Begin typing your search above and press return to search.

ఫ్రీకీ అలీ చెడ్డీలు అమ్ముకున్నాడే!

By:  Tupaki Desk   |   26 Aug 2016 1:52 PM GMT
ఫ్రీకీ అలీ చెడ్డీలు అమ్ముకున్నాడే!
X
ఒక సినిమాను ఎలా ప్ర‌మోట్ చేసుకోవాలో బాలీవుడ్ న‌టులను చూసి నేర్చుకోవాల్సిందే. ప్ర‌చారం కోసం ఎక్క‌డికైనా వ‌చ్చేస్తారు. ఏదైనా చేసేస్తారు. టాప్ హీరోల ద‌గ్గ‌ర నుంచి కుర్ర హీరోల వ‌ర‌కూ ప్ర‌మోష‌న్ విష‌యంలో ఎలాంటి భేష‌జాల‌కూ పోరు. అప్పుడెప్పుడో అమీర్ ఖాన్ త‌న గెట‌ప్ మార్చి కోల్‌క‌తాలో జ‌నాల మ‌ధ్య తిరుగుతూ సినిమాను ప్ర‌మోట్ చేసుకున్నాడు. షారుఖ్‌, సల్మాన్లు కూడా ప్ర‌మోష‌న్ అంటే చాలు, ఎక్క‌డికైనా వ‌చ్చేస్తారు. ఇప్పుడు, త‌న తాజా చిత్రం కోసం హైద‌రాబాద్ లో చెడ్డీలు అమ్ముకోవ‌డానికి వ‌చ్చాడు న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధికీ.

గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్‌ - క‌హానీ - భ‌జ‌రంగీ భాయ్ జాన్ వంటి చిత్రాల ద్వారా న‌టుడిగా మంచి ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర‌చి, త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు న‌వాజుద్దీన్‌. అత‌డు హీరోగా ఫ్రీకీ అలీ అనే ఒక చిత్రాన్ని తెర‌కెక్కించాడు స‌ల్మాన్ సోద‌రుల్లో ఒక‌డైన సోహైల్ ఖాన్‌. స‌ల్మాన్ మ‌రో సోద‌రుడు అర్బాజ్ ఖాన్ ఈ చిత్రంలో ఒక ప్ర‌ముఖ పాత్ర పోషించాడు. ఫుట్ పాత్ మీద బ‌తికే ఓ వ్య‌క్తి అనూహ్యంగా గోల్ఫ్ ఛాంపియ‌న్ గా అవ‌త‌రించ‌డ‌మే ఈ చిత్రం క‌థ‌. సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల కానున్న ఈ చిత్ర ప్ర‌చారం కోసం గురువారం హైద‌రాబాద్ వ‌చ్చారు న‌వాజుద్దీన్‌.

చార్మినార్ సెంట‌ర్ వ‌ద్ద చెడ్డీలు అమ్ముతూ హ‌డావుడి చేశాడు. ఫ్రీకీ అలీ చిత్రంలో కూడా హీరో ఇలానే ఫుట్ పాత్ మీద చెడ్డీలు అమ్ముకునే పాత్ర‌. అందుకే, చార్మినార్ ద‌గ్గ‌ర చెడ్డీలు అమ్ముతూ త‌న చిత్రాన్ని ప్ర‌మోట్ చేసుకున్నాడు. న‌వాజుద్దీన్ చెడ్డీలు అమ్మ‌డం మొద‌లుపెట్టేస‌రికి ఆ ప్రాంత‌మంతా హ‌డావుడి నెల‌కొంది. రోడ్డెక్కి బాగానే చెడ్డీలు అమ్మిపెట్టాడు. మొత్తానికి త‌న చిత్రాన్ని వెరైటీగా ప్ర‌మోట్ చేసుకున్నాడు.