Begin typing your search above and press return to search.

మెగా సూర్యకాంతం వస్తోంది

By:  Tupaki Desk   |   23 July 2018 8:47 AM GMT
మెగా సూర్యకాంతం వస్తోంది
X
సూర్యకాంతం అంటే పేరు కాదు. ఒక బ్రాండ్. గయ్యాళితనానికి సూచికగా ఆవిడ చనిపోయి సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటికీ ఆ పేరు వాడుతూనే ఉంటారు. ఆవిడ చూపిన ప్రభావం అలా చరిత్రలో నిలిచిపోయింది. సూర్యకాంతం గారి ప్రభ వెలిగిపోతున్న రోజుల్లో అంత మంచి పేరుని తమ పిల్లలకు పెట్టేందుకు ఆడవాళ్ళు భయపడే వారట. ఎక్కడ తమ బిడ్డకు ఆ లక్షణాలు వస్తాయో అని. నిజానికి సూర్యకాంతం గారు తెరవెనుక చాలా సున్నితమనస్కురాలని ఆవిడతో పనిచేసిన ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ప్రేక్షకులు చూసేది తెరమీద సూర్యకాంతంనే కాబట్టి వాళ్లకు మిగిలింది అవసరం లేదు. ఇప్పుడు ఆ పేరుని సినిమా కోసం వాడే సాహసం చేస్తోంది మెగా డాటర్ నీహారిక. సూర్యకాంతం అనే పేరున్న పాత్రతో రూపొందుతున్న సినిమాలో నీహారికకు పెర్ఫార్మన్స్ చూపించుకోవడానికి మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కిందని సమాచారం.

ఈ సూర్యకాంతం దర్శకుడు ప్రణీత్. గతంలో నీహారికతో ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్ తీసింది ఇతనే. ఆన్ లైన్ లో మంచి హిట్ గా నిలిచిన అందులో పనితనం చూసే నీహారిక తన బ్యానర్ పై ఈ సినిమా రూపొందించే అవకాశం ఇచ్చిందట. తర్వాత నాన్న నాగబాబుతో కలిసి చేసిన నాన్నకూచి వెబ్ సిరీస్ కి కూడా ఇతనే డైరెక్టర్. సూర్యకాంతంలో నీహారికకు జోడిగా ఆదిత్ అరుణ్ కనిపిస్తాడు. మిగిలిన వివరాలు ఎక్కువ బయటికి రాకుండా జాగ్రత్త పడుతోంది యూనిట్. ఈ నెల 28న విడుదల కానున్న హ్యాపీ వెడ్డింగ్ మీద నీహారిక బోలెడు ఆశలు పెట్టుకుంది. ఒక మనసు నిరాశపరిచినా నీహారిక ప్రయత్నం మెప్పు పొందింది. హ్యాపీ వెడ్డింగ్ తో కమర్షియల్ గా కూడా తనతో సినిమాలు చేయొచ్చని భరోసా ఇచ్చేలా హ్యాపీ వెడ్డింగ్ నిలుస్తుందని నీహారిక నమ్మకం. నాగ అశ్విన్ హీరోగా నటించిన ఈ మూవీ పెళ్లి నేపథ్యంతో రూపొంది ఫ్యామిలీ ఆడియన్స్ ని మెయిన్ టార్గెట్ గా పెట్టుకుంది.