Begin typing your search above and press return to search.

క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్న జాతిరత్నం..?

By:  Tupaki Desk   |   18 March 2021 11:30 AM GMT
క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్న జాతిరత్నం..?
X
ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి సక్సెస్‌ అయిన వారిలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఒకరు. కెరీర్ స్టార్టింగ్ లో కొన్ని సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ లో మెప్పించిన నవీన్.. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో హీరోగా మారాడు. ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా వెంటనే 'చిచోరె' సినిమాతో బాలీవుడ్ లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా 'జాతిరత్నాలు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయాడు.

'జాతి రత్నాలు' సినిమా వచ్చి వారం అవుతున్నా తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్స్ లో హౌస్‌ఫుల్‌ బోర్డులు పెడుతున్నారు. చాలా రోజుల తర్వాత కడుపుబ్బా నవ్వించే కామెడీ సినిమా వచ్చిందంటూ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రూ.27 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఈ సినిమాతో నవీన్‌ పొలిశెట్టి క్రేజీ హీరోగా మారిపోయాడని చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు మన జాతిరత్నం రెమ్యునరేషన్‌ పెంచేశాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

'జాతిరత్నాలు' విజయంతో నవీన్ కి వరుస ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకునే క్రమంలో యువ హీరో పారితోషికం పెంచేసాడని అంటున్నారు. ఇప్పటికే 'రారా కృష్ణయ్య' ఫేమ్ మహేశ్‌ తో ఓ సినిమాకి అంగీకారం తెలిపాడని వార్తలు వస్తున్నాయి. అయితే దీని కోసం నవీన్ భారీగా డిమాండ్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నవీన్ కు ఉన్న క్రేజ్ ని చూసి నిర్మాతలు సైతం ఎంత అడిగినా ఇవ్వడానికి రెడీ అయ్యారట. ఇందులో స్టార్ హీరోయిన్‌ అనుష్క శెట్టి కూడా నటించనున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.