Begin typing your search above and press return to search.

నిర్మాత‌లు నిల‌బ‌డ‌తారా? ఎగ్జిబిష‌న్ రంగం ఉండాలి క‌దా! - బాల‌య్య‌

By:  Tupaki Desk   |   23 July 2021 4:38 AM GMT
నిర్మాత‌లు నిల‌బ‌డ‌తారా?  ఎగ్జిబిష‌న్ రంగం ఉండాలి క‌దా! - బాల‌య్య‌
X
ఈ క‌రోనా క‌ష్ట కాలంలో సినీప‌రిశ్ర‌మ బాగు విష‌యంలో ఇరు తెలుగు రాష్ట్రాలు స్పందిస్తున్న తీరు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఏమైందో కానీ ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి టాలీవుడ్ విష‌య‌మై ఏదో జ‌రుగుతోంద‌న్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. నిజానికి సీఎం జ‌గ‌న్ ఆంధ్ర ప్ర‌దేశ్ -విశాఖ ప‌ట్నంలో టాలీవుడ్ నిర్మించ‌త‌ల‌పెట్టినా సినీపరిశ్ర‌మ‌లో ఒక వ‌ర్గం నుంచి స‌రైన స్పంద‌న లేక‌పోవ‌డంతో ఆ త‌ర్వాత ప‌రిణామాలు వేగంగా మారాయ‌న్న‌ గుస‌గుస‌లు లేక‌పోలేదు.

ఇటీవ‌లి కాలంలో రాజ‌కీయ కార‌ణాల‌తో వ‌కీల్ సాబ్ టిక్కెట్టు ధ‌ర‌ల‌పై పంచ్ వేసిన ఏపీ ప్ర‌భుత్వం టిక్కెట్టు ధ‌ర‌ల త‌గ్గింపు జీవోని రిలీజ్ చేయ‌డంతో అది ప‌రిశ్ర‌మ‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. రాజ‌కీయ కార‌ణాల‌తో సినీప‌రిశ్ర‌మ‌ల్ని టార్గెట్ చేస్తున్నారా? అంటూ కొన్నాళ్లుగా ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ సాగుతోంది. నిజానికి టాలీవుడ్ కి ఏపీ ప్ర‌భుత్వం వ్య‌తిరేకం కాదు.. ఈ రంగంలో ఉన్న కొంద‌రు అంటేనే వ్య‌తిరేకం అన్న చర్చా హీట్ పెంచుతోంది.

అయితే ఇలాంటి స‌న్నివేశంలో న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ ఓ చానెల్ ఇంట‌ర్వ్యూలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఏపీ ప్రభుత్వం కన్ ఫ్యూజషన్ లో ఉందని ఏం చేస్తోందో అర్థం కాని ప‌రిస్థితిలో ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. క్రైసిస్ కాలంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి కొంత‌వ‌ర‌కూ స్ప‌ష్ఠ‌త వ‌చ్చినా ఏపీలో క్లారిటీ రాలేద‌ని అన్నారు. ఏపీలో టిక్కెట్ రేటు స‌హా ఆక్యుపెన్సీ మ్యాట‌ర్స్ లో త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని అన్నారు. మ‌రీ దారుణంగా ఏపీలో రూ20.. రూ.30 టిక్కెట్టు ధ‌ర‌ల్ని నిర్ణ‌యిస్తే ఎలా? నిర్మాత‌లు నిల‌బ‌డ‌తారా? ఎగ్జిబిష‌న్ రంగం ఉండాలి క‌దా! అని బాల‌య్య వ్యాఖ్యానించారు. ఇండ‌స్ట్రీ బాగు ప‌డాలంటే ప్ర‌భుత్వాలు సాయ‌ప‌డాల‌న్నారు.

పెద్ద సినిమాల కోసం జ‌నం థియేట‌ర్ల‌కు వ‌చ్చినా చిన్న సినిమాల కోసం రారు. చిన్న నిర్మాత‌ల‌ను ఆదుకోవాలి. అలాంటి నిర్మాత‌ల‌తో నేను మాట్లాడ‌తాను అని అన్నారు. ఇండస్ట్రీ ఇలా అయితే బాగుపడదు. విద్యుత్ టారిఫ్ స‌హా థియేట‌ర్ల‌ మెయింటెన్స్ ఖర్చులు పోవాలి. బ‌య్య‌రు పంపిణీదారు ఎగ్జిబిట‌రు అంతా బావుండాలి.. అని అన్నారు. చిన్న నిర్మాత‌లు కూరుకుపోతున్నారు.. వారి బాగుకు నిర్మాత‌ల మండ‌లి ఏదైనా పాల‌సీ మార్చాల‌ని సూచించారు.

