Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : నేను స్టూడెంట్ సర్

By:  Tupaki Desk   |   2 Jun 2023 1:59 PM GMT
మూవీ రివ్యూ : నేను స్టూడెంట్ సర్
X
'నేను స్టూడెంట్ సర్' మూవీ రివ్యూ

నటీనటులు: గణేష్ బెల్లంకొండ-అవంతిక దాసాని-సముద్రఖని-సునీల్-శ్రీకాంత్ అయ్యంగార్-ఆటో రాంప్రసాద్-చరణ్ దీప్ తదితరులు

సంగీతం: మహతి స్వర సాగర్

ఛాయాగ్రహణం: అనిత్ మదాడి

కథ: కృష్ణ చైతన్య

మాటలు: కళ్యాణ చక్రవర్తి

నిర్మాత: నాంది సతీశ్ వర్మ

స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాఖీ ఉప్పలపాటి


'స్వాతిముత్యం' అనే మంచి సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యాడు యువ కథానాయకుడు గణేష్ బెల్లంకొండ. అతను హీరోగా నటించిన రెండో సినిమా.. నేను స్టూడెంట్ సర్. 'నాంది' నిర్మాత సతీశ్ వర్మ ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రంతో రాఖీ ఉప్పలపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమాగా 'నేను స్టూడెంట్ సర్' ఏమేర ఆకట్టుకుందో చూద్దాం పదండి.


కథ:

సుబ్బారావు అలియాస్ సుబ్బు (బెల్లంకొండ గణేష్) ఒక మామూలు మధ్య తరగతి కుర్రాడు. అతడికి ఐఫోన్ అంటే పిచ్చి. ప్రతి రోజూ మొబైల్ స్టోరుకి వెళ్లి తనకు నచ్చిన ఐఫోన్ మోడల్ చూసి.. ఎలాగైనా అది కొనాలని తాపత్రయ పడుతుంటాడు. కానీ అంత డబ్బు తన దగ్గరుండదు. అలా అని తల్లిదండ్రులను ఒత్తిడి చేయడు. ఓవైపు చదువుకుంటూనే చిన్న చిన్న పనులు చేసి డబ్బులు కూడబెడతాడు. సంవత్సరం పాటు కష్టపడ్డాక ఐఫోన్ కొనడానికి సరిపడా డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో వెళ్లి ఐఫోన్ కొంటాడు. దానికి బుచ్చిబాబు అని పేరు కూడా పెట్టుకుంటాడు. సుబ్బు ఎంతో అపురూపంగా చూసుకుంటున్న ఫోన్ ఒక గొడవ వల్ల పోలీసుల చేతికి చేరుతుంది. స్టేషన్లోనే అది మిస్సవుతుంది. తన ఫోన్ కోసం ఏకంగా కమిషనర్ (సముద్రఖని) వరకు వెళ్లిపోతాడు సుబ్బు. ఆయన తన ఫోన్ బదులు వేరేది ఇస్తానని చెప్పినా సుబ్బు ఒప్పుకోడు. తన ఫోన్ కోసం సుబ్బు వేట కొనసాగుతుండగానే అతను ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. మరి ఆ కేసు వ్యవహారం ఏంటి.. ఇంతకీ సుబ్బు ఫోన్ తన చేతికి చిక్కిందా లేదా అన్నది మిగతా కథ.

సామాన్య జనం దృష్టిలో పడని నిగూఢమైన విషయాలు.. నేరాల నేపథ్యంలో పకడ్బందీ థ్రిల్లర్లు తీయడంలో తమిళ దర్శకుల నైపుణ్యమే వేరు. తెలుగులో 'అర్జున్ సురవరం'గా రీమేక్ అయిన 'కనిదన్'లో ఫేక్ సర్టిఫికెట్ స్కామ్.. 'భద్రమ్' పేరుతో అనువాదమైన 'తెగిడి'లో బీమా కుంభకోణం.. 'అభిమన్యుడు' పేరుతో డబ్ అయిన 'ఇరుంబు తిరై'లో సైబర్ క్రైమ్ చుట్టూ అల్లుకున్న కథాకథనాలు కట్టి పడేస్తాయి. ఇలాంటి నేరాల గురించి పత్రికల్లో వచ్చే వార్తలు చూసే రచయితలు.. దర్శకులు స్ఫూర్తి పొందుతుంటారు. వీటి గురించి లోతుగా పరిశీలించి ఆసక్తికరంగా కథాకథనాలు తీర్చిదిద్దుకుంటే.. ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపొచ్చు. 'నేను స్టూడెంట్ సర్'లో అన్ క్లైమ్డ్ అకౌంట్స్ చుట్టూ క్రైమ్ కథను అల్లాలన్న రచయిత కృష్ణ చైతన్య ఐడియా బాగానే ఉంది. కానీ ఐడియా బాగుంటే సరిపోదు. దాని చుట్టూ అల్లిన కథ బాగుండాలి. అలాగే కథనం ఉత్కంఠ రేకెత్తించాలి. ఇక్కడే 'నేను స్టూడెంట్ సర్' గాడి తప్పేసింది. మంచి ఐడియానే అయినా అందుకు తగినట్టుగా ఎగ్జిక్యూషన్ లేకపోవడం వల్ల సినిమా ట్రాక్ తప్పేసింది. ఈ సినిమాను ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ లాగా డీల్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు.

