Begin typing your search above and press return to search.

ప్రశాంత్ నీల్ .. నీ పనితనం భేష్ ..!

By:  Tupaki Desk   |   5 May 2022 5:00 PM IST
ప్రశాంత్ నీల్ .. నీ పనితనం భేష్ ..!
X
రాంగోపాల్ వర్మ .. ఇండియన్ సినిమాను గురించి తెలిసినవారికి ఆయన పేరు తెలియకుండా ఉండదు. కథాకథనాల పరంగా .. సాంకేతికత పరంగా తెలుగు సినిమాను కొత్త ట్రెండ్ దిశగా ఆయన అడుగులు వేయించారు. ఆరంభంలో యూత్ కి నచ్చే కథలను ఎక్కువగా తయారు చేసుకున్న ఆయన, ఆ తరువాత మాఫియా కథలను పరిగెత్తించారు. దెయ్యం కథలతోను దడదడలాడించారు. ఇక ఆ తరువాతనే ఎక్కడ ఎలాంటి అనూహ్యమైన సంఘటన జరిగినా, దానినే కథగా చేసుకుని తెరపైకి పట్టుకెళ్లడం మొదలుపెట్టారు.

వర్మలో ఒక ప్రత్యేకత ఉంది. తన సినిమాల హిట్లు .. ఫ్లాపుల గురించి ఆయన ఎక్కువగా పట్టించుకున్నట్టుగా కనిపించరు. ఇక ఆయన ఎవరినైనా ఉద్దేశించి ఒక ట్వీట్ చేస్తే ఆయన పొగిడినట్టా? .. తిట్టినట్టా? అనేది తేల్చుకోవడం చాలా కష్టం. అలాగే అవతల వ్యక్తులు చేసిన విమర్శలను కూడా ఆయన పట్టించుకున్నారా లేదా? అనేది కూడా అంతుబట్టని ప్రశ్నగానే మిగిలిపోయింది. తాను చేయవలసిన విమర్శలను తాను చేస్తూ వెళ్లిపోతుంటారు అంతే. వాటి పరిణామాలు .. పర్యవసానాలను గురించి ఆయన ఎంతమాత్రం ఆలోచన చేయరు.

అలాంటి వర్మ ట్వీట్ ఈ సారి ప్రశాంత్ నీల్ ను తాకింది. 'కేజీఎఫ్ 2' సినిమాతో ఇప్పుడు ఎక్కడ చూసినా దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు మారుమ్రోగుతోంది. ఆయనతో సినిమాలు చేయడానికి బడా బ్యానర్లు పోటీపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే నిన్న 'దర్శకుల దినోత్సవం' సందర్భంగా వర్మ ఒక ట్వీట్ చేశారు.

"ప్రశాంత్ నీల్ .. నువ్వు భారతీయ చలన చిత్ర పరిశ్రమకి వీరప్పన్ లాంటివాడివి. 'కేజీఎఫ్' సినిమాతో ఒక్క కన్నడలోనే కాదు, టాలీవుడ్ .. కోలీవుడ్ .. బాలీవుడ్ లోని దర్శకులందరి మనసులను కొల్లగొట్టేశావ్. అందుకు నీకు దర్శకుల దినోత్సవ శుభాకాంక్షలు.

'కేజీఎఫ్ 2' ఎందుకు అంత హిట్ అయిందో తెలియక చాలా మంది ఆలోచనలో పడ్డారు. చాలామంది తమ సినిమాలు రీ షూట్లు చేయిస్తూ ట్రక్కుల కొద్దీ డబ్బును వృథా చేస్తున్నారు. నిజం చెప్పాలంటే చిత్రపరిశ్రమకి చెందిన 95 శాతం మంది సంప్రదాయమైనవారికి 'కేజీఎఫ్ 2' నచ్చలేదు. పాత సినిమా పరిశ్రమను బయటికి నెట్టి .. కొత్త సినిమా పరిశ్రమకు ప్రశాంత్ నీల్ జీవం పోశాడు.

ఆ కొత్త సినిమా పరిశ్రమ పేరే 'కేజీఎఫ్ 2' అంటూ రాసుకొచ్చారు. ఇలాంటోడు ఒక్కడుంటే చాలు అనే తరహాలో ప్రశాంత్ నీల్ ను వర్మ ప్రశంసించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వర్మ ఎప్పుడు ఎలాంటి ట్వీట్ వదులుతాడో తెలియదు గనుక, ప్రశాంత్ నీల్ దీనిని లైట్ తీసుకొంటాడేమో చూడాలి మరి.