Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: కొంచెం కొత్త రకం లాగే ఉంది

By:  Tupaki Desk   |   18 April 2016 5:30 AM GMT
టీజర్ టాక్: కొంచెం కొత్త రకం లాగే ఉంది
X
పుష్కర కాలం నుంచి హిట్టు కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడుతున్నాడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్. కానీ అతడి ఖాతాలో ఇంకా సరైన హిట్టు పడలేదు. గత ఏడాది ‘రోమియో’ విషయంలో చాలా హంగామా చేశాడు కానీ.. అది అతడి కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడిక ‘నేనోరకం’ అంటూ ఓ భిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా టీజర్ కూడా రిలీజైంది.

అనగనగా ఓ కుర్రాడు.. అమ్మాయి అంటే కొంచెం కొంచెం అందంగా ఉండటం కాదు.. అణువణువునా అందం ఉండాలి అనే ఆ కుర్రాడికి అలాంటి అందాల రాశే ఎదురుపడుతుంది. ఆమె ప్రేమలో పడిపోతాడు. కానీ ఆమె ప్రేమతో తన జీవితం అందమైన మలుపు తిరుగుతుందేమో అనుకుంటే.. అదోరకమైన మలుపు తిరుగుతుంది. ఆ అమ్మాయి కారణంగా పెద్ద ఇబ్బందుల్లో పడతాడా కుర్రాడు. ఓ మిస్టరీ మ్యాన్ అతణ్ని తగులుకుంటాడు. చివరికి.. ‘‘నీ వల్ల నా జీవితం సంక నాకి పోయింది’’ అనే వరకు వస్తుంది పరిస్థితి. ఇంతకీ ఆ అమ్మాయి వల్ల ఇతనే ఇబ్బందులెదుర్కున్నాడు.. ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు.. మన హీరో గారు చివరికి ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు.. అన్నది తెరమీదే చూడాలన్నమాట.

సుదర్శన్ సాలేంద్ర అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రానికి దీపా శ్రీకాంత్ నిర్మాత. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ బాబీ సింహాను పెళ్లి చేసుకోబోతున్న రేష్మి మీనన్ ఇందులో కథానాయికగా నటించింది. ఆమెకిదే తొలి తెలుగు సినిమా. శరత్ కుమార్ ఓ కీలక పాత్ర పోషించాడు. చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ సంగీతాన్నందించాడు. మేలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.