Begin typing your search above and press return to search.

సినిమా రివ్యూ : లయన్‌

By:  Tupaki Desk   |   14 May 2015 8:05 AM GMT
సినిమా రివ్యూ :  లయన్‌
X
రివ్యూ: లయన్‌

రేటింగ్‌: 2.5 /5

తారాగణం: బాలకృష్ణ, త్రిష, రాధికా ఆప్టే, ప్రకాష్‌ రాజ్‌, ఆలీ, ఎమ్మెస్‌ నారాయణ, గీత, జయసుధ, చలపతిరావు, చంద్రమోహన్‌, ప్రదీప్‌ రావత్‌, విజయ్‌కుమార్‌ తదితరులు

సంగీతం: మణిశర్మ

ఛాయాగ్రహణం: వెంకట్‌ ప్రసాద్‌

నిర్మాత : రుద్రపాటి రమణరావు

కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సత్యదేవా



గత రెండు దశాబ్దాల్లో నందమూరి బాలకృష్ణకు కొత్త దర్శకులతో చేదు అనుభవాలే మిగిలాయి. అయినప్పటికీ 'లెజెండ్‌' లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత ఎంతో నమ్మకంగా ఓ కొత్త దర్శకుడికి ఛాన్స్‌ ఇచ్చాడు బాలయ్య. ఆ సినిమానే 'లయన్‌'. మరి బాలయ్య నమ్మకాన్ని కొత్త దర్శకుడు సత్యదేవా నిలబెట్టాడో లేదో చూద్దాం పదండి.

కథ:

మార్చురీలో ఉండగా స్పృహలోకి వచ్చిన వ్యక్తి (బాలకృష్ణ)కి తన పేరు గాడ్సే అని తెలుస్తుంది. ఓ ప్రమాదంలో తన తలకు బలమైన గాయమైందని.. మూడు నెలలుగా కోమాలో ఉన్నట్లు చెబుతారు డాక్టర్లు. అతడి తల్లిదండ్రులు వచ్చి పలకరిస్తే వాళ్లెవరని ప్రశ్నిస్తాడు గాడ్సే. తన పేరే అసలది కాదని.. తన తల్లిదండ్రులు వేరేవాళ్లని అంటాడు గాడ్సే. ఆసుపత్రి నుంచి తప్పించుకుని తన ఇల్లనుకుని వెళ్తే అక్కడా అతడికి విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. ఐతే ఓ సంఘటన తర్వాత అతడి అసలు తల్లిదండ్రులు తనని గుర్తిస్తారు. తన పేరు బోస్‌ అని తెలుస్తుంది. ఇంతకీ బోస్‌ గతమేంటి? అందరూ అతణ్ని గాడ్సే అని ఎందుకు పిలుస్తారు? అతణ్ని అబద్ధపు ప్రపంచంలో ఎందుకు బతకనిస్తారు?.. అన్నది మిగతా కథ.

కథనం, విశ్లేషణ:

లయన్‌ గురించి మాట్లాడుతూ తెలుగు తెరపై ఇంతకుముందెప్పుడూ ఇలాంటి కథే రాలేదన్నట్లు చెప్పాడు కొత్త దర్శకుడు సత్యదేవా. ఇలా అన్నపుడు ఆ కథ ప్రేక్షకుల ఊహకు అందనట్లుగా ఉండాలి. తనకు దర్శకుడిగా అవకాశం ఇవ్వడానికి చాలామంది సందేహిస్తే బాలయ్య మాత్రం అవకాశం ఇచ్చాడని కూడా చెప్పాడు సత్యదేవా. ఇలా అన్నపుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఔట్‌పుట్‌ ఇవ్వాలి. కానీ 'లయన్‌' అంచనాలకందని అద్భుతమైన కథేమీ కాదు. సత్యదేవా దాన్ని అంత ఆసక్తికరంగానూ మలచలేదు.

