Begin typing your search above and press return to search.

బాబూ ఆర్జీవీ.. ఏంటి ఈ రచ్చ..??

By:  Tupaki Desk   |   5 April 2022 10:30 AM GMT
బాబూ ఆర్జీవీ.. ఏంటి ఈ రచ్చ..??
X
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ''డేంజరస్'' అనే లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఆర్టికల్ 377 సవరించిన తర్వాత భారతదేశంలోనే ఇది లెస్బియన్ లవ్ - క్రైమ్ - యాక్షన్ మూవీ అని ఆర్జీవీ పేర్కొంటున్నారు.

నైనా గంగూలీ - అప్సర రాణి ప్రధాన పాత్రల్లో వర్మ తెరకెక్కించిన ''డేంజరస్'' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 8న విడుదల చేయనున్నారు. తెలుగులో 'మా ఇష్టం' పేరుతో రాబోతున్న ఈ సినిమాని.. హిందీ తమిళం కన్నడ మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమా ఎలా ఉండబోతుందో ఓ అంచనాలు వచ్చేలా చేశాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఆర్జీవీ తన ఇద్దరు డేంజరస్ అమ్మాయిలను వెంటేసుకొని ముమ్మరంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తూ.. సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

తానొక విజువల్ వండర్ ని రూపొందించానని అనుకున్నారేమో RRR రేంజ్ లో దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆర్జీవీ. ట్రిపుల్ ఆర్ లో ఇద్దరు పెద్ద హీరోలు ఉంటే.. మా సినిమాలో ఇద్దరు కత్తిలాంటి హీరోయిన్లు ఉన్నారని గొప్పగా చెబుతున్నారు.

ఇప్పటికే ఢిల్లీ - బెంగళూరు - చెన్నై - కలకత్తా - హైదరాబాద్ వంటి నగరాలలో 'డేంజరస్' టీమ్ పర్యటించి వచ్చింది. ఇక ఎప్పటిలాగే రామ్ గోపాల్ వర్మ తన సినిమా ప్రమోషన్స్ కోసం సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. నైనా - అప్సర ఫోటోలు వీడియోలతో రచ్చ చేస్తున్నాడు. నా కెరీర్ లోనే బెస్ట్ షాట్స్ ఇవేనని చెబుతున్నాడు.

ఇద్దరు మహిళల మధ్య ప్రపంచంలోనే మొట్టమొదటి సారి లెస్బియన్ రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ ని చిత్రీకరించానని చెబుతూ వస్తోన్న ఆర్జీవీ.. దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్ ను ఒక్కటొక్కటిగా వదులుతూ వస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా వదిలిన ఓ వీడియో చూస్తే అందరూ షాక్ అవ్వకమానరు. అది ఫీచర్ సినిమాలో సన్నివేశమా లేదా మరేదైనా చిత్రంలోనిదా అనే సందేహం కలగకమానదు. ఎందుకంటే ఆ క్లిప్పింగ్ ఆ రేంజ్ లో ఉంది మరి.

'స్త్రీకి స్త్రీకి.. హృదయానికి హృదయానికి మధ్య ఉన్న ప్రేమను ముక్కలు చేసేంత బలమైన శక్తి లేదు' అంటూ వదిలిన ఈ వీడియోలో నైనా - అప్సర ఇద్దరూ పొట్టి పొట్టి దుస్తుల్లో రెచ్చిపోయి రొమాన్స్ చేసుకుంటున్నారు. ఇక ఆర్జీవీ కెమెరా యాంగిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇందులో నైనా - అప్సర మధ్య లిప్ లాక్ కిస్సింగ్ సీన్స్ - రొమాంటిక్ సన్నివేశాలకు కొదువ లేదని ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే అర్థం అవుతుంది. అయితే వర్మ సినిమాలను ఇష్టపడే ఓ వర్గం వారికి ఇది విజువల్ ట్రీట్ అయ్యుండొచ్చు. కాకపోతే ఇలాంటి డేంజరస్ సినిమాని బిగ్ స్క్రీన్ మీదకు తీసుకొస్తే ఎంత మంది చూస్తారనేది ప్రశ్నార్ధకం.

ఒకప్పుడు తన క్రియేటివిటీతో ఇండస్ట్రీకి కొత్త దారి చూపిన రామ్ గోపాల్ వర్మ.. గత కొంతకాలంగా బీ గ్రేడ్ నాసిరకం సినిమాలు అందిస్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ మధ్య ఆర్జీవీ నుంచి గొప్పగా చెప్పుకొనే సినిమా ఒక్కటీ రాలేదు.

ఇప్పుడు 'డేంజరస్' సినిమా యాభై కోట్లు కలెక్ట్ చేస్తుందని నిర్మాత చెబుతున్నారు. ఓ వర్గం ఆడియన్స్ ను నమ్ముకొని తీసిన ఈ మూవీపై అంత ధీమాగా ఉండటానికి కారణాలేంటో వాటికే తెలియాలి. ఏదైతేనేం రాంగోపాల్ వర్మ నుంచి 'డేంజరస్' అనే పాన్ ఇండియా సినిమా థియేటర్లోకి రాబోతోంది.

ప్రస్తుతానికైతే మహిళా సంఘాలు సామాజిక కార్యకర్తలు దీనిపై అభ్యంతరం తెలుపుతూ నిరసన తెలుపలేదు. మరి మరో మూడు రోజుల్లో విడుదల కానున్న ఈ చిత్రం.. ఆర్జీవీ గత చిత్రాల మాదిరిగానే ఒక్క రోజుకే పరిమితం అవుతుందా లేదా వారం పాటు థియేటర్లలో నడిచి ఓ మోస్తరు వసూళ్ళు అందుకుందా అనేది చూడాలి.