Begin typing your search above and press return to search.

ఓటీటీ సూపర్‌ స్టార్‌ కు మనసు విరిగిందట

By:  Tupaki Desk   |   29 Oct 2021 4:30 PM GMT
ఓటీటీ సూపర్‌ స్టార్‌ కు మనసు విరిగిందట
X
బాలీవుడ్‌ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని నటుడు. అద్బుతమైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసిన గొప్ప నటుడు. సినిమాల్లోనే కాకుండా ఓటీటీ లో కూడా నవాజుద్దీన్ సిద్దిఖీ నటనతో మెప్పించాడు. పలు వెబ్ సిరీస్ ల్లో నటించి మెప్పించిన నవాజుద్దీన్ సిద్దఖీ సూపర్‌ సక్సెస్‌ నటుడిగా పేరు దక్కించుకున్నాడు. ఓటీటీ ల్లో పలు సూపర్‌ హిట్స్ ను దక్కించుకుని ఓటీటీ సూపర్ స్టార్‌ అంటూ కూడా అభిమానులతో పిలిపించుకున్నాడు. అలాంటి నవాజుద్దీన్ సిద్దిఖీ నుండి ఇంకా పలు వెబ్‌ సిరీస్ లను అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం అభిమానులకు షాకింగ్‌ గా ఉంది. ఇక మీదట ఓటీటీల్లో కనిపించేదే లేదు అంటూ తేల్చి చెప్పాడు.

ఓటీటీలు అనేవి కొత్త వారికి మంచి అవకాశంను ఇస్తున్నాయి.. నటుడిగా వెబ్‌ సిరీస్ లు మంచి అవకాశాలను తెచ్చి పెడతాయని ఆశించాను. ఆరంభంలో ఓటీటీ కంటెంట్ అంటే చాలా అభిమానం ఉండేది. కాని ఇప్పుడు ఓటీటీ కంటెంట్‌ ముఖ్యంగా వెబ్‌ సిరీస్ లు అంటే అసహ్యం కలిగే విధంగా పరిస్థితి తయారు అయ్యిందంటూ నవాజుద్దీన్ సిద్దిఖీ వ్యాఖ్యలు చేశాడు. శాక్రెడ్‌ గేమ్స్ లో నటిస్తున్న సమయంలో వెబ్‌ సిరీస్ అంటే చాలా ఎగ్జైట్ మెంట్‌ ఉండేది. వెబ్‌ సిరీస్ లు అంటే అప్పట్లో చాలా గౌరవం ఉండేది. కాని ఇప్పుడు వెబ్‌ సిరీస్ లు బూతులా మారాయి. అడ్డమైన కంటెంట్‌ తో వెబ్ సిరీస్ లను చేస్తున్నారంటూ ఆయన అసహనం వ్యక్తం చేశాడు. ఓటీటీ లో ఈమద్య కాలంలో అంతా కూడా బూతు కంటెంట్‌ ను చూపిస్తున్నారు. వెబ్‌ సిరీస్ అంటేనే బూతు అన్నట్లుగా జనాలు భావించే స్థితికి తీసుకు వచ్చారు.

ఇలాంటి వెబ్‌ కంటెంట్‌ ను ఇస్తున్న ఓటీటీ ల్లో నేను కనిపించాలంటే అసహ్యంగా అనిపిస్తుంది. అందుకే ఇకపై వెబ్‌ సిరీస్ ల్లో కాని.. వెబ్ మూవీస్ ల్లో కాని నటించాలని అనుకోవడం లేదు. కేవలం సినిమాల్లో మాత్రమే నటిస్తాను. ముందు ముందు వెబ్‌ కంటెంట్‌ అంటే మరింతగా బూతు అయ్యే అవకాశం ఉందని.. ఇప్పటికి అయినా ఓటీటీలు కాస్త దృష్టి పెట్టాలన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. బూతు కంటెంట్‌ లో నటించనక్కర్లేదు.. మంచి సబ్జెక్ట్‌ ఉన్న వెబ్ సిరీస్ ల్లో నటించవచ్చు కదా అంటూ అభిమానులు ఆయన్ను కోరుతున్నారు. ముందు ముందు అయినా నవాజుద్దీన్ సిద్దిఖీ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడేమో చూడాలి. ప్రస్తుతం పలు బాలీవుడ్‌ సినిమాల్లో ఈయన నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌ స్టార్స్ ఓటీటీ కంటెంట్‌ పై ఆసక్తి చూపిస్తున్న సమయంలో నవాజుద్దీన్ సిద్దిఖీ దాని నుండి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.