Begin typing your search above and press return to search.

రాజాకు సారీ చెప్పారు కాని

By:  Tupaki Desk   |   27 Jan 2018 10:59 AM GMT
రాజాకు సారీ చెప్పారు కాని
X
సౌత్ ఇండియాలో మాత్రమే కాక దేశవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్న మేస్ట్రో ఇళయరాజా గారికి పద్మవిభూషణ్ రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంటే కొన్ని మీడియా వర్గాలకు మాత్రం కిట్టడం లేదనే విషయం నిన్న బయట పడింది. ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఆయన దళితుడు కావడం వల్లే అవార్డు వచ్చింది అనేలా కథనం రాయడం తీవ్ర వివాదాన్ని రేపుతోంది. రాజా పరిశ్రమకు వచ్చి నలభై ఏళ్ళు అవుతున్నా ఏనాడూ రాని ప్రశ్న ఈ పురస్కారం వచ్చాక రావడం పట్ల రాజా అభిమానులే కాక సగటు ప్రేక్షకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. సదరు పత్రిక మీద సోషల్ మీడియాలో ముప్పేట దాడి జరగడంతో లెంపలేసుకున్న యాజమాన్యం సారీ రాజా పేరిట మరో కథనాన్ని ప్రచురించి సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది.

వివాదం సద్దుమణిగినట్టే ఉన్నా ఇలాంటి తొందరపాటు పనులు చేయటం వల్ల ఇప్పటికే చులకన అవుతున్న మీడియా విలువల పట్ల జనంలో ఇంకా దిగజారుడు అభిప్రాయం కలిగేలా చేయటం మాత్రం క్షమించరానిది. వెయ్యికి పైగా సినిమాలకు మర్చిపోలేని అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఒక మహోన్నత వ్యక్తిని ఇలా కులం పేరిట ప్రస్తావించి అందరి దృష్టిని ఆకర్షించాలనే ప్రయత్నం చేయటం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. తమిళ సంఘాలు దీని గురించి అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి.

నిన్న ఇదే వార్త తాటికాయంత అక్షరాలతో మెయిన్ హెడ్డింగ్ పెట్టి రాసిన ఆ ఉన్నతమైన ఇంగ్లీష్ పత్రిక క్షమాపణ మాత్రం లోపలి పేజీలలో చిన్న బాక్స్ రూపంలో ఇవ్వడం కూడా గమనార్హం. రాజా సంగీతానికి దశాబ్దాలు దాటుతున్నా చెక్కు చెదరని ఆదరణతో ఇప్పటి కుర్రాళ్ళ ఫోన్లలో కూడా అవే పాటలు ఉండేంత గొప్ప విద్వత్తు ఆయన చూపించారు. ఇకనైనా ఇలాంటి వాటికి స్వస్తి పలికి జర్నలిజం విలువలు కాపాడాలని సంగీత ప్రేమికులు కోరుతున్నారు. సారీ చెప్పారు సరే నిన్న జరిగిన డ్యామేజ్ కి బాధ్యత ఇక్కడితో తీరిపోయినట్టేనా.