Begin typing your search above and press return to search.

మహేశ్ బాబు జోడీగా నిధి అగర్వాల్?

By:  Tupaki Desk   |   23 April 2021 10:00 PM IST
మహేశ్ బాబు జోడీగా నిధి అగర్వాల్?
X
మహేశ్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదా పడిన షూటింగ్, పరిస్థితులు అనుకూలించాక మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్టు తరువాత మహేశ్ బాబు .. త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టు పనుల్లోనే ఉన్నాడు. రాజకీయాల నేపథ్యంలోనే ఈ కథ నడుస్తుందని అంటున్నారు. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ఈ సినిమా రూపొందనుంది.

ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. త్రివిక్రమ్ తన సినిమాలో హీరోలను .. హీరోయిన్లను కూడా రిపీట్ చేస్తూనే ఉంటాడు. కథానాయికల విషయానికొస్తే త్రిష .. ఇలియానా .. సమంత .. పూజా హెగ్డే ఆయన సినిమాల్లో వెంటవెంటనే కనిపించారు. 'అరవింద సమేత'లో అలరించిన పూజా హెగ్డే, ఆ వెంటనే 'అల వైకుంఠపురములో' సినిమాలో కనువిందు చేసింది. అలాగే మహేశ్ బాబు సినిమా కోసం కూడా పూజా హెగ్డేనే తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి.

కానీ ఈ సినిమాకి సంబంధించి తాజాగా 'నిధి అగర్వాల్' పేరు తెరపైకి వచ్చింది. తెలుగులో వరుసగా రెండు ఫ్లాపులు అందుకున్న నిధి అగర్వాల్, మూడో సినిమా అయిన 'ఇస్మార్ట్ శంకర్'తో హిట్ అందుకుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన నాయికగా 'హరిహర వీరమల్లు' చేస్తోంది. ఈ సినిమా తరువాత ఆమె చేయనున్నది త్రివిక్రమ్ సినిమాలోనే అంటున్నారు. అయితే ప్రధాన కథానాయికగా కనిపిస్తుందా? సెకండ్ హీరోయిన్ గా అలరిస్తుందా? అనే విషయంలో స్పష్టత రావలసి ఉంది.