Begin typing your search above and press return to search.

సూప‌ర్ సీనియ‌ర్ల న‌యా ట్రెండ్ ఇదే!

By:  Tupaki Desk   |   18 July 2022 10:30 AM GMT
సూప‌ర్ సీనియ‌ర్ల న‌యా ట్రెండ్ ఇదే!
X
నీలో ట్యాలెంట్ ఉందా? క‌మ‌ర్శియ‌ల్ సినిమాలు చేసి స‌క్సెస్ అందుకున్న ట్రాక్ ఉందా? ఆరెండు గ‌నుక ఉంటే ఛాన్స్ వ‌చ్చిన‌ట్లే. అవును సీనియ‌ర్ హీరోలు చిరంజీవి..బాల‌కృష్ణ‌..వెంక‌టేష్‌...ర‌జ‌నీకాంత్..నాగార్జున లాంటి స్టార్లు ఇప్పుడు అలాంటి మేక‌ర్ల‌వైపే చూస్తున్నారు. నేటి జ‌న‌రేష‌న్ హీరోల‌తో పోటీప‌డుతూ సినిమాలు చేయ‌డానికి ఎంతో ఆస‌క్తి చూపిస్తున్నారు.

వాళ్ల‌కి మేమేం త‌క్కువ కాదంటూ దూసుకుపోతున్నారు. ప్ర‌స్తుతం మెగాస్టార్ లైన‌ప్ చూసినా..బాల‌య్య ప్లానింగ్ చూసినా.. ర‌జ‌నీ కాంత్ ట్రాక్ చూసినా...వెంక‌టేష్ వేగం చూసినా... నాగార్జున కేరింగ్ చూస్తున్నా ఈ విష‌యం అర్ధ‌మ‌వుతుంది. ట్యాలెంటెడ్ యంగ్ డైరెక్ట‌ర్ల‌తో సీనియ‌ర్లంతా సినిమాలు చేయ‌డానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు.

ప్రస్తుతం చిరంజీవి బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్ లు తెరపైకి తెస్తున్నారు. ఇప్ప‌టికే మోహ‌న్ రాజాతో 'గాడ్ ఫాద‌ర్' షూటింగ్ పూర్తిచేసారు. త‌మిళ్ డైరెక్ట‌ర్ అయిన మోహ‌న్ రాజాకి 'త‌నివ‌రువ‌న్' స‌క్సెస్ చూసి ఛాన్స్ ఇచ్చారు. ఇక బాబితో 'వాల్తేరు వీర‌య్య' సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాబి గ‌త క‌మ‌ర్శియ‌ల్ స‌క్సెస్ ట్రాక్ చూసి అవ‌కాశం క‌ల్పించారు.

మెహ‌ర్ ర‌మేష్ మేకింగ్ న‌చ్చి 'భోళా శంక‌ర్' కి మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చారు. ఇక బాల‌య్య ఈ విష‌యంలో ఇంకాస్త మెరుగ్గా ఉన్నారు. ప్ర‌స్తుతం త‌న‌ 107వ చిత్రాన్ని గోపీచంద్ మ‌లినేనితో చేస్తున్నారు. ఇది పూర్త‌వ్వ‌గానే 108వ సినిమా అనీల్ రావిపూడితో మొద‌లుపెడ‌తారు. 110 మినహా మిగ‌తా చిత్రాల ప్లానింగ్ అంతా బాల‌య్య యంగ్ మేక‌ర్ల‌తోనే చేస్తున్న‌ట్లు స‌మాచారం.

ఇక సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కూడా రెండు మూడేళ్ల‌గా కొత్త ద‌ర్శ‌కుల‌కే పెద్ద పీట వేస్తున్నారు. కార్తీక్ సుబ్బ‌రాజ్...పారంజిత్..శివ లాంటి ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేసి హిట్లు అందుకున్నారు. ప్ర‌స్తుతం 'ఖైదీ'..'విక్ర‌మ్' తో హిట్ అందుకున్న‌ లోకేష్ క‌న‌గ‌రాజ్ తో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు.

అలాగే విక్ట‌రీ వెంక‌టేష్ అనీల్ రావిపూడి లాంటి యువ ప్ర‌తిభావంతుల్ని వెలికి ప‌ట్టుకుంటున్నారు. కింగ్ నాగార్జున కూడా అదే త‌ర‌హా ప్లానింగ్ తో మందుకు వెళ్తున్నారు. ఒక‌ప్పుడు ఈ సీనియ‌ర్లంతా ద‌ర్శ‌కుల ఎంపిక విష‌యంలో చాలా విష‌యాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకునేవారు. కానీ ఇప్పుడా పాత ట్రెండ్ నివ‌దిలేసి పూర్తిగా న‌యా ట్రెండ్ లోకి వ‌చ్చేసారు.