Begin typing your search above and press return to search.

ఆ సినిమాకు హీరోయిన్లిద్దరూ పెద్ద మైనస్

By:  Tupaki Desk   |   6 Aug 2016 9:13 AM GMT
ఆ సినిమాకు హీరోయిన్లిద్దరూ పెద్ద మైనస్
X
‘రేయ్’ సినిమాను పక్కనబెట్టేస్తే.. సాయిధరమ్ తేజ్ నటించిన మిగతా మూడు సినిమాలు పిల్లా నువ్వు లేని జీవితం.. సుబ్రమణ్యం ఫర్ సేల్.. సుప్రీమ్ హిట్లే. అందులోనూ తేజు లాస్ట్ మూవీ ‘సుప్రీమ్’ రూ.25 కోట్లకు పైగా వసూలు చేసి సూపర్ హిట్ రేంజికి వెళ్లింది. ఐతే ఒక హీరో ఓ సూపర్ హిట్ కొట్టాక అతడి తర్వాతి సినిమాకు మంచి హైప్ వస్తుంది. కానీ సుప్రీమ్ తర్వాత సాయిధరమ్ చేసిన ‘తిక్క’ మీద మాత్రం అంత హైప్ రావట్లేదు. ‘ఓం 3డీ’ లాంటి డిజాస్టర్ తీసిన సునీల్ రెడ్డి ఈ సినిమాను రూపొందించడం ఓ కారణమైతే.. టీజర్-ట్రైలర్ మరీ ఎగ్జైటింగ్ గా ఏమీ అనిపించకపోవడం మరో కారణం. ఈ సినిమా విషయంలో ఇంకో పెద్ద మైనస్ కూడా ఉంది. అదే హీరోయిన్లు అట్రాక్టివ్ గా లేకపోవడం.

లారిసా అనే ఫారిన్ అమ్మాయితో పాటు అటు హిందీలో.. ఇటు తెలుగులో ఫ్లాప్ హీరోయిన్ గా ముద్ర పడ్డ మన్నారా చోప్రా ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు. లారిసా ఎంతమాత్రం ఫెమిలియర్ గా అనిపించట్లేదు. పక్కా లోకల్ అనిపించే సాయిధరమ్ పక్కన ఆమె సరైన జోడీ కాదేమో అన్న ఫీలింగ్ కలుగుతోంది. ఇక మన్నారాలో హీరోయిన్ ఫీచర్స్ ఏమాత్రం ఉంటాయో మొన్న ‘జక్కన్న’ సినిమాలోనే చూశాం. సాయిధరమ్ హిట్ సినిమాలు మూడింటికీ హీరోయిన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రెజీనా.. రాశి ఖన్నా ప్రేక్షకుల్ని బాగా ఆకర్షించారు. సినిమాల్లోనూ బాగా కనిపించారు. ‘తిక్క’ విషయంలో మాత్రం హీరోయిన్లు ఏమాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించట్లేదు. ఐతే సినిమా బాగుంటే ఇవన్నీ పక్కకు వెళ్లిపోతాయనుకోండి. మరి సినిమాలో ఎంత విషయం ఉందో ఇంకో వారం రోజుల్లో తేలిపోతుందిలెండి.