Begin typing your search above and press return to search.

ఓటీటీలో సత్తా చాటుతున్న 'రాధేశ్యామ్'..!

By:  Tupaki Desk   |   5 April 2022 8:30 AM GMT
ఓటీటీలో సత్తా చాటుతున్న రాధేశ్యామ్..!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డే జంటగా నటించిన పీరియాడికల్ లవ్ డ్రామా ''రాధేశ్యామ్''. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది.

ప్రేమకు విధికి మధ్య యుద్ధంగా అభివర్ణించబడిన 'రాధేశ్యామ్' సినిమా ద్వారా ఓ అందమైన ప్రేమ కథను చెప్పే ప్రయత్నం చేశారు. భారీ బడ్జెట్ తో యూరప్ బ్యాక్ డ్రాప్ లో విజువల్ గ్రాండియర్ గా రూపొందించారు. అయితే 'బాహుబలి' 'సాహో' వంటి సినిమాల తర్వాత ఒక్క ఫైట్ కూడా లేని లవ్ స్టొరీలో ప్రభాస్ ను ఆడియన్స్ ఊహించుకోలేకపోయారు.

మెజారిటీ డార్లింగ్ ఫ్యాన్స్ సైతం 'రాధేశ్యామ్' సినిమా విషయంలో నిరాశ చెందారు. ఫీల్‌ గుడ్‌ ఫిల్మ్ అంటూనే ప్రభాస్ చేయాల్సిన సినిమా కాదని కామెంట్స్ చేశారు. అయితే థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ప్రభాస్ సినిమా.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ లో మాత్రం ఆదరణ దక్కించుకుంటోంది.

డిజిటల్ స్క్రీన్ మీద బోరింగ్ సీన్స్ స్కిప్ చేసే అవకాశం ఉండటంతో.. ఎక్కువ మంది ఈ సినిమా చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో థియేటర్ కు మించిన క్రేజ్ తో ఓటీటీలో భారీ వ్యూయర్ షిప్ సాధిస్తున్నట్లు తెలుస్తోంది. 'రాధేశ్యామ్' సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

అయితే అగ్రిమెంట్ చేసుకున్న తేదీ కంటే కొంచెం ముందుగానే ఓటీటీలో విడుదల చేశారు. మార్చి 11న థియేట్రికల్ రిలీజ్ కాబడిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న తెలుగుతో పాటుగా తమిళ కన్నడ మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ పెట్టారు. ఇందుకుగాను మేకర్స్ కు మరో 25 కోట్లు అదనంగా చెల్లిస్తోందని టాక్.

'రాధేశ్యామ్' సినిమా ఫలితం ఎలా ఉన్నా.. నిర్మాతలు మాత్రం నాన్-థియేట్రికల్ బిజినెస్ తో సేఫ్ జోన్ లోనే ఉన్నారని తెలుస్తోంది. ప్రభాస్ క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ భారీ రేట్లకు అమ్ముడయ్యాయి. ఏదైతేనేం థియేట్రికల్ గా ఫెయిల్యూర్ గా మిగిలిన ఈ సినిమా.. ఓటీటీలో మంచి వ్యూయర్ షిప్ సాధిస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

కాగా, 'రాధేశ్యామ్' చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ - టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో కృష్ణంరాజు - భాగ్యశ్రీ - మురళీ శర్మ - సచిన్‌ ఖేడ్‌కర్‌ - జయరామ్ - ప్రియదర్శి - సత్యరాజ్ - కునాల్ రాయ్ క‌పూర్‌ - ఎయిర్ టెల్ శాషా ఛ‌త్రి - రిద్ది కుమార్‌ - స‌త్యన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

జస్టిన్ ప్రభాకర్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా.. ఎస్ ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేశారు. మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రఫీ అందించగా.. ఆర్‌.రవీందర్‌ ప్రొడక్షన్‌ డిజైనింగ్ నిర్వహించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేశారు.