Begin typing your search above and press return to search.

నన్ను కొట్టినందుకు నాన్న చాలా బాధపడ్డాడు

By:  Tupaki Desk   |   23 Nov 2021 5:30 PM GMT
నన్ను కొట్టినందుకు నాన్న చాలా బాధపడ్డాడు
X
మొదటి నుంచి కూడా నిహారిక మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకోకుండా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాలనే పట్టుదలతోనే అడుగులు వేస్తూ వచ్చింది. యాంకర్ గా .. హోస్ట్ గా .. హీరోయిన్ గా ఆమె తన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చింది. అలాగే సొంత బ్యానర్ పై వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ వచ్చింది.

వివాహమైన తరువాత ఇక పూర్తిస్థాయిలో ఆమె వెబ్ సిరీస్ ల ప్రొడక్షన్ పైనే దృష్టిపెట్టింది. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొని, అనేక విషయాలను అభిమానులతో పంచుకుంది.

"నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. ఓబుల్ రెడ్డిలోను .. సెంయింట్ మేరీస్ లోను నా చదువు కొనసాగింది. చిన్నప్పుడు చాలామంది కూడా పెద్దయిన తరువాత టీచర్ కావాలని అనుకుంటారు.

అలాగే నేను కూడా టీచర్ ను కావాలని అనుకునేదానిని. సెవెంత్ క్లాస్ కి వచ్చిన తరువాత డాక్టర్ కావాలని ఉండేది. డాక్టర్ అయితే ఎప్పుడూ చదువుతూనే ఉండాలని చెప్పి వద్దన్నారు. మా ఫ్యామిలీలో కొంతమంది డాక్టర్లు కూడా ఉన్నారు. వాళ్లు కూడా అదే సలహా ఇచ్చారు.

హీరోయిన్ కావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు .. యాక్టర్ ను కావాలని మాత్రం ఉండేది. అప్పుడు నాకు మా పెదనాన్న తప్ప ఎవరూ తెలియదు .. ఆయనే నాకు స్ఫూర్తి. తెలుగులో మూడు .. తమిళంలో ఒక సినిమా చేశాను. గమ్మత్తు ఏమిటంటే మా నాన్న నన్ను మమ్మీ అని పిలిస్తే, నా వారు నన్ను నాన్న అని పిలుస్తారు.

ఇక మా అన్నయ్య చాలా డిఫరెంట్. మాములుగా అయితే 'నీహా' అనీ .. బాగా ముద్దొస్తే బంగారం అనీ .. ఇంకా ముద్దొస్తే పంది అని పిలుస్తాడు. అన్నయ్య పిలవడాన్ని బట్టి ఆ రోజున నా మీద ఎంత ప్రేమ ఉందనేది నాకు అర్థమవుతూ ఉంటుంది.

ఇక నాన్న నన్ను ఎప్పుడూ ఏమీ అనేవారు కాదు .. కానీ అలాంటి ఆయన ఒకసారి కన్ను కొట్టారు. మా స్కూల్ ఫ్రెండ్ బర్త్ డే ఉంది నేను వెళ్తాను అని చెప్పాను .. కానీ ఎప్పుడు వెళతాను అనేది చెప్పలేదు. అప్పటికి ఇంకా మొబైల్ ఫోన్స్ కూడా లేవు. ఇంట్లో చెప్పేశాను గదా అని నేను మా ఫ్రెండ్ వాళ్లింటికి వెళ్లాను.

నా కోసం మా వాళ్లంతా వెదకడం మొదలుపెట్టారు. చివరికి నేను స్కూల్ ఫ్రెండ్ గురించి చెప్పిన మాట గుర్తొచ్చి, మా ఫ్రెండ్ ఇంటికి ఎదురుగా ఉన్న బుక్ షాప్ కి కాల్ చేసి, ఆ ఇంట్లో నేను ఉన్నానో లేదో చూసి చెప్పమన్నారట.

ఆ బుక్ షాప్ అతను వచ్చి నన్ను చూసి .. నేను అక్కడ ఉన్నట్టుగా నాన్నకి చెప్పాడు. వెంటనే మా నాన్న కారు తీసుకుని వచ్చాడు. నన్ను వెంటబెట్టుకుని ఇంటికి బయల్దేరాడు. 'నాన్న ఏంటీ' అని నేను అనగానే 'ఫట్' నా వీపుపై కొట్టాడు. చెప్పేసి వెళ్లాలి గదా .. ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా? అని అరిచారు.

నేను చెప్పానుగదా అంటూ ఏడుస్తూనే ఉన్నాను. అలా నన్ను కొట్టినందుకు .. మా నాన్న పది రోజుల పాటు బాధపడ్డారు. ఈ చేత్తో కొట్టనురా దాన్ని .. ఈ చేత్తో కొట్టాను అని ఇంట్లో వాళ్లతో చెప్పి బాధపడేవారు" అని చెప్పుకొచ్చింది.