Begin typing your search above and press return to search.

నన్ను మామూలుగా ట్రోల్ చేయలేదు గురూ!

By:  Tupaki Desk   |   29 April 2022 5:30 PM GMT
నన్ను మామూలుగా ట్రోల్ చేయలేదు గురూ!
X
ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా .. ఎక్కడ ఉండవలసిన పోటీ అక్కడ ఉంటుంది. బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా పెద్దది. అందువలన సహజంగానే అక్కడ పోటీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఒక అవకాశాన్ని సంపాదించుకోవడం .. వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకోవడం చాలా చాలా కష్టం. ఇక స్టార్ వారసులకు కూడా అక్కడ కెరియర్ పరమైన తిప్పలు తప్పవు. వారసులకు వచ్చే హిట్ల సంగేతేమోగానీ .. విమర్శలు మాత్రం ఫుల్లుగా వస్తాయని టైగర్ ష్రాఫ్ అంటున్నాడు. ఆయన తాజా చిత్రమైన ' హీరోపంటి 2' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో జాకీ ష్రాఫ్ తనయుడే టైగర్ ష్రాఫ్. 'హీరో పంటి' సినిమాతోనే ఆయన బాలీవుడ్ తెరకి పరిచయమయ్యారు. తెలుగులో వచ్చిన 'పరుగు' సినిమాకి ఇది రీమేక్.

అల్లు అర్జున్ - షీలా జంటగా 'బొమ్మరిల్లు' భాస్కర్ రూపొందించిన ఈ సినిమా, తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాంటి ఈ సినిమాతోనే బాలీవుడ్లోకి టైగర్ ష్రాఫ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో ఆయన బబ్లూ సింగ్ పాత్రను పోషించాడు.

2014లో వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా 'హీరో పంటి 2' సినిమాను రూపొందించారు. ఈ సినిమా ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో 'హీరోపంటి' గురించి టైగర్ ష్రాఫ్ ప్రస్తావించాడు.

మొదటి నుంచి కూడా నాపై ఎక్కువ ట్రోలింగ్ నడుస్తూ వచ్చింది. నేను నా ఫస్టు మూవీ చేసేటప్పటికీ మీసాలు .. గెడ్డం పెద్దగా రాలేదు. అందువలన ఆడపిల్లలా ఉన్నావంటూ ట్రోల్ చేసేవారు. అప్పుడు నేను చాలా చాలా ఫీలయ్యేవాడిని

జాకీ ష్రాఫ్ కి మొదటి నుంచి ఉన్న క్రేజ్ వేరు. ఆయన వారసుడిగా నా గురించి అదే స్థాయిలో ఊహించుకున్నారు. నా లుక్ చాలా డిఫరెంట్ గా ఉండటంతో నాపై ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆ సినిమా హిట్ అయిన తరువాత నాపై ట్రోల్స్ తగ్గుతూ వచ్చాయి. ఆ తరువాత నేను నా ఫిజిక్ పై .. డాన్స్ .. ఫైట్స్ పై దృష్టి పెట్టాను. ఇప్పుడు నాకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఉన్న ఈ స్థానాన్ని అందుకోవడానికే నేను చాలా కష్టపడవలసి వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.