'నేను స్టూడెంట్ సర్' మొదలవడం ఒక ఆసక్తికరంగా మొదలవగా.. ముగించడం మాత్రం నిరుత్సాహపరచేలా ఉంటుంది. ఎంతో ముచ్చటపడి.. కష్టపడి హీరో ఐఫోన్ కొనుక్కుంటే.. ఒక్క రోజులోనే అది అతడికి దూరమవుతుంది. తన ఫోన్ దక్కించుకోవడానికి హీరో చేసే పోరాటం నేపథ్యంలోనే సగం సినిమా వరకు కథ నడుస్తుంది. ఐతే ఈ పాయింట్ చుట్టూ నడిపిన డ్రామా ఆసక్తిగా నడిపించడంలో దర్శకుడు గాడి తప్పాడు. తాను కొన్న మొబైల్ కు బుచ్చిబాబు అని పేరు పెట్టుకోవడం.. ఆ మొబైల్ ను తన తమ్ముడిగా హీరో అభివర్ణించడం.. ''నా బుచ్చిబాబు కమిషనర్ దగ్గర ఉన్నాడు. ఎలా ఉన్నాడో ఏమో''.. ''నా బుచ్చిబాబును ఎలా అయినా కాపాడుకోవాలి'.. ''పోతే పోనీ అని వదిలేయడానికి అది జస్ట్ ఫోన్ కాదు రా.. నా తమ్ముడు'' లాంటి డైలాగులు చెప్పడం కొద్దిగా అతి అనిపిస్తుంది. ఒకట్రెండేళ్లు వాడిన ఫోన్ అయితే.. అందులో పర్సనల్ డేటా ఉంటే.. హీరో ఎమోషనల్ గా కనెక్ట్ కావడంలో.. మొబైల్ కోసం తపన పడటంలో ఒక అర్థం ఉందనుకోవచ్చు. కానీ కొన్న రోజే పోయిన ఫోన్ గురించి హీరో ఇంత ఎమోషనల్ కావడం.. తమ్ముడు తమ్ముడు అంటూ కలవరించడం.. ఆ ఫోన్ బదులు వేరేది ఇస్తానన్నా కూడా నా మొబైలే కావాలి అంటూ మారాం చేయడం కొంచెం విడ్డూరంగానే అనిపిస్తుంది.