ముఖ్యమంత్రికి గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో చేరతాడు. ఆయనతో పాటు ఎవ్వరూ ఉండరు. టీవీ పెడితే ఆయన అమ్మాయిలతో సరసాలాడుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఆయనకు మళ్లీ గుండెపోటు వస్తుంది. ప్రాణాలు పోతాయి. ఇది ప్రి ప్లాన్డ్‌ మర్డర్‌ అన్నమాట. వింటుంటే ఆసక్తికరంగానే అనిపిస్తోంది కదా. ఇలా వినడానికి ఆసక్తికరంగా అనిపించే అంశాలు 'లయన్‌'లో చాలా ఉన్నాయి. కానీ తెరమీద వాటిని చూపించిన విధానమే పేలవంగా ఉంది.

హీరో ఐడెంటిటీని మార్చేసి.. అతణ్ని అయోమయంలోకి నెట్టేసే సన్నివేశాలతో నడిపించిన ప్రథమార్ధం సినిమాకు పెద్ద మైనస్‌. సినిమా గ్రాఫ్‌ మళ్లీ పైకి లేవడానికి అవకాశమే లేనంత పేలవంగా ఫస్టాఫ్‌ను నడిపించాడు దర్శకుడు సత్యదేవా. బాలయ్య, త్రిషల మధ్య వచ్చే రొమాంటిక్‌ ట్రాక్‌ చూస్తే బాలయ్య ఇలాంటి సన్నివేశాలకు ఎలా ఒప్పుకున్నాడా అన్న సందేహం కలగక మానదు. హీరోను అందరూ కలిసి మాయలో ఉంచుతున్నారన్న విషయం తొలి సన్నివేశంలోనే ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. ఇక ట్విస్ట్‌ అనుకోవడానికి ఏముంటుంది? ఎప్పుడు ఫ్లాష్‌ బ్యాక్‌ మొదలవుతుందా అని ఎదురు చూడ్డం తప్ప ప్రేక్షకుడు ఆసక్తిగా చూసే సన్నివేశాలేమీ లేవు ప్రథమార్ధంలో.

ద్వితీయార్ధం కూడా గొప్పగా ఏమీ లేదు కానీ.. ప్రథమార్ధపు హింసతో పోలిస్తే చాలా బెటర్‌ అనిపిస్తుంది. గొప్పగా అనిపించే సన్నివేశాలేమీ లేకున్నా.. కథనం ఆగకుండా స్పీడుగా సాగిపోవడం.. మాస్‌ను అలరించే బాలయ్య ఫ్లాష్‌బ్యాక్‌ క్యారెక్టరైజేషన్‌ సెకండాఫ్‌కు కాస్త ఆకర్షణగా నిలిచాయి. గాలి జనార్దనరెడ్డి రెఫరెన్స్‌తో తీర్చిదిద్దిన ప్రదీప్‌ రావత్‌ క్యారెక్టర్‌.. ఆ ఎపిసోడ్‌ సినిమాకు ఏమాత్రం అవసరం లేదు. అయినా సీబీఐ ఆఫీసర్‌ వెళ్లి ఇన్‌కం ట్యాక్స్‌ రైడ్స్‌ చేయడమమేంటో అర్థం కాదు. ఇక విలన్‌ను ఇరికించడానికి హీరో వేసే ఎత్తుగడ బాగానే ఉంది కానీ.. దాన్ని ప్రేక్షకులు థ్రిల్‌ ఫీలయ్యేలా చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు.

ప్రథమార్ధంలో కథనాన్ని మరీ నెమ్మదిగా నడిపించిన దర్శకుడు.. చివరి అరగంటలో మాత్రం అవసరమైందానికంటే వేగం చూపించాడు. దీని వల్ల ప్రేక్షకులు కొంచెం గందరగోళంలో పడతారు. టైటిల్‌ సాంగ్‌ ప్లేస్‌మెంట్‌ ఏమాత్రం బాలేదు. అది బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. రాధికా ఆప్టేకు ఏదో డ్రామా ఆర్టిస్టు టైపు క్యారెక్టర్‌ ఇచ్చి.. ఆమెకు రెండు పాటలు పెట్టడం టూమచ్‌. అందులోనూ ప్రథమార్ధంలో వచ్చే పెళ్లి పాట ఎందుకో ఏంటో అర్థం కాదు. దర్శకుడు ఎంచుకున్న కథలోనే లోపాలున్నాయి. దీనికి తోడు స్క్రీన్‌ప్లే కూడా పేలవంగా ఉండటంతో లయన్‌ మెజారిటీ ఆడియన్స్‌కు ఎక్కే అవకాశాల్లేవు.

