Begin typing your search above and press return to search.

#NBK107 టైటిల్ పోస్టర్: 'వీర సింహారెడ్డి' గా బాలయ్య..!

By:  Tupaki Desk   |   21 Oct 2022 3:14 PM GMT
#NBK107 టైటిల్ పోస్టర్: వీర సింహారెడ్డి గా బాలయ్య..!
X
నటసింహ నందమూరి బాలకృష్ణ మరియు క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషనల్ లో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. #NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ ను తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బాలయ్య చిత్రానికి ''వీరసింహారెడ్డి'' అనే ఇంటెన్స్ అండ్ పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేసారు.

శుక్రవారం సాయంత్రం కర్నూలులోని ఐకానిక్ కొండారెడ్డి బురుజు దగ్గర 'వీర సింహారెడ్డి' 3డీ టైటిల్ పోస్టర్ ను మేకర్స్ లాంచ్ చేసారు. ఈ వేడుకకు దర్శకుడు గోపీచంద్ మలినేని మరియు డైలాగ్ రైటర్ బుర్రా సాయి మాధవ్ తో పాటుగా నిర్మాతలు హాజరయ్యారు. గ్రాండ్ జరిగిన ఈ కార్యక్రమంలో బురుజు మీద బాలయ్య 107వ సినిమా టైటిల్ తో పాటుగా టీజర్ ను ప్రదర్శించారు.

కొండారెడ్డి బురుజు వద్ద ఒక సినిమా టైటిల్ ను ఆవిష్కరించడం అనేది తెలుగు చిత్ర పరిశ్రమలో తొలిసారి అని తెలుస్తోంది. నిజానికి ఈ చిత్రానికి 'జై బాలయ్య' 'రెడ్డి గారు' 'అన్నగారు' 'వీర సింహా రెడ్డి' టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే చివరకు దర్శక హీరోలు 'వీరసింహారెడ్డి' అనే టైటిల్ కే మొగ్గు చూపారు.

'వీరసింహారెడ్డి' టైటిల్ ఫాంట్ ఆకట్టుకునేలా ఉంది. దీనికి 'గాడ్ ఆఫ్ మాసెస్' అనే ట్యాగ్ లైన్ ని పెట్టడంతో పాటుగా పక్కన పంచెకట్టుతో రాజసంగా నడిచొస్తున్న బాలకృష్ణ ఫోటోని కూడా ఉంచారు. ఇక చాలా కాలంగా నటసింహానికి సెంటిమెంట్ గా వస్తున్న 'గర్జించే సింహం' ను టైటిల్ లోగోలో మనం చూడొచ్చు.

గతంలో బాలయ్య నటించిన 'నరసింహా నాయుడు' సమర సింహా రెడ్డి' 'సింహా' వంటి మెజారిటీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ అందుకున్నాయి. అదే తరహాలో ఇప్పుడు ''వీర సింహారెడ్డి'' టైటిల్ డిజైన్ చేయబడింది. ఈ టైటిల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ కి సరైనదిగా పేర్కొనవచ్చు.

టైటిల్ లాగే, పోస్టర్ కూడా చాలా ప్రభావం చూపుతుంది. బాలకృష్ణ ను భయంకరమైన మాస్ అవతార్‌ లో ప్రెజెంట్ చేసింది. ఇందులో పులిచెర్ల 4 కిలోమీటర్ల మైలురాయిపై బాలయ్య కాలు పెట్టి స్టైల్ గా నిలబడి ఉన్నాడు. పక్కనే ఉన్న ఆయుధాన్ని చూస్తుంటే పెద్ద వేటకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్‌ తో పాటు ఫస్ట్‌ హంట్‌ కి అనూహ్య స్పందన వచ్చింది. ఇప్పుడు 'వీర సింహారెడ్డి' టైటిల్ పోస్టర్ ఖచ్చితంగా సినిమా చుట్టూ బజ్ పెంచుతుందనడంలో సందేహం లేదు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని - వై రవిశంకర్‌ లు భారీ ఎత్తున రూపొందుతున్న ఈ చిత్రానికి చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో బాలయ్య సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్‌ విలన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కీలక పాత్ర పోషిస్తోంది. లాల్ - నవీన్ చంద్ర ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. చంద్రిక రవి స్పెషల్ సాంగ్ లో ఆడిపాడనుంది.

బాలకృష్ణ మరియు గోపీచంద్ మలినేని ఇద్దరికీ వారి చివరి చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందించిన మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ 'వీరసింహా రెడ్డి' సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు అందించారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌ గా వర్క్ చేస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్‌ చేస్తున్నారు. రామ్‌-లక్ష్మణ్‌ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేసారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.