ఏపీలో జీవో త‌లా తోకా లేని బీఫార‌మ్ లా ఉంద‌ని బాల‌య్య ఎద్దేవా చేశారు. దీనివ‌ల్ల‌నే ఓటీటీల్లో రిలీజ్ చేయ‌క త‌ప్ప‌డం లేద‌ని ... ఇదేమిటో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు అర్థం కావ‌డం లేద‌ని త‌న‌దైన శైలిలో ఏపీ ప్ర‌భుత్వంపై పంచ్ లు వేసారు. ఆ ష‌ర‌తులేమిలో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేద‌ని అన్నారు. ప్ర‌భుత్వాలు స‌హ‌క‌రించ‌క‌పోతే ప‌రిశ్ర‌మ మ‌నుగ‌డ సాగించ‌ద‌ని అన్నారు. ఇక ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం సింగిల్ స్క్రీన్ల‌కు పార్కింగ్ ఫీజు వెసులు బాటు స‌హా ప‌లు అవ‌కాశాల్ని క‌ల్పించిన సంగ‌తి తెలిసిన‌దే.

MAA ఎన్నిక‌లు సొంత భ‌వంతిపైనా పంచ్ లు

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు సెప్టెంబ‌ర్ లో జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో వ‌ర్గ పోరు ర‌చ్చ‌కెక్క‌డంపై బాల‌య్య పంచ్ లు విసిరారు. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ ఇటీవ‌ల నేరుగా బ‌రిలో దిగారు. న‌ట‌సింహా సూటిగా ప్ర‌శ్న‌లు కురిపించారు. మా అసోసియేష‌న్ కోసం ఇంతవరకు బిల్డింగ్ ఎందుకు కట్టలేక‌పోయార‌ని సీనియ‌ర్ హీరో బాల‌కృష్ణ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంతో రాసుకొని పూసుకొని తిరుగుతున్న సినీ పెద్దలు బల్డింగ్ కోసం ఓ ఎకరం భూమి సాధించలేరా? అని నిల‌దీశారు. నిధి సేక‌ర‌ణ కోసం అమెరికా వెళ్లిన స‌భ్యులు ఫస్ట్ క్లాస్ టాప్ క్లాస్ అంటూ ఫ్లైట్ లో ప్ర‌యాణించారు. ఆ కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బులు ఏమయ్యాయని సూటిగా అడిగారు.

మా బిల్డింగ్ కోసం అంతా పాటుపడాలని పిలుపునిచ్చిన ఆయ‌న భ‌వంతి నిర్మాణం విషయంలో విష్ణు ముందు తాను నిలుచుంటాన‌ని అన్నారు. అన్నివిధాలా స‌హ‌క‌రిస్తాన‌ని తెలిపారు. గ్లామర్ ఇండస్ట్రీలో ఇలాంటివి బహిరంగంగా చర్చించుకోవడం సరికాదని బాల‌య్య ఈ సంద‌ర్భంగా అన్నారు. లోకల్ నాన్‌ లోకల్ అంశంపై ప్ర‌స్థావిస్తూ అలాంటివి తాను ఏమాత్రం పట్టించుకోనని వివ‌ర‌ణ ఇచ్చారు.

గడిచిన నాలుగేళ్లుగా మూవీ ఆర్టిస్టుల సంఘంలో ర‌చ్చ పెద్ద మ‌చ్చ తెచ్చింద‌ని సినీపెద్ద‌లు న‌మ్ముతున్న సంగ‌తి తెలిసిందే. మా రాజ‌కీయాల‌న్నీ సొంత భ‌వంతి నిర్మాణం చుట్టూనే. ప్ర‌తి ఒక్క‌రూ ఆ టాపిక్ ని విడువ‌డం లేదు. ఈసారి డీసెన్సీ కోరుకున్నా అది క‌నిపించ‌లేద‌న్న ఆవేద‌న అలానే ఉంది. మా ఎలక్ష‌న్స్ ఇటీవ‌ల మ‌రోసారి జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్ మాదిరిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. ఎంత మంది ఉన్నా ఈసారి రేస్ లో ఇద్ద‌రి మ‌ధ్య మాత్రం పోటీ తీవ్రంగా ఉంది. సీనియ‌ర్ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ - మంచు విష్ణు మ‌ధ్య కీల‌క పోటీ జ‌ర‌గ‌నుంద‌ని భావిస్తున్నారు.