Begin typing your search above and press return to search.

'గాడ్ ఫాదర్' షెడ్యూల్ కంప్లీట్ చేసిన నయన్!

By:  Tupaki Desk   |   17 Feb 2022 7:30 AM GMT
గాడ్ ఫాదర్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన నయన్!
X
నయనతార .. సమయాన్ని డబ్బుతో లెక్కగట్టగలిగిన కథానాయిక. ఆమెతో పాటు కెరియర్ ను మొదలుపెట్టిన చాలామంది కథానాయికలు, కెరియర్ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కుంటూ వెళుతున్నారు. కానీ కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి నయన్ వెనుదిరిగి చూసింది లేదు. అవకాశం పోతుందేమోననే ఆందోళనతో తన షరతులను సడలించినదీ లేదు. ఇక ఎంత స్టార్ హీరో అయినా ఆమె డేట్స్ కోసం ఎదురు చూడటమే తప్ప, అవకాశాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఆమెకి ఇంతవరకూ రాలేదు.

సాధారణంగా కథానాయికలు సినిమా సినిమాకి మరింత గ్లామరస్ గా కనిపించాలనుకుంటారు. ఫలానా స్టార్ హీరో సరసన చేస్తే మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తారు. అసలు అలాంటి ఆలోచనే చేయవసరం లేని కథానాయికగా నయనతార కనిపిస్తుంది. గ్లామరస్ గా కనిపించే పాత్రలను ఆమె పక్కన పెట్టేసి చాలాకాలమే అయింది. ఇప్పుడు నయన్ ను తీసుకోవడం వలన ఆ పాత్ర ద్వారా ఆమె అందించే నటన .. థియేటర్స్ కి ఆడియన్స్ ను రప్పించగలిగే ఆమె క్రేజ్ మాత్రమే ఆ సినిమాకి కలిసొస్తుంది.

తమిళంలోనే వరుస సినిమాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న నయనతారను, ఏ మాత్రం వీలు కుదిరినా తమ సినిమాల్లో చేయించాలని మలయాళ దర్శక నిర్మాతలు కాచుకుని కూర్చుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆమె తెలుగు సినిమాను అంగీకరించడమే కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి 'గాడ్ ఫాదర్'లో చేయడానికి నయనతార ఒప్పుకోవడం విశేషం. చిరంజీవికి గల క్రేజ్ ఒక కారణమైతే, ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజాతో నయన్ కి గల సాన్నిహిత్యం మరొక కారణమని చెబుతారు.

హైదరాబాదులో నయనతారకి సంబంధించిన ఒక కీలకమైన షెడ్యూల్ ము తాజాగా పూర్తి చేయడం జరిగిందని మోహన్ రాజా ట్వీట్ చేశాడు. ఆమెతో కలిసి మూడో సినిమాకి వర్క్ చేసే అవకాశం కలగడం తనకి చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పాడు. ఆ సందర్భంలో నయన్ తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు.

ఇంతకుముందు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'తని ఒరువన్' .. 'వేలైక్కారన్' సినిమాలలో నయన్ నటించింది. ఈ రెండు సినిమాలు కూడా తమిళనాట భారీ విజయాలను అందుకున్నాయి. ఇక 'గాడ్ ఫాదర్' ఈ ఇద్దరికీ హ్యాట్రిక్ హిట్ ఇస్తుందేమో చూడాలి.