Begin typing your search above and press return to search.

ఫీచర్: మన హీరోలు మారారు బాస్

By:  Tupaki Desk   |   14 Feb 2017 5:30 PM GMT
ఫీచర్: మన హీరోలు మారారు బాస్
X
తెలుగు సినిమా హీరో అంటే కొన్ని నిర్దిష్టమైన లక్షణాలుంటాయి. హీరో అత్యంత శక్తిమంతుడై ఉంటాడు. అతడికి ఎదురంటూ ఉండదు. హీరోయిన్ అతడంటే పడి చచ్చిపోతుంది. విలన్ అతనంటే వణికిపోతాడు. హీరోకు ఏ చిన్న లోపమూ ఉండదు. దశాబ్దాలుగా మన హీరోల్ని ఇలాగే చూస్తూ వస్తున్నాం. ఐతే ఈ మధ్య ట్రెండు మారుతోంది. కొత్త పుంతలు తొక్కుతున్న తెలుగు సినిమాలో హీరోల పాత్రలు మారుతున్నాయి. వికలాంగులుగా.. అంధులుగా.. వైకల్యం ఉన్న పాత్రలు చేయడానికి మన కథానాయకులు సాహసిస్తున్నారు. ఇప్పటికే మొదలైన మార్పు నెమ్మదిగా ఊపందుకుంటూ.. మున్ముందు మరిన్ని ప్రయోగాత్మక పాత్రలకు స్ఫూర్తినిచ్చేలా ఉంది.

హీరోను అంధుడిగా.. వికలాంగుడిగా.. కురూపిగా చూపించాలంటే తమిళ దర్శకులకే చెల్లు. మన హీరోలు మాత్రం ఆ తరహా పాత్రలంటే భయపడిపోయేవాళ్లు. మామూలు హీరోలు కూడా ఆ తరహా పాత్రకు వెనుకాడేవాళ్లు. ఇక స్టార్ హీరోలైతే చెప్పాల్సిన పని లేదు. ఐతే గత కొన్నేళ్లలో తెలుగు సినిమా తీరు మారింది. మాస్ మసాలా కథలకు కాలం చెల్లి.. వైవిధ్యమైన కథలకు పట్టం పడుతున్నారు. దర్శకులు మారారు.. హీరోలు మారారు.. ప్రేక్షకులూ మారారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పాత్రకైనా హీరోలు రెడీ అనే పరిస్థితి కనిపిస్తోంది. గత ఏడాది అక్కినేని నాగార్జున లాంటి స్టార్ హీరో ‘ఊపిరి’ సినిమాలో ఆద్యంతం కుర్చీకి అతుక్కుపోయే పాత్ర చేశాడు. ప్రేక్షకులు ఆ పాత్రను.. సినిమాను ఆదరించారు. ఈ స్ఫూర్తితో మిగతా హీరోలు.. దర్శకులు కూడా సాహసాలకు సిద్ధమవుతున్నారు.

ఎప్పుడూ మాస్ మసాలా సినిమాలు చేసే రవితేజ.. ఇప్పుడు అంధుడి పాత్రకు సై అనడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అతను కథానాయకుడిగా ‘రాజా ది గ్రేట్’ అనే సినిమా మొదలైంది. ‘వెల్కం టు మై వరల్డ్’ అంటూ అంధుడిగా స్టిక్ పట్టుకుని ఫస్ట్ లుక్ పోస్టర్‌తో షాకిచ్చాడు మాస్ రాజా. ‘పటాస్’ - ‘సుప్రీమ్’ లాంటి మసాలా సినిమాలు చేసిన అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని రూపొందిస్తుండటం విశేషం. హీరో బ్లైండ్ అయినప్పటికీ ఇందులో ఎంటర్టైన్మెంట్‌ కు లోటేమీ ఉండదంటున్నాడు అనిల్. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దీంతో పాటు హీరోను అంధుడిగా చూపిస్తూ మరో సినిమా తెరకెక్కుతోంది. అదే.. అంధగాడు. యువ కథానాయకుడు రాజ్ తరుణ్ లీడ్ రోల్ చేస్తున్న సినిమా ఇది. ఇందులో రాజ్ నిజంగా అంధుడా.. లేక అలా నటిస్తాడా అన్నది సస్పెన్సే. ఐతే పోస్టర్లలో మాత్రం అంధుడిలాగే కనిపిస్తున్నాడతను. రైటర్ టర్న్డ్ డైరెక్టర్ వెలిగొండ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మరోవైపు స్టార్ హీరో రామ్ చరణ్ సైతం.. సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో వైకల్యం ఉన్న పాత్ర చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పీరియడ్ విలేజ్ లవ్ స్టోరీలో చరణ్ వినికిడి సమస్య ఉన్న కుర్రాడిగా కనిపిస్తాడంటున్నారు.

హీరోకు వైకల్యం ఉన్నంత మాత్రాన అదేదో ట్రాజిక్ మూవీ అయిపోతుందనేమీ అనుకోవడానికి లేదు. అది ఒకప్పటి కథ. ఈ మధ్య మలయాళంలో మోహన్ లాల్ హీరోగా ‘ఒప్పం’ అనే సినిమా వచ్చింది. అందులో లాల్ అంధుడి పాత్ర చేశాడు. కానీ ఆ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్. పెద్దగా సెంటిమెంటు ఛాయలు ఉండవు. ఆద్యంతం సినిమా ఆసక్తికరంగా.. ఉత్కంఠ భరితంగా ఉంటుంది. అంధుడైన హీరో ఒక మర్డర్ మిస్టరీని ఛేదించి సైకో విలన్ ఆట కట్టించే తీరును భలేగా తెరకెక్కించాడు ప్రియదర్శన్. ఈ చిత్రం ‘కనుపాప’ పేరుతో తెలుగులోకి కూడా అనువాదమైంది. కథాకథనాల్లో దమ్ముండాలే కానీ.. హీరోకు వైకల్యం ఉన్నా ఎంటర్టైన్ చేయొచ్చనడానికి ఇలాంటి సినిమాలే రుజువు. పైన చెప్పుకున్న ఈ చిత్రాలన్నీ ప్రేక్షకుల్ని మెప్పిస్తే.. మున్ముందు హీరోలందరూ కూడా ఇలా వైకల్యం ఉన్న.. వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ముందుకొస్తారేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/