‌న్ కి వెళ్లి రావాల్సి ఉంద‌ని చిత్ర‌బృందానికి తెలిపాడ‌ట‌.

దీంతో కంగారు ప‌డిపోయిన నిఖిల్ 'స్పై' బృందం త‌మ‌ను కూడా ఇంట‌రాగేట్ చేస్తార‌ని కొంత కంగారు ప‌డ్డారు. అయితే తాము భార‌త‌దేశం నుంచి షూటింగ్ కోసం వ‌చ్చిన టూరిస్టులు అని జోర్డాన్ పోలీసులు గుర్తించారు. సంబంధిత స‌మాచారాన్ని చిత్ర‌బృందం అక్క‌డి పోలీసుల‌కు వివ‌రించిందట‌. ఆస‌క్తిక‌రంగా అస‌లు పోలీసులు త‌మ వాహ‌నాన్ని ఆప‌క‌పోయినా ఏదో అడ్రెస్ తెలుసుకునేందుకు నేరుగా జోర్డాన్ పోలీసుల వ‌ద్ద‌కే వెళ్లి కార్ ని ఆపి పొర‌పాటు చేశామ‌ని నిఖిల్ వెల్ల‌డించారు.

ఆ స‌మ‌యంలో ఆ కార్ నంబ‌ర్ ని వెరిఫై చేసిన పోలీసులు ఇది దొంగిలించ‌బ‌డిన కార్ అని చెప్పారు. డ్రైవ‌ర్ ని అదుపులోకి తీసుకున్నారు. నిజానికి జోర్డాన్ లోని ఆ ప్రాంతం చాలా సెన్సిటివ్ గా ఉంటుంద‌ని మిల‌ట‌రీ బృందాల‌తో నిరంత‌రం గ‌స్తీ కాసే ప్రాంతం కావ‌డంతో తాము చాలా కంగారు ప‌డ్డామ‌ని వెల్ల‌డించారు నిఖిల్.

అలాగే జోర్డాన్ పోలీసులు త‌మ సినిమా టైటిల్ గురించి ప్ర‌శ్నించ‌గా 'స్పై' అని చెప్పార‌ట‌. వెంట‌నే జోర్డాన్ దేశంపై స్పైయింగ్ చేయ‌డానికి వ‌చ్చారా? అంటూ పోలీసులు ప్ర‌శ్నించారు. అయితే ఆ స‌మ‌యంలో కంగారు ప‌డ‌కుండా గూగుల్ లో స్పై మూవీ కి సంబంధించిన వీకీ డీటెయిల్స్ ని చూపించార‌ట‌. అలా మొత్తానికి స్పై టీమ్ దేశం కాని దేశంలో అరెస్ట్ అవ్వ‌కుండా బ‌య‌ట‌ప‌డ్డార‌న్న‌మాట‌.