Begin typing your search above and press return to search.

కంటెంట్‌ ఉన్న కుర్రాడు

By:  Tupaki Desk   |   24 Jun 2019 4:59 AM GMT
కంటెంట్‌ ఉన్న కుర్రాడు
X
టాలీవుడ్‌ కు ప్రతి వారం కుర్ర హీరోలు పరిచయం అవుతూనే ఉంటారు. అయితే పరిచయం అయిన కుర్రాళ్లలో ఎంత మంది నిలబడగలరు అనేది నమ్మకం తక్కువే. కొత్తగా వచ్చే వారిలో ఎక్కువ శాతం మంది ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతారు. అయితే మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన నవీన్‌ పొలిశెట్టి మాత్రం టాలీవుడ్‌ లో జెండా పాతేస్తాడేమో అనిపిస్తుంది. తెలుగు కుర్రాడే అయినా కూడా ఉత్తరాది నుండి వచ్చిన నవీన్‌ కు టాలీవుడ్‌ ప్రేక్షకులు భవిష్యత్తులో బ్రహ్మరథం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు కుర్రాడైన నవీన్‌ గత కొంత కాలంగా ఉత్తరాది ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. హిందీలో వెబ్‌ సిరీస్‌ లతో పాటు పలు షోల ద్వారా నవీన్‌ హిందీ ప్రేక్షకులను మెప్పించాడు. ఉత్తరాదిన తన సత్తా చాటిన నవీన్‌ ఇప్పుడు తన సొంత ప్రాంతం అయిన తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటేందుకు 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రంతో వచ్చాడు. తెలుగులో మొదటి సినిమానే అయినా కూడా మంచి నటనతో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.

నటనతో పాటు ఈ చిత్రంకు స్క్రీన్‌ ప్లే కూడా నవీన్‌ అందించినట్లుగా తెలుస్తోంది. సినిమా మొత్తంను తన భుజాలపై నడిపించిన నవీన్‌ ను సత్తా ఉన్న కుర్రాడు అంటూ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. చాలా కాన్ఫిడెన్స్‌ తో ఉన్న నవీన్‌ కు ప్రస్తుతం పలు మంచి ఆఫర్లు తలుపు తడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా కెరీర్‌ ను ప్లాన్‌ చేసుకుని సినిమాలు చేస్తే నవీన్‌ కెరీర్‌ చాలా బాగుండే అవకాశం ఉంది. ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ కు ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువలో పూర్తి చేసిన కారణంగా సినిమా లాభాల బాటలో పడింది. నవీన్‌ రెండవ సినిమా ఎప్పుడు ఉంటుందో అనే ఆసక్తి అప్పుడే సినీ జనాల్లో వ్యక్తం అవుతోంది.