నటీనటులు:

లయన్‌ బాలయ్య వన్‌మ్యాన్‌ షో అని చెప్పాలి. ఫ్లాష్‌ బ్యాక్‌లో.. ప్రి క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సన్నివేశాల్లో బాలయ్య చెలరేగిపోయాడు. తన ఫ్యాన్స్‌ను ను మెస్మరైజ్‌ చేశాడు. ఐతే ప్రథమార్ధంలో గడ్డం క్యారెక్టర్లో బాలయ్య నిరాశ పరిచాడు. ఆ పాత్రకు మేకప్‌ కుదర్లేదు. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌ కూడా ఇబ్బందికరంగా ఉంది. లుక్‌ విషయంలో బాలయ్య కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాల్సింది. రొమాంటిక్‌ సీన్స్‌లో కూడా బాలయ్య ఇబ్బంది పడ్డాడు. ఐతే ఫైట్లు, డ్యాన్సుల్లో, డైలాగులు చెప్పడంలో బాలయ్యలో ఇంకా హుషారు తగ్గలేదు. బాలయ్య మినహా సినిమాలో ఎవరికీ సరైన క్యారెక్టర్‌ పడలేదు. విలన్‌గా ప్రకాష్‌ రాజ్‌ క్యారెక్టర్‌ను పేలవంగా తీర్చిదిద్దారు. ఆయన ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం ఎక్కడా కనిపించలేదు. హీరోయిన్లు త్రిష కానీ.. రాధికా ఆప్టే కానీ పెద్దగా ఆకట్టుకోలేదు. త్రిష క్యారెక్టర్‌కైనా కొంచెం ప్రాధాన్యం ఉంది కానీ.. రాధికా ఆప్టేదైతే వేస్ట్‌ క్యారెక్టర్‌. ఇంత చెత్త పాత్రను ఆమె ఎందుకొప్పుకుందో ఏంటో. జయసుధ లాంటి నటికి ఇలాంటి క్యారెక్టర్‌ ఇవ్వాలని దర్శకుడికి ఎందుకనిపించిందో. ఎమ్మెస్‌ నారాయణ కానీ.. ఆలీ కానీ ఏమాత్రం నవ్వించలేకపోయారు. ఇంకా చెప్పుకోవాల్సిన పాత్రలేమీ లేవు సినిమాలో.

సాంకేతిక వర్గం:

మణిశర్మ ఫామ్‌లో లేడన్న సంగతి ఆడియో విన్నపుడే అర్థమైంది. పాటలు తెరమీద కూడా గొప్పగా ఏమీ లేవు. చిత్రీకరణ కూడా మామూలుగా ఉండటంతో పాటలు సినిమాకు ఆకర్షణ కాలేకపోయాయి. టైటిల్‌ సాంగ్‌, పిల్లా నువ్వేసుకున్న.. ఈ రెండు పాటలూ మాస్‌ను ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం కూడా మామూలుగానే ఉంది. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ స్పెషలిస్టు అయిన మణిశర్మ.. ఇందులోనూ మునుపటి ఫామ్‌ చూపించలేకపోయాడు. వెంకట్‌ ప్రసాద్‌ ఛాయాగ్రహణం ఓకే. యాక్షన్‌ సన్నివేశాలు బాగా తీశాడు. ఎడిటర్‌ గౌతం రాజు ప్రథమార్ధంలో సన్నివేశాల్ని చాలా ట్రిమ్‌ చేయాల్సింది. రెండో అర్ధభాగంలో మాత్రం కత్తెర పదును కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. అవసరానికి మించే ఖర్చు చేశారు. ఐతే గ్రాఫిక్స్‌, సీజీ వర్క్‌ అంత ఎఫెక్టివ్‌గా లేవు.

చివరిగా...

బాలయ్య ఫ్యాన్స్‌కు, మాస్‌ ఆడియన్స్‌కు ఓ మాదిరిగా 'లయన్‌' ఎక్కితే ఎక్కొచ్చు. కానీ ఓవరాల్‌గా మాత్రం నిరాశ పరుస్తుంది.