Begin typing your search above and press return to search.

కాసులు కురిపించిన కథను లైన్లో పెట్టేసిన బన్నీవాసు!

By:  Tupaki Desk   |   1 Nov 2021 1:30 AM GMT
కాసులు కురిపించిన కథను లైన్లో పెట్టేసిన బన్నీవాసు!
X
ఒకప్పుడు తమిళ సినిమాలను తెలుగులోకి ఎక్కువగా రీమేక్ చేసేవారు. కానీ ఇప్పుడు తెలుగు తెరపై మలయాళ సినిమాల జోరు నడుస్తోంది. చిరంజీవి .. పవన్ కల్యాణ్ .. వెంకటేశ్ .. వీళ్లంతా కూడా మలయాళ కథలను తెలుగు రీమేకులుగా బరిలోకి దింపుతున్నారు. మలయాళ కథల్లో కథ ఉంటుంది .. కథను విడిచిన ఖర్చు వాళ్ల సినిమాల్లో కనిపించదు. ఇక చిన్న లైన్ ను పట్టుకుని వాళ్లు తెరపై అద్భుతాలు చేస్తారు .. అడుగడుగునా ఆసక్తిని రేకెత్తిస్తారు. ఈ తరహా కథల పట్ల తెలుగు ప్రేక్షకులు కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

అలా ఇప్పుడు తెలుగు రీమేక్ గా మరో మలయాళ సినిమా రానుంది .. ఆ సినిమా పేరే 'నయాట్టు'. మలయాళంలో మార్టిన్ ప్రకట్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలై అక్కడ మంచి వసూళ్లను రాబట్టింది. సాధారణంగా నేరస్థులను పోలీసులు వెంటాడటం .. నేరస్థులు తప్పించుకోవడానికి అనేక దారులు వెతకడం చాలా కథల్లో కనిపిస్తుంది. కానీ ఒక నేరానికి కారకులైన పోలీసులను వెతికి పట్టుకోవడానికి పోలీసులే గాలించడం ఈ కథలోని కొత్తదనం. ఒక ఊళ్లో ఒక రౌడీ షీటర్ ఉంటాడు .. వాడంటే అక్కడ అందరికీ హడల్.

లోకల్ గా పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ లతో వాడికి గొడవ జరుగుతుంది. అనుకోకుండా ఒక రోజు రాత్రి ఆ రౌడీ షీటర్ అనుచరుడి బైక్ ను పోలీస్ జీప్ ఢీ కొంటుంది. దాంతో వాడు అక్కడికక్కడే చనిపోతాడు. కావాలనే పోలీసులు అలా చేశారని ఆ రౌడీ షీటర్ ఆగ్రహంతో ఊగిపోతుంటాడు. ఇక పోలీసులు చేసినా అది నేరమే కనుక మిగతా పోలీసులు , ఆ జీప్ లో ఉన్న పోలీసులను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తారు. దాంతో ఆ ముగ్గురు పోలీసులు అక్కడి నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం వాళ్లు ఏం చేస్తారు? పర్యవసానంగా ఏం జరుగుతుందనేదే కథ.

చాలా తక్కువ బడ్జెట్ లో .. తక్కువ పాత్రలతో .. అనూహ్యమైన మలుపులతో సాగేపోయే కథ ఇది. బన్నీవాసు - విద్యా మాధవి నిర్మిస్తున్న ఈ సినిమాకి కరుణకుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఇంతకుముందు ఈయన నుంచి 'పలాసా 1978' .. ' శ్రీదేవి సోడా సెంటర్' వచ్చాయి. 'నయాట్టు' తెలుగు రీమేక్ లో ప్రధానమైన మూడు పాత్రలకి గాను రావు రమేశ్ .. అంజలి .. ప్రియదర్శిని తీసుకున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.