Begin typing your search above and press return to search.

సినిమా మొదలేకాలేదు..సెన్సార్ బోర్డు హెచ్చరిక

By:  Tupaki Desk   |   8 Jun 2017 1:16 PM GMT
సినిమా మొదలేకాలేదు..సెన్సార్ బోర్డు హెచ్చరిక
X
సినిమా పూర్తయి సెన్సార్ కోసం వెళ్లినపుడు అక్కడ అభ్యంతరాలు వ్యక్తం కావడం.. కోతలు పెట్టడం.. మార్పులు సూచించడం.. మామూలే. కానీ ఒక సినిమా షూటింగ్ కూడా మొదలవడానికి ముందే.. కేవలం దాని ఫస్ట్ లుక్ చూడగానే సెన్సార్ బోర్డు స్పందించడం.. ఆ చిత్ర యూనిట్ ను హెచ్చరించడం అన్నది ఇప్పటిదాకా ఇండియాలో జరిగి ఉండదు. అనుపమ్ ఖేర్ రెండు రోజుల కిందట అనౌన్స్ చేసిన ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమా విషయంలో ఈ చిత్రమే చోటు చేసుకుంది. ఈ సినిమా విషయమై కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రహ్లాద్ నిహ్లాని హెచ్చరికలు జారీ చేశాడు. ఈ సినిమా తీసేముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీల అనుమతి తీసుకోవాలని.. వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే సినిమా పూర్తి చేయాలని ఆయన అన్నారు.

‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఉద్దేశించి తీస్తున్న సినిమా. భాజపాకు గట్టి మద్దతుదారైన అనుపమ్ ఖేర్ కు కాంగ్రెస్ పార్టీ అంటే పడదు. ఆయన అనేక సందర్భాల్లో కాంగ్రెస్ రాజకీయాల్ని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ.. సోనియా గాంధీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మన్మోహన్ ను ప్రధానిగా చేసి.. తెర వెనుక రాజకీయం నడిపిన సోనియా గాంధీ మీద సెటైర్లు వేయడానికి.. మొత్తంగా కాంగ్రెస్ రాజకీయాల తీరును ఎండగట్టడానికే ఆయన ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమా చేస్తున్నాడన్న అభిప్రాయాలున్నాయి. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుండటమే కాదు.. తనే ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నాడు అనుపమ్ ఖేర్. ఈ చిత్రం కచ్చితంగా వివాదాస్పదం అవుతుందన్న అంచనాల నేపథ్యంలో సెన్సార్ బోర్డు ఛైర్మన్ ముందుగానే హెచ్చరికలు జారీ చేశాడు. ఐతే తమ మీద అనుపమ్ ఖేర్ సెటైరిక్ మూవీ తీస్తున్నాడంటే సోనియా గాంధీ.. మన్మోహన్ సింగ్ ఎలా ఒప్పుకుంటారు? అంత చిన్న లాజిక్ ప్రహ్లాద్ ఎలా మిస్సయ్యాడో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/