Begin typing your search above and press return to search.

బన్నీ వాసును వేధిస్తున్న యువతి అరెస్టుతో.. కత్తి మహేష్ ను గుర్తు చేసుకుంటున్న నెటిజన్స్..!

By:  Tupaki Desk   |   14 July 2021 10:51 AM GMT
బన్నీ వాసును వేధిస్తున్న యువతి అరెస్టుతో.. కత్తి మహేష్ ను గుర్తు చేసుకుంటున్న నెటిజన్స్..!
X
సినీ నిర్మాత బన్నీ వాసు తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని జూనియర్ ఆర్టిస్ట్ బోయ సునీత గత మూడేళ్ళుగా ఆరోపణలు చేస్తూ వస్తోంది. దీనిపై అప్పట్లో బన్నీ వాస్ కూడా ఓ వీడియో ద్వారా స్పందిస్తూ.. సునీత తండ్రి తమకు తెలిసిన థియేటర్స్‌ లో పని చేయడంతో.. ఏదైనా కారెక్టర్ ఉంటే ఇవ్వాలని అనుకున్నామని.. కానీ ఆమె ప్రవర్తన సరిగా లేకపోవడం వల్ల సినిమాలో అవకాశం ఇవ్వలేకపోయామని తెలిపారు. అయితే గత నెలలో గీతా ఆర్ట్స్ కార్యాల‌యం వద్ద ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించడం.. ఈ క్రమంలో ఆమెను జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 లో అరెస్ట్ చేయడంతో మరోసారి సునీత బోయ వార్తల్లోకి వచ్చింది. అదే సమయంలో ఇటీవల మరణించిన కత్తి మహేష్ పై మూడేళ్ళ క్రితం సునీత తప్పుడు ఆరోపణలు చేసిన విషయాన్ని కూడా నెటిజన్స్ గుర్తు చేస్తున్నారు.

టాలీవుడ్‌ లో క్యాస్టింగ్ కౌచ్‌ పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సమయంలో సునీత బోయ.. కత్తి మహేష్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సంచలన ఆరోపణలు చేసింది. 'బిగ్ బాస్' షో వివరాల కోసం ఇంటికి రమ్మని పిలిచి.. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె కత్తి మహేష్ పై అభియోగాలు మోపింది. దీంతో అప్పటి వరకు న్యూస్ ఛానల్స్ డిబేట్స్ లో క్యాస్టింగ్ కౌచ్ పై మీటూ ఉద్యమాలపై మాట్లాడుతూ వచ్చిన కత్తి మహేష్ ను ఒక్కసారిగా అందరూ టార్గెట్ చేశారు. మీడియా ఛానల్స్ కూడా సునీత ఆరోపణలపై చర్చలు పెట్టాయి. మహేష్ అప్పటికే 'బిగ్ బాస్' షో ద్వారా పాపులర్ అవడమే కాకుండా.. పవన్ కళ్యాణ్ మీద నెగెటివ్ కామెంట్స్ చేయడంతో నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తిగా ఉన్నారు.

ఇక మహేష్ కత్తి తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై స్పందిస్తూ.. సునీత ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని.. అందుకే ఆమె మీద 50 లక్షల పరువు నష్టం దావా వేస్తున్నానని తెలిపాడు. అంతేకాదు ఇండస్ట్రీలోని ప్రముఖులపై పెద్ద ఎత్తున లైంగిక ఆరోపణలు వస్తున్నాయి కనుక.. దాన్ని పక్కదారి పట్టించడానికి తనపై సునీతతో కొందరు ఆరోపణలు చేయిస్తున్నారనే అనుమానాలను కత్తి మహేష్ వ్యక్తం చేశారు. ఇప్పుడు సునీత ను గీతా ఆర్ట్స్ ఆఫీస్ వద్ద అరెస్ట్ చేయడంతో మరోసారి కత్తి మహేష్ పై చేసిన నిరాధార లైంగిక ఆరోపణలను నెటిజన్స్ గుర్తు చేస్తున్నారు. అప్పుడే ఆమెపై చర్యలు తీసుకుని వుంటే.. ఇప్పుడు ప్రముఖ నిర్మాతల వరకూ వచ్చేది కాదని అంటున్నారు.