తాను పోగొట్టుకున్న మొబైల్ కోసం హీరో ఏకంగా కమిషనర్ దగ్గరికి వెళ్లిపోవడం.. ఆయన అర్థం చేసుకోకుంటే ఆయన కూతురితో పరిచయం చేసుకుని తనకు దగ్గరవడం.. ఈ క్రమంలో వచ్చే లవ్ ట్రాక్ ఇలా సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. సినిమా మొదలైన తీరు చూసి ఇదేదో కాన్సెప్ట్ బేస్డ్ మూవీలా ఉందనుకుంటే.. హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ దగ్గరికి వచ్చేసరికి ఒక సగటు కమర్షియల్ సినిమాను తలపిస్తుంది. మినిమం ఇంట్రస్ట్ కలిగించని ప్రేమ సన్నివేశాల తర్వాత ఇంటర్వెల్ తో కథలో కొంచెం కదలిక వస్తుంది. హీరో మర్డర్ కేసులో ఇరుక్కోవడం ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇదే ద్వితియార్ధం మీద ఆస్క్తికలిగేలా చేస్తుంది. కానీ ఆ తర్వాత మర్డర్ చుట్టూ నడిపిన కథనం కూడా సాధారణంగానే అనిపిస్తుంది. థ్రిల్లర్ టర్న్ తీసుకున్న సినిమాలో ఉత్కంఠ రేపే సన్నివేశాలు లేకపోవడం మైనస్ అని చెప్పొచ్చు.హీరో చుట్టూ జరిగిన కుట్ర ఏంటి.. అసలేం జరిగింది.. విలన్ ఎవరు.. అనే విషయాలు తెలుసుకోవడానికి మొక్కుబడిగా ఎదురు చూస్తాం తప్ప ఉత్కంఠ అన్నదే లేకపోయింది. హీరో విలన్లకు చెక్ పెడుతూ రివర్స్ గేర్లో వెళ్లే సీన్లు.. సినిమా మొత్తంలో కాస్త పర్వాలేదనిపిస్తాయి. అసలు విలన్లెవరో తెలిసే పతాక సన్నివేశాలను సాదాసీదాగా లాగించేశారు. విలన్ పాత్రల కోసం ఎంచుకున్న నటీనటులను చూస్తే కామెడీగా అనిపిస్తుంది తప్ప.. ఆ ఇంటెన్సిటీని ఫీలవ్వలేం. మొత్తంగా చూస్తే 'నేను స్టూడెంట్ సర్' ప్లాట్ పాయింట్ బాగున్నా.. ఎగ్జిక్యూషన్ సరిగా లేకపోవడం వల్ల ఆశించిన ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.


నటీనటులు :

బెల్లంకొండ గణేష్ మొదటి సినిమా స్వాతిముత్యం కన్నా ఈ సినిమాలో కొంత పరిణితిచెందాడని చెప్పవచ్చు . రెండో సినిమానే చాలా టఫ్ సబ్జెక్ట్ ఎంచుకున్న గణేష్ తన శక్తిమేరకు ప్రయత్నించాడు. పక్క ఇంటి స్టూడెంట్ కుర్రాడు లా బాగానే చేసాడు. హీరోయిన్ అవంతిక గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఆమె తెల్లగా ఉందే తప్ప అందంగా అనిపించదు. నటన కూడా పేలవం. సముద్రఖని ప్రతిభను సినిమాలో ఏమాత్రం ఉపయోగించుకోలేదు. పేరుకు కమిషనర్ అంటూ పెద్ద పాత్ర ఇచ్చారే తప్ప.. ఆ పాత్రలో ఏ ప్రత్యేకతా లేదు. సునీల్ క్యామియో తరహా పాత్ర చేశాడు. అతను ఓకే అనిపించాడు. శ్రీకాంత్ అయ్యంగార్ బాగానే చేశాడు. మిగతా నటీనటులంతా మామూలే.


సాంకేతిక వర్గం :

'నేను స్టూడెంట్ సర్' సాంకేతికంగా సోసోగా అనిపిస్తుంది. మహతి స్వర సాగర్ గుర్తుంచుకోదగ్గ పాటలు ఇవ్వలేదు. సినిమాలో పాటలకు ప్రాధాన్యం తక్కువే. ఉన్న రెండు పాటలు కూడా మామూలుగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం ఏదో అలా సాగిపోయింది. అనిత్ మదాడి ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువలు బడ్జెట్ పరిమితులు కనిపిస్తాయి. కీలక పాత్రలకు సరైన నటులను ఎంచుకోలేదు. అన్ క్లైమ్డ్ అకౌంట్స్ క్రైమ్ చుట్టూ కథ అల్లాలన్న రైటర్ కృష్ణ చైతన్య ఐడియా ఓకే. దర్శకుడు కథ చెప్పే విధానంలో తడబడ్డాడు. ఇక ఈ సినిమాను 45 రోజుల్లో 3 కోట్ల బడ్జెట్ తో దర్శకుడు పూర్తి చేశారు. ఇలా చేయడం వల్ల నిర్మాతకు అనవసర ఖర్చు లేకుండా ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు రాఖీ ఉప్పలపాటి మెచ్చుకోవచ్చు. అయితే ఒక థ్రిల్లర్ కథను పకడ్బందీగా డీల్ చేసే నైపుణ్యాన్ని అతను చూపించలేకపోయాడు.

చివరగా: నేను స్టూడెంట్ సర్.. ఐడియా బాగుంది కానీ!

రేటింగ్-2.5/5


Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater