Begin typing your search above and press return to search.

మిసెస్ నయనతార- నో డౌట్స్

By:  Tupaki Desk   |   24 March 2018 10:00 PM IST
మిసెస్ నయనతార- నో డౌట్స్
X
ఒక హీరొయిన్ కెరీర్ దివ్యంగా వెలగడం అంటే మహా అయితే ఐదు లేదా ఎనిమిదేళ్ళు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో దశాబ్దానికి పైగా స్టార్ గా వెలుగొందటం అంటే మాటలు కాదు. దాన్ని నయనతార సాధ్యం చేసి చూపించింది. ఇప్పటికీ తన డిమాండ్ లో ఏ మాత్రం మార్పు లేని నయన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. దర్శకుడు విజ్ఞేశ్ శివన్ తో ప్రేమాయణం ఎప్పటి నుంచో సాగిస్తున్న నయన్ తానుగా ఆ విషయం ఎన్నడూ బయటపెట్టలేదు. కాని మీడియా కంటికి మాత్రం ఈ జంట రెగ్యులర్ గా దొరుకుతూనే ఉన్నారు. ఆ మధ్య విజ్ఞేశ్ శివన్ కు నానుం రౌడీ దా సినిమాకు అవార్డు వచ్చినప్పుడు స్టేజి పైకి నయనతారను ప్రత్యేకంగా పిలిపించి ఆమె చేతుల మీదుగా తీసుకునే వరకు వదిలిపెట్టలేదు. అప్పుడే కోలీవుడ్ మీడియా కన్ఫర్మ్ చేసేసింది. అతని బర్త్ డే ని అమెరికాలో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసిన నయన్ ఖరీదైన కారు కూడా గిఫ్ట్ గా ఇచ్చిందని తమిళ మీడియా తక్కువ ప్రచారం చేయలేదు.

సరే వీటికి తానే చెక్ పెడితే పోలా అని నిర్ణయించుకున్న నయనతార ఇటీవల ది హిందూ పత్రిక నిర్వహించిన వరల్డ్ అఫ్ విమెన్ 2018 అవార్డు ఫంక్షన్ లో దీనికి క్లారిటీ ఇచ్చేసింది. ఆ వేడుకలో ది హిందూ డాజ్లర్ అవార్డు గెలుచుకున్న నయనతార అది తీసుకున్న సందర్భంలో మాట్లాడుతూ తన తల్లితండ్రులు, స్నేహితులు మరియు నా కాబోయే భర్తకు ఈ ప్రయాణంలో తోడున్నందుకు థాంక్స్ అంటూ చెప్పడం వేలాది ఆహుతుల సాక్షిగా వీడియోలో కూడా రికార్డు అయ్యింది. అంటే విజ్ఞేశ్ శివన్ పేరు చెప్పకపోయినా ఇక్కడ ప్రస్తావించింది అతని గురించే అన్నది ఓపెన్ సీక్రెట్. త్వరలోనే మీడియా హడావిడికి దూరంగా ప్రత్యేకంగా ఆహ్వానించబడే అత్యంత దగ్గరి సన్నిహితుల మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నారని టాక్. అచ్చం అనుష్క శర్మ, శ్రేయ శరణ్ తరహాలో ఇది కూడా ఉండొచ్చు.

విజ్ఞేశ్ శివన్ ఇటీవలే సూర్య హీరోగా వచ్చిన గ్యాంగ్ సినిమా దర్శకుడు. కమర్షియల్ గా పర్వాలేదు అనిపించుకున్న ఆ మూవీ ఆశించిన విజయం దక్కించుకోలేదు. నయన్-విజ్ఞేశ్ మధ్య ప్రేమ నానుం రౌడీ దా షూటింగ్ నుంచి బాగా బలపడింది, అందులో మూగమ్మాయిగా నటించిన నయనతార పలు అవార్డులు కూడా గెలుచుకుంది. అందులో విజయ్ సేతుపతి హీరో. తెలుగులో నేనూ రౌడీనే పేరుతో డబ్ చేసారు కాని ఇక్కడ ఫ్లాప్ అయ్యింది.