Begin typing your search above and press return to search.

RRR.. తొలి రోజు ₹ 200 కోట్లు ఖాయమేనా..?

By:  Tupaki Desk   |   19 March 2022 12:30 AM GMT
RRR.. తొలి రోజు ₹ 200 కోట్లు ఖాయమేనా..?
X
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ''ఆర్.ఆర్.ఆర్''. యావత్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్ లలో ఈ చిత్రం విడుదల కానుంది.

బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన 'బాహుబలి' సిరీస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో 'ఆర్.ఆర్.ఆర్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనిని తగ్గట్టే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 478 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రానికి 880 కోట్ల వ్యాపారం జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో RRR సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి.. కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి తొలి రోజు కనీసం రూ. 50 కోట్ల షేర్ రావొచ్చనే అంచనాలు వేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే టికెట్ రేట్లు పెంచడంతో పాటుగా పెద్ద సినిమాలకు 5 షోలకు అనుమతి ఉంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే టికెట్ రేట్లు ఫిక్స్ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఐదు షోలకు పెర్మిషన్ ఇచ్చింది. ఇక ఆర్.ఆర్.ఆర్ సినిమాకు టిక్కెట్ల పెంపు విషయంలో జగన్ సర్కారు క్లారిటీ ఇచ్చింది. ఈనెల 25 నుంచి పది రోజుల పాటు సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతించింది. అన్ని కాసుల్లో రూ. 75 అదనంగా పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

RRR సినిమా టికెట్ రేట్లు ఏపీలో ప్రాంతాల వారీగా చూసుకుంటే.. కార్పొరేష‌న్స్‌ పరిధిలో సింగిల్ స్క్రీన్స్ టికెట్ ధర రూ.236 - మ‌ల్టీప్లెక్స్ లో రూ. 265 రూపాయలుగా ఉన్నాయి. మున్సిపాలిటీస్‌ లో సింగిల్ స్క్రీన్స్ లో రూ. 206 - మ‌ల్టీప్లెక్స్ లో రూ. 236 గా ఉంది. ఇత‌ర ప్రాంతాల విష‌యానికి వస్తే సింగిల్ స్క్రీన్స్ లో రూ. 195 - మ‌ల్టీప్లెక్స్ లో 206 రూపాయలుగా ఉన్నాయి.

ఏపీలో టికెట్ ధరలు ఇదే విధంగా ఉంటే ఫస్ట్ డే RRR సినిమాకు దాదాపు 30 కోట్ల పైనే షేర్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ వేస్తే ఈ నంబర్ మరింత పెరిగనుంది. ఇక నైజాంలో మొదటి రోజు 20 కోట్ల వరకూ రావొచ్చని అంచనా. అంటే తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 50 కోట్ల పైనే వసూళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది.

తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్ సీస్ లోనూ ఆర్.ఆర్.ఆర్ భారీ వసూళ్లు అందుకలకోనుంది. ఇప్పటికే యూఏస్ఏ ప్రీ బుకింగ్ సేల్స్ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. బాలీవుడ్ సహా మిగతా రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ వస్తే మాత్రం వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే ఈజీగా రూ. 200 కోట్లు గ్రాస్ అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ట్రిపుల్ ఆర్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

ఇప్పటికే ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నిడివి 3 గంటలకు పైనే వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో 'ఆర్ ఆర్ ఆర్' టీమ్ ప్రమోషన్స్ తో సందడి చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రానున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రచారం ముమ్మరం చేశారు. దుబాయ్ - బెంగుళూరు - బరోడా - ఢిల్లీ - అమృతసర్ - జైపూర్‌ - కోల్ కటా - వారణాసి - హైదరాబాద్ వంటి 9 నగరాలలో పర్యటించడానికి చిత్ర బృందం టూర్ ప్లాన్ చేసుకుంది.