Begin typing your search above and press return to search.

'రాధే శ్యామ్' ఫస్ట్ లుక్ పోస్టర్ కాపీ అంటూ ట్రోల్స్...!

By:  Tupaki Desk   |   10 July 2020 4:30 PM GMT
రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కాపీ అంటూ ట్రోల్స్...!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డే హీరో హీరోహీరోయిన్లుగా నటిస్తున్న 'రాధే శ్యామ్' ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ చిత్రానికి 'జిల్‌' ఫేమ్ రాధా కృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్‌ బ్యానర్లు కలిసి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా కోటగిరి వెంకటేశ్వరరావు ఈ సినిమాకి ఎడిటింగ్ చేస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో అభిమానులు అందరూ సంబరాల్లో మునిగిపోయారు.

నిజానికి ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అవడమే కాకుండా మెజారిటీ భాగం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. అయినా ఈ మూవీ నుండి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ఒకింత అసహనానికి గురయ్యారు. దీంతో ట్విట్టర్ వేదికగా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ ను బ్యాన్ చేయాలని నెగిటివ్ ట్రెండ్ కూడా చేశారు. ఎట్టకేలకు 'రాధే శ్యామ్' టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రావడం.. అంచనాలకు తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ ఉండటంతో ఫ్యాన్స్‌ ఖుషీగా ఉన్నారు. అంతేకాకుండా 'రాధే శ్యామ్' ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో కొత్త రికార్డులను క్రియేట్ చేసేలా ట్రెండ్స్ చేసేస్తున్నారు. ఇక 'రాధే శ్యామ్' ఫస్ట్ లుక్ పోస్టర్ కి అన్ని వర్గాల నుండి విశేషమైన స్పందన వస్తోంది.

ఇదిలా ఉండగా 'రాధే శ్యామ్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ పై అదే స్థాయిలో ట్రోల్స్ కూడా చేస్తున్నారు నెటిజన్స్. టాలీవుడ్ లోని ఇతర సినిమా పోస్టర్స్ తో కంపేర్ చేస్తూ కాపీ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో 'రాధే శ్యామ్' ఫస్ట్ లుక్‌ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌ లో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ ని వరుణ్ తేజ్ - ప్రజ్ఞా జైస్వాల్ 'కంచె'.. విక్రమ్ - అమీ జాక్షన్ 'ఐ'... బెల్లకొండ శ్రీనివాస్ - పూజాహెగ్డే 'సాక్ష్యం'.. రణవీర్ సింగ్ - దీపికా పడుకొనే 'రామ్ లీల' సినిమా పోస్టర్లతో పోల్చుతూ వైరల్ చేస్తున్నారు. వాటిలో మరీ ముఖ్యంగా 'కంచె' 'సాక్ష్యం' సినిమా పోస్టర్స్ కి దగ్గరగా 'రాధే శ్యామ్' ఫస్ట్ లుక్ ఉందని మీమ్స్‌ క్రియేట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు.