Begin typing your search above and press return to search.

మారుతి చుట్టు తిరిగి మళ్లీ అక్కడే ఆగాడుగా..!

By:  Tupaki Desk   |   4 Aug 2020 10:45 AM IST
మారుతి చుట్టు తిరిగి మళ్లీ అక్కడే ఆగాడుగా..!
X
దర్శకుడు మారుతి ప్రతి రోజు పండుగే చిత్రం తర్వాత పలువురు హీరోలకు కథలు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఆమద్య ఒక మెగా హీరోతో దాదాపుగా కన్ఫర్మ్‌ అయినట్లుగానే వార్తలు వచ్చాయి. కాని ఆమె మెగా హీరో ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల మారుతితో ఇప్పుడే కాదన్నాడట. హీరో కోసం వెదుకుతున్న మారుతికి కరోనా కారణంగా మరింత గ్యాప్‌ వచ్చింది. ఈ సమయంలోనే ఒక హీరోను సెట్‌ చేసుకుని వచ్చే ఏడాదిలో అయినా సినిమాను ప్రారంభించాలని మారుతి తీవ్రంగా ప్రయత్నాలు చేసి చివరకు నానిని ఒప్పించినట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

నాని మారుతిల కాంబోలో 2015 సంవత్సరంలో భలే భలే మగాడివోయ్‌ చిత్రం వచ్చింది. ఆ సినిమా ఇద్దరి కెరీర్‌ లో టర్నింగ్‌ పాయింట్‌ గా నిలిచింది. నాని మార్కెట్‌ పెంచడంతో పాటు ఆయన పారితోషికం మరియు ఆయన సినిమాల బడ్జెట్‌ పెరిగేలా చేసింది. ఇక మారుతి కూడా భలే భలే మగాడివోయ్‌ చిత్రంతో మొదటి ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ సక్సెస్‌ ను దక్కించుకున్నాడు. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన బన్నీ వాసుకు కూడా ఆ సినిమా ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పుడు అదే కాంబో సెట్‌ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

మారుతి దర్శకత్వంలో సినిమాను నిర్మించేందుకు బన్నీ వాసు రెడీగా ఉన్నాడు. నాని కూడా గత ఫలితం నేపథ్యంలో మారుతి దర్శకత్వంలో చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. కాని ప్రస్తుతం నాని టక్‌ జగదీష్‌ మరియు శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రాలకు కమిట్‌ అయ్యి ఉన్నాడు. టక్‌ జగదీష్‌ దాదాపుగా సగం షూటింగ్‌ పూర్తి అయ్యింది. త్వరలోనే శ్యామ్‌ సింగరాయ్‌ కూడా ప్రారంభం కాబోతుంది. మారుతితో సినిమా కన్ఫర్మ్‌ అయినా పట్టాలెక్కేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలో ఈ సినిమా విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని గీతా ఆర్ట్స్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది.