Begin typing your search above and press return to search.

చైతూ బాలీవుడ్ డెబ్యూ.. హాలీవుడ్ న‌టుడితో ప్రివ్యూ..

By:  Tupaki Desk   |   7 April 2022 5:09 AM GMT
చైతూ బాలీవుడ్ డెబ్యూ.. హాలీవుడ్ న‌టుడితో ప్రివ్యూ..
X
మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఏం చేసినా దానికి ప్ర‌త్యేక‌త ఉంటుంది. కెరీర్ లో అత‌డు ఎంపిక చేసుకున్న క‌థ‌లేవీ ఇన్నేళ్ల‌లో ఫెయిలైన‌వి లేవు అంటే అర్థం చేసుకోవాలి. అప‌జ‌య‌మెరుగ‌ని అగ్ర క‌థానాయ‌కుడిగానూ అమీర్ రికార్డులు బ్రేక్ చేశాడు.

అత‌డు ప్ర‌స్తుతం హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ (1994) రీమేక్ లో న‌టిస్తున్నాడు. లాల్ సింగ్ చద్దా అనేది టైటిల్.. ఇందులో ప్రముఖ నటుడు టామ్ హాంక్స్ ప్రధాన పాత్రలో నటించారు. ఫారెస్ట్ గంప్ చిత్రం ఇప్పటికీ హాలీవుడ్ సినిమాలో క్లాసిక్‌గా మ‌న్న‌న‌లు అందుకుంటోంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కరీనా కపూర్ ఖాన్ కథానాయికగా నటించ‌గా.. టాలీవుడ్ యువ‌హీరో నాగ చైతన్య కీలక పాత్రలో నటించారు. ప్ర‌స్తుతం లాల్ సింగ్ చద్దా నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయి.

తాజా స‌మాచారం మేర‌కు.. అమీర్ టామ్ హాంక్స్ తో క‌లిసి తన సినిమాని అమెరికాలో స్పెషల్ స్క్రీనింగ్‌ని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు ఈ స్క్రీనింగ్ జరగనుందిట‌. టామ్ కోసం అమీర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

తాను తెర‌కెక్కించిన వెర్ష‌న్ గురించి అతని అభిప్రాయాన్ని తెలుసుకోవాలని భావిస్తున్నార‌ట‌. మరికొద్ది నెలల్లో ఈ ఇద్దరు దిగ్గజ నటులు కలవబోతున్నారని భావించాలి.

అమీర్ ఖాన్- కిరణ్ రావ్ సంయుక్తంగా వయాకామ్ 18 స్టూడియోస్ తో క‌లిసి ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రంతోనే నాగ చైతన్య బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నారు. సౌత్ నుంచి ఆర్మీలో ప‌ని చేసే యువ‌కుడిగా అత‌డు న‌టించ‌నున్నాడు. లాల్ సింగ్ చద్దా 11 ఆగస్ట్ 2022న గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఈ మూవీ రిజ‌ల్ట్ కోసం నాగ‌చైత‌న్య ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. అయితే అమెరికా ప్రివ్యూలో టామ్ హ్యాంక్స్ వంటి సీనియ‌ర్ న‌టుడిని నాగ‌చైత‌న్య క‌లుస్తారా లేదా? అత‌డు అమెరికా వెళ్లి ప్రివ్యూ చూస్తాడా? అన్న‌దానికి క్లారిటీ రావాల్సి ఉంది.