Begin typing your search above and press return to search.

'ఎందుకు నోరు మెదపడం లేదు. లీజు ఓనర్స్ కి భయపడా? మాఫియాకి భయపడా?'

By:  Tupaki Desk   |   8 Sept 2020 1:40 PM IST
ఎందుకు నోరు మెదపడం లేదు. లీజు ఓనర్స్ కి భయపడా? మాఫియాకి భయపడా?
X
ప్ర‌ముఖ నిర్మాత‌, ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్ర‌ట‌రీ న‌ట్టి కుమార్.. కరోనా కారణంగా మూసివేసిన థియేటర్లను రీ ఓపెన్ చేయకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినీ రంగంలో గత కొన్ని నెలలుగా చోటుచేసుకొన్న పరిణామాలపై ఘాటుగా స్పందించారు. థియేటర్లు ఓపెన్ చేయకపోవడం వెనుక కొందరి హస్తం ఉందని.. థియేటర్లను తెరవకపోవడం వెనుక పెద్ద లాబీయింగ్ జరుగుతోందని ఆరోపించారు. నట్టికుమార్ మాట్లాడుతూ.. ''గత కొన్ని నెలలుగా కరోనా వల్ల ఎన్ని కష్టాలు పడ్డామో ఎన్ని ఇబ్బందులు పడ్డామో అందరికి తెలుగు. యాక్టర్స్ నిర్మాతలు టెక్నీషియన్స్ అందరూ ఇబ్బందులు పడుతున్నారు. సినిమా ఫీల్డ్ ఏ అన్యాయం చేసింది? ఏ పాపం చేసిందని నేను అడుగుతున్నాను. 24 గంటల ప్రయాణం ఉన్న విమానాల్లో సీటింగ్‌ కెపాసిటీ మార్చకుండా రన్‌ చేస్తున్నారు. థియేటర్ల దగ్గరకు వచ్చేసరికి నిబంధనలు ఎందుకు మారాయి? థియేటర్లు మూసివేయడం వల్ల వేలాది కార్మికులు నష్టపోయారు. ఓటీటీల వల్ల చిన్న సినిమాలు నష్టపోతున్నాయి. థియేటర్ల మూసివేత సాకుతో ఓటీటీ ద్వారా పెద్ద హీరోల సినిమాలు విడుదల చేయడం ఎంతవరకు సమంజసం? హీరోలందరికీ కోట్ల మార్కెట్ కేవలం థియేటర్ల వల్లే వచ్చిందని గ్రహించాలి'' అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ''చిరంజీవి కొంతమంది పెద్దలు షూటింగులు చేసుకోడానికి అనుమతి అడిగారు . కానీ వాళ్లలో ఎవరు షూటింగ్ స్టార్ట్ చేశారు?. థియేటర్స్ ఓపెన్ చేయకుండా షూటింగులకు పర్మిషన్ ఎందుకు? థియేటర్స్ కి పర్మిషన్ వస్తే డిస్ట్రిబ్యూటర్ సినిమా కొనటానికి వస్తాడు.. తర్వాత షూటింగ్స్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చిన్న సినిమాలు రెడీగా ఉన్నాయి. చిన్న సినిమాలు నాశనం అయిపోవాలని కొంతమంది పెద్దలు ఆడుతున్న డ్రామా ఇది. చిన్న నిర్మాతలు బ్రతకకూడదు.. చిన్న నిర్మాతలు ఉండకూడదు. గ్రోత్ హీరోస్ మాత్రమే ఉండాలి. సపోర్ట్ లేనివారు ఇండస్ట్రీలో ఉండకూడదు అనుకుంటున్నారు. ఎల్ ఎల్ పి అనే కేవలం 21 మంది సినిమా రంగాన్ని శాసిస్తున్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఫిలిం ఛాంబర్ లను మూయించాలని ప్రయత్నం చేస్తున్నారు. చిన్న సినిమాలకు పబ్లిసిటీ లేకుండా కట్టడి చేశారు. దాంతో కొన్ని పత్రికలకు మాత్రమే వ్యాపార ప్రకటనలు ఇవ్వడం సాధ్యం కావడం లేదు. ఇలాంటి సమస్యలు తెలిసినా ఫిలిం ఛాంబర్ ఎందుకు మౌనం వహిస్తున్నది. కొందరి లాబీయింగ్ వల్ల నోరు మెదపడం లేదు. లీజు ఓనర్స్ కి భయపడా? మాఫియాకి భయపడా?. చిత్ర పరిశ్రమలో కొందరి లాబీయింగ్‌ వల్ల థియేటర్లు మూతపడ్డాయి. కరోనా కారణం చూపి థియేటర్లు తెరవకపోతే రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో ఉద్యమం మొదలవుతుంది. పిఠాపురం థియేటర్‌ లో ఫర్నీచర్‌ దొంగల పాలైంది. మరికొన్ని చోట్ల ఎలుకలు వల్ల కుర్చీలు నాశనమయ్యాయి. దీనికి బాధ్యులు ఎవరు?'' అని నట్టి కుమార్‌ ప్రశ్నించారు. కార్మికుల కోసం ఆలోచించే జగన్ మోహన్ రెడ్డి - కేసీఆర్ - అమిత్ షా - కిషన్ రెడ్డి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నట్టి కుమార్‌ కోరారు.