Begin typing your search above and press return to search.

తిరుప‌తి మాడ‌వీధుల్లో న‌య‌న‌తార అప‌చారం

By:  Tupaki Desk   |   10 Jun 2022 1:13 PM GMT
తిరుప‌తి మాడ‌వీధుల్లో న‌య‌న‌తార అప‌చారం
X
స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార, ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ గ‌త ఐదేళ్లుగా ప్రేమ‌లో వున్నారు. అయితే పెళ్లి గురించి గ‌త కొన్నేళ్లుగా దాట‌వేస్తూ వ‌స్తున్నఈ జంట ఎట్ట‌కేల‌కు శుభ‌వార్త చెప్పింది. జూన్ 9న బంధు మిత్రులు, శ్రేయోభిలాషుల మ‌ధ్య పెళ్లి చేసుకోబోతున్నామంటూ ప్ర‌క‌టించింది. అన్న‌ట్టుగానే జూన్ 9న ఉద‌యం మ‌ద్రాసులోని మ‌హాబ‌లిపురంలో వున్న ఓ రిసార్ట్ లో న‌య‌న‌తార - విఘ్నేష్ శివ‌న్ ల వివాహం కుటుంబ స‌భ్యులు, శ్రేయోభిలాషులు, ఫిల్మ్ స్టార్స్ మ‌ధ్య అట్ట‌హాసంగా జ‌రిగింది.

ఇరు కుటుంబాల‌కు చెందిన బంధు మిత్రులతో పాటు అత్యంత స‌న్నిహితులు, త‌మిళ స్టార్ హీరోలు విజ‌య్‌, సూర్య‌, జ్యోతిక, సూప‌ర్ స్టార్‌ ర‌జ‌నీకాంత్‌, జ‌యం ర‌వి దంప‌తులతో పాటు ప‌లువురు కోలీవుడ్ స్టార్స్ పాల్గొన్నారు. వీరితో పాటు యంగ్ డైరెక్ట‌ర్ అట్లీ త‌న భార్య‌తో క‌లిసి పెళ్లికి హాజ‌ర‌య్యాడు. ఈ పెళ్లిలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కూడా పాల్గొని పెళ్లిలో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. పెళ్లి త‌రువాత న‌య‌న - విఘ్నేష్ ల‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

ఇదిలా వుంటే కొత్త జంట పెళ్లైన మ‌రునాడే తిరుపతి దేవ‌స్థానంలో ప్ర‌త్య‌క్ష‌మైంది. నూత‌న దంప‌తులు తిరుమ‌ల శ్రీ‌వారి ఆశీస్సులు పొంద‌డానికి శుక్ర‌వారం తిరుమ‌ల‌లో సంద‌డి చేశారు. స్వామివారిని క్యూ లైన్ లో వీఐపీ భ‌క్తుల‌తో క‌లిసి వెళ్లి ద‌ర్శించుకున్నారు. ఈ క్ర‌మంలో న‌య‌న‌తార వివాదంలో చిక్కుకుంది. పెళ్లైన సంతోషంలో వున్న న‌య‌న‌తార తిరుమ‌ల వీధుల్లో కాళ్ల‌కు చెప్పులు ధ‌రించి తిర‌గ‌డం, స్వామి ద‌ర్శ‌నం కోసం వెళుతున్న సంద‌ర్భంలో ఆ దృశ్యాల‌ని వీడియో తీస్తున్న వారు, ఫొటోగ్రాఫ‌ర్లు కూడా చెప్పులు వేసుకుని న‌య‌న - విఘ్నేష్ దంప‌తుల వెంట రావ‌డం.. ఇప్ప‌డు వివాదంగా మారింది.

న‌య‌న‌తార చెప్పులు వేసుకుని మాడ వీధుల్లో తిరుగుతున్న వీడియోలు నెట్టింట వైర‌ల్ కావ‌డంతో వివాదంగా మారింది. ఈ వీడియోలు, ఫొటోలు చూసిన వారంతా న‌య‌న‌తార‌పై కామెంట్ లు చేస్తున్నారు. స్వామివారు కొలువుదీరిన ప్రాంతంలో ఉన్న మాడ‌వీధులు ఎంతో ప‌విత్ర‌మైన‌వ‌ని, అలాంటి ప‌విత్ర‌మైన వీధుల్లో ఇలా బాధ్య‌త మ‌రిచి చెప్పులు వేసుకుని న‌య‌న తిర‌గ‌డం ఏమీ బాగాలేద‌ని ఆమెపై నెటిజ‌న్ లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. వెంట‌నే జ‌రిగిన త‌ప్పుని తెలుసుకుని స్వామివారిని క్ష‌మాప‌ణ కోరండ‌ని సూచిస్తున్